అస్మిత్ రెడ్డి అసలు విషయం చెప్పేశారా?

అనంత‌పురం జిల్లాలోని కీల‌క రాజ‌కీయ కుటుంబం జేసీ దివాక‌ర్ రెడ్డి ఫ్యామిలీ. విభిన్నమైన రాజ‌కీయాల‌కు కూడా కుటుంబం పెట్టింది పేరు. ఈ జిల్లాలోని తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌డిచిన [more]

Update: 2019-11-21 06:30 GMT

అనంత‌పురం జిల్లాలోని కీల‌క రాజ‌కీయ కుటుంబం జేసీ దివాక‌ర్ రెడ్డి ఫ్యామిలీ. విభిన్నమైన రాజ‌కీయాల‌కు కూడా కుటుంబం పెట్టింది పేరు. ఈ జిల్లాలోని తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌డిచిన 35 ఏళ్లలో ఏనాడూ ఓట‌మి ఎరుగ‌ని కుటుంబంగా కూడా జేసీ గుర్తింపు సాధించారు. ఆది నుంచి కాంగ్రెస్‌కు అత్యంత అనుకూల కుటుంబంగా ఉన్న జేసీ వ‌ర్గం.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తీసుకున్న నిర్ణయంలో భాగంగా టీడీపీవైపు మొగ్గు చూపించారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో దివాక‌ర్ రెడ్డి సోద‌రుడు ప్రభాక‌ర్ రెడ్డి కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.

తండ్రులు దూరంగా….

టీడీపీ త‌ర‌పున తాడిప‌త్రి నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. ఇక‌, జేసీ దివాక‌ర్ రెడ్డి అనంత‌పురం ఎంపీగా గెలుపు గుర్రం ఎక్కారు. అయితే, ఇప్పుడు ఈ ఫ్యామిలీలో రాజ‌కీయ క‌ల‌క‌లం ఏర్పడింది. విష‌యంలోకి వెళ్తే.. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో.. జేసీ దివాక‌ర్‌, ప్రభాక‌ర్ బ్రద‌ర్స్ ఇద్దరూ కూడా ప్రత్యక్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొని.. త‌న వార‌సుల‌ను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో దివాక‌ర్ త‌న‌యుడు ప‌వ‌న్ కుమార్‌రెడ్డి, జేసీప్రభాక‌ర్ త‌న‌యుడు అస్మిత్ రెడ్డి ఇద్దరూ ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో పోటీకి దిగారు.

వచ్చే ఎన్నికల నాటికి….

అనంత‌పురం ఎంపీగా ఒక‌రు, తాడిప‌త్రి ఎమ్మెల్యేగా మ‌రొక‌రు పోటీ చేశారు. గెలుపుపై అత్యంత ధీమా పెట్టుకున్నారు. త‌మ‌కు తిరుగే లేద‌ని అనుకున్నారు. అయితే, జ‌గ‌న్ సునామీ, వైసీపీ ప్రభావం నేప‌థ్యంలో ఇద్దరు వార‌సులు కూడా చ‌తికిల ప‌డ్డారు. స‌రే, రాజ‌కీయాల‌న్నాక‌.. గెలుపు, ఓట‌ములు స‌హ‌జం. ఈ నేప‌థ్యంలో దీనిని లైట్‌గానే తీసుకున్నారు. మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో సత్తా చాటేందుకు ఎలాగూ ఛాన్స్ ఉంటుంది. ఇద్దరు వార‌సులు యువ‌కులే కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ప్లాన్ చేసుకోవ‌చ్చని భావించారు. కానీ, ఇప్పుడు ప్రభాక‌ర్ రెడ్డి కానీ, ఆయ‌న కుమారుడు కానీ రాజ‌కీయాల్లో యాక్టివ్ పొజిష‌న్ నుంచి త‌ప్పుకొన్నారు.

జేసీ యాక్టివ్ గా ఉన్నా….

ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం జేసీ దివాక‌ర్ రెడ్డి యాక్టివ్‌గానే ఉన్నప్పటికీ.. ప్రభాక‌ర్ రెడ్డి మాత్రం ఎక్కడా క‌నిపించ‌డం లేదు. స‌రే. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి ఐదు మాసాలే క‌దా అయింది అని స‌రిపెట్టుకున్నా.. ప్రభాక‌ర్ కుమారుడు అస్మిత్ రెడ్డి స‌డెన్‌గా ఓ బాంబు పేల్చాడు. త‌న‌కు పాలిటిక్స్‌పై ఇంట్రస్ట్ లేద‌ని ఇటీవ‌ల స‌న్నిహితుల‌తో పెట్టుకున్న స‌మావేశంలో ఆయ‌న వెల్లడించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

రాజకీయాలు పడవంటూ….

ప్రస్తుతం దివాక‌ర్ ట్రావెల్స్‌కు సీఈవోగా ఉన్న అస్మిత్‌ రెడ్డి.. దీనినే చూసుకుంటాన‌ని, మ‌రిన్ని రాష్ట్రాల్లో ట్రావెల్ బిజినెస్‌ను విస్తరిస్తాన‌ని, రాజకీయాల‌కు త‌న‌కు స‌రిప‌డ‌డం లేద‌ని అన్నట్టు తెలిసింది. దీంతో జేసీ కుటుంబం కూడా ఒక్కసారిగా నిర్ఘాంత పోయింది. గెలుపు-ఓట‌ములు స‌హ‌జ‌మే అయినా.. ఇలా ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవ‌డంపై మాత్రం అటు జేసీ దివాక‌ర్‌, ఇటు ప్రభాక‌ర్ ఇద్దరూ కూడా మ‌ద‌న‌ప‌డుతున్నార‌ని స‌మాచారం.

వైసీపీలోకి వెళ్లాలని….

అనంత ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన జేసీ దివాక‌ర్ వార‌సుడు పవ‌న్‌కుమార్ రెడ్డి కొన్నాళ్లు టీడీపీలో ఉందాం… ఆ త‌ర్వాత ప‌రిస్థితి బాగోపోతే అప్పుడు పార్టీ మారి అయినా రాజ‌కీయం చేద్దామ‌న్న ఆలోచ‌న‌లో ఉంటే… అస్మిత్ రెడ్డి మాత్రం అస‌లు రాజ‌కీయాలే ఇంట్రస్ట్ లేద‌ని చెప్పడంతో పాటు టీడీపీలో ఉండి రాజ‌కీయాలు చేయ‌డం వేస్ట్‌.. అయితే గియితే వైసీపీలోకి పోదాం.. లేక‌పోతే రాజ‌కీయం మానేద్దాం అంటున్నట్టు జేసీ స‌న్నిహితుల టాక్‌. మ‌రి భవిష్యత్తులో అయినా జేసీ వార‌సులు రాజ‌కీయంగా నిల‌దొక్కుకుంటారా ? లేదా ? వాళ్ల పొలిటిక‌ల్ హిస్ట‌రీకి ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటారా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News