వర్గం కొలాప్స్ అయినట్లేనా?
అనంతపురం రాజకీయాలను శాసిస్తున్న జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి వర్గంలో ముసలం పుట్టిందనే వార్తలు వస్తున్నాయి. తమకు తిరుగులేదని ఇప్పటి వరకు చెప్పుకొస్తున్న జేసీ వర్గానికి ఇప్పుడు బలమైన [more]
అనంతపురం రాజకీయాలను శాసిస్తున్న జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి వర్గంలో ముసలం పుట్టిందనే వార్తలు వస్తున్నాయి. తమకు తిరుగులేదని ఇప్పటి వరకు చెప్పుకొస్తున్న జేసీ వర్గానికి ఇప్పుడు బలమైన [more]
అనంతపురం రాజకీయాలను శాసిస్తున్న జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి వర్గంలో ముసలం పుట్టిందనే వార్తలు వస్తున్నాయి. తమకు తిరుగులేదని ఇప్పటి వరకు చెప్పుకొస్తున్న జేసీ వర్గానికి ఇప్పుడు బలమైన దెబ్బతగిలిందని అంటున్నారు. విషయంలోకి వెళ్తే అనంతపురంలోని తాడిపత్రి నియోజకవర్గంలో దాదాపు 35 ఏళ్లుగా చక్రం తిప్పుతున్న జేసీ దివాకర్ రెడ్డి వర్గం 2014 ఎన్నికల్లో పార్టీ మారినప్పటికీ తమ హవాను చూపించింది. అనంతపురం ఎంపీ సీటు సహా తాడిపత్రి నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అయితే, తర్వాత జేసీ దివాకర్ రెడ్డి సోదరుల తీరు తీవ్ర వివాదాస్పదమైంది.
వివాదాలతో…
స్థానికంగా ఉన్న ఓ ఆశ్రమ భూములపై కన్నేయడంతో ఆ ఆశ్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున రగడ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పటి ఎంపీగా ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారానికి కారణమైంది. ఇదిలావుంటే, గత ఏడాది ఎన్నికల్లో ఈ సోదరుల ఇద్దరి వారసులు ఎన్నికల్లో పోటీ చేయడం, ఘోరంగా ఓటమిపాలవడం కూడా తెలిసిందే. అయితే, ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి వర్గం టీడీపీలో ఉన్నప్పటికీ మనసంతా కూడా బీజేపీ వైపే లాగుతోంది. దీంతో త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు.
మైనారిటీ వర్గం…
కానీ, జేసీ దివాకర్ రెడ్డి వర్గానికి అనుకూలంగా ఉన్న ముస్లింలు ఇప్పుడు జేసీ బ్రదర్స్‌పై తిరుగుబావుటా ఎగురవేస్తున్నారట. కొన్ని దశాబ్దాలుగా మేం మీతో ఉన్నామని, కనీసం మా మనోభావాలకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండానే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు.. మీరు ఏ పార్టీలో చేరితే.. ఆ పార్టీకి మేం ఎందుకు పనిచేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామం జేసీ బ్రదర్స్‌ను డిఫెన్స్‌లో పడేసిందని అంటున్నారు. నిజమే కొన్ని దశాబ్దాలుగా అన్ని సామాజిక వర్గాలను వాడుకుంటున్న వీరు ఇప్పటి వరకు వారికి ఫేవర్‌గా ఏ ఒక్క పనికూడా చేయలేదనేది వాస్తవం.
బీజేపీ నేతలతో టచ్ లో….
అయితే, ఇప్పుడు ఏకంగా బీజేపీకి అనుకూలంగా ఈ ఇద్దరు సోదరులు ప్రకటనలు చేయడం ఇటీవల కేంద్ర మంత్రి హోదాలో బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి అనంతపురానికి వచ్చినప్పుడు దివాకర్‌రెడ్డి పనిగట్టుకుని ఆయనను కలుసుకోవడం, తాను త్వరలోనే బీజేపీలోకి చేరతానని ప్రకటించడంతో ముస్లిం వర్గం సహా ఎస్సీ వర్గాలు ఆయనపై మండి పడుతున్నాయి. ఇటీవల అనంతపురంలో కేంద్రం తీసుకువచ్చిన ఎన్నార్సీ, సీఏఏ బిల్లులకు వ్యతిరేకంగా ముస్లింలు ఆందోళన చేపట్టారు.
ఇప్పటికే రెడ్డి సామాజికవర్గం…
ఈ కార్యక్రమానికి హాజరు కావాలని జేసీ బ్రదర్స్ ఇద్దరినీ ముస్లిం పెద్దలు ఆహ్వానించారు. దీంతో ముందు వస్తామని చెప్పిన వీరు.. తర్వాత కార్యక్రమం జరిగే రోజు మాత్రం హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు ముస్లింలు జేసీ బ్రదర్స్‌పై విరుచుకుపడుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారా? ఇన్నాళ్లు మేం మీకు అండగా ఉన్నాం.. ఇప్పుడు మాకు సాయం చేయలేరా ? ఇకపై మాదారి మాదే అంటూ ప్రకటిస్తున్నారట. మరి ఈ నేపథ్యంలో జేసీ వర్గంలో అంతర్మథనం ప్రారంభమైందని అంటున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం కూడా జేసీ బ్రదర్స్‌కు దూరమైందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాన్ని సీరియస్‌గా భావించాల్సి వస్తోందని అంటున్నారు పరిశీలకులు.