మా దారి వేరే… జేసీ బ్రదర్స్ అదుర్స్

జేసీ సోదరులు ఎప్పుడూ భిన్నమే. వాళ్లు పార్టీల కంటే తమ సొంత పట్టు కోసమే ప్రయత్నిస్తుంటారు. తమ కుటుంబం ఇమేజ్ కోసం, ఆధిపత్యం కోసమే జేసీ సోదరులు [more]

Update: 2021-09-05 08:00 GMT

జేసీ సోదరులు ఎప్పుడూ భిన్నమే. వాళ్లు పార్టీల కంటే తమ సొంత పట్టు కోసమే ప్రయత్నిస్తుంటారు. తమ కుటుంబం ఇమేజ్ కోసం, ఆధిపత్యం కోసమే జేసీ సోదరులు నిత్యం పోరాటం చేస్తుంటారు. వారు ఏ పార్టీలో ఉన్నా తమకంటూ ఒక ముద్రను వేసుకోవడంలో ఇప్పటి వరకూ జేసీ సోదరులు సక్సెస్ అయ్యారు. రాజకీయాలు తమ ఇంటి గడపలోనే ఉంటాయన్నది వారి నమ్మకం. సీమ ప్రాంతంలో ముఖ్యంగా అనంతపురంలో జేసీ సోదరులు ఎప్పటికప్పుడు రాజకీయంగా కొత్త ఎత్తులు వేస్తుంటారు.

చావు దెబ్బతిని…..

గత ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా జేసీ సోదరులు రాజకీయంగా చావు దెబ్బతిన్నారు. వారి వారసులిద్దరూ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే తాడిపత్రిలో ఓటమి పాలు కావడం జేసీ కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జేసీ సోదరులు తమ సత్తాచాటారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మున్సిపాలిటీలు వైసీపీ పరమయినా తాడిపత్రిలో మాత్రం జేసీ సోదరులు తమ పరువును కాపాడుకోగలిగారు.

విజయం సాధించి…

నిజంగా ఇది టీడీపీ విజయం కాదు. జేసీ సోదరుల విజయమే. రెండో వైస్ ఛైర్మన్ పదవిని కూడా జేసీ సోదరులు తమ ఖాతాలో వేసుకోవడంతో ఇక్కడ తమకు తిరుగులేదని నిరూపించుకోగలిగారు. అయితే టీడీపీ ఆందోళన కార్యక్రమాలను తొలి నుంచి వీరు పెద్దగా పట్టించుకోరు. పట్టించుకోలేదు కూడా. కానీ సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటూ తమ కుటుంబ ఇమేజ్ ను పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు.

సీమ నీటి సమస్యపై…

అందుకే ఇప్పుడు సీమ నీటి సమస్యపై ఉద్యమాన్ని ప్రారంభించాలని జేసీ సోదరులు నిర్ణయించినట్లు కనపడుతుంది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీలకతీతంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని కూడా కలిశారు. విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ లను కూడా కలుస్తానని తెలిపారు. సీమ నీటి సమస్య ఇన్నాళ్లకు జేసీ సోదరులకు గుర్తొచ్చినట్లుంది. అంతకు ముందు కాంగ్రెస్ లో దశాబ్దకాలంగా, టీడీపీలో ఐదేళ్ల అధికారంలో ఉన్నా వీరికి సీమ నీటి సమస్య కనపడ లేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద పార్టీని పక్కన పెట్టి జేసీ సోదరులు సొంతంగా ఇమేజ్ బిల్డప్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇవి ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News