గాడ్ ఫాదర్ గా మారుతున్న జేసీ ?

రాయలసీమలో జేసీ దివాకర్ రెడ్డి పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ఆ మాటకు వస్తే రాష్ట్ర రాజకీయాల్లో కూడా జేసీ పేరు ఎపుడూ ఏదో రకంగా [more]

Update: 2021-01-13 14:30 GMT

రాయలసీమలో జేసీ దివాకర్ రెడ్డి పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ఆ మాటకు వస్తే రాష్ట్ర రాజకీయాల్లో కూడా జేసీ పేరు ఎపుడూ ఏదో రకంగా మారుమోగుతూ ఉంటుంది. జేసీ దివాకరరెడ్డి, ప్రభాకరరెడ్డి బ్రదర్స్ దశాబ్దాలుగా అనంతపురం జిల్లా రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. పార్టీలు ఏవైనా వారి హవాకు తిరుగులేదు. అలా రాజకీయాలకు అతీతంగా బంధాలు పెనవేయడంతో జేసీల మార్కే వేరు. కానీ అన్ని రోజులూ ఒకేలా ఉండవు. అలాగే అన్ని రాజకీయాలతోనూ బంధాలు కలవవు. ఇపుడు జగన్ ఏలుబడిలో అదే జేసీలు చూస్తున్న చేదు అనుభవాలుగా ఉన్నాయి.

తీరు మారినా నోరు అలాగే ….

తాము ఇపుడు విపక్షంలో ఉన్నాము అన్న స్పృహ జేసీ బ్రదర్స్ కి లేకపోవడం వల్లనే అన్ని రకాలుగా కార్నర్ అవుతున్నారు అంటున్నారు. పైన ఉన్నది జగన్. మాటకు మాట, దెబ్బకు దెబ్బ తీయగల సమర్ధుడు అని తెలిసి కూడా జేసీ బ్రదర్స్ తరచూ పరాచికాలు ఆడుతారు. కోరి మరీ కెలికించుకుంటారు. దాంతో తప్పు మీద తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఇక తాజాగా అమరణ దీక్షలంటూ జేసీ బ్రదర్స్ సరికొత్త డ్రామాకు తెర తీశారు. పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు. పైగా కొత్త కేసులు కూడా వచ్చి చేరాయి.

దెబ్బకు ఎంపీగా….

అప్పట్లో చంద్రబాబు జమానాలో తమకు ఎదురులేదనికు జేసీ బ్రదర్స్ చెలరేగిపోయారు. నాడు ఒక సిఐ గా ఉన్న గోరంట్ల మాధవ్ మీద జేసీ దివాకరరెడ్డి దురుసు చేశారు. దాంతో ఆయన‌ ముందే మీసం మెలేసిన మాధవ్ ఖాకీ చొక్కా వదిలేసి పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఏకంగా హిందూపురం ఎంపీ అయ్యారు. ఆ దెబ్బకు జేసీ బ్రదర్స్ ఎంపీ, ఎమ్మెల్యే ఉద్యోగాలు రెండూ ఊడాయి. ఇంత జరిగినా జేసీ దివాకర్ రెడ్డి ఏమీ మారలేదు. తాజాగా ఫాం హౌస్ లో తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల మీద అనలేని అసభ్యకరమైన మాటలు అనేశారు. దాంతో పోలీసులు ఆయన మీద గట్టిగానే నోరు చేశారు. మరి వారిలో కూడా రోషం రగిలిస్తే జేసీ ఇలాకాలోనే మరో ఎంపీ ఎమ్మెల్యే అయినా తయారు అవుతారు అని సెటైర్లు పడుతున్నాయి.

తగ్గిపోతూ కూడా….

నిజానికి రాజకీయాలో చర్యలకు ప్రతి చర్యలు ఉంటాయి. తాను పవర్ లో ఉన్నపుడు గట్టిగా ఓవర్ యాక్షన్ చేస్తే దిగిపోయాక వాటి ఫలితాలు అనుభవించాల్సి ఉంటుంది. అంతే కాదు, ఎవరినైనా ఎదిరించి అదిలిస్తే వారు చిన్న వారుగానే అలాగే ఎప్పటికీ ఉండిపోరు. పంతం పౌరుషం జత కలిపి మరీ గోరంట్ల మాధవ్ మాదిరిగా ఎంపీలు అయి రాజకీయంగానూ పెను సవాల్ చేస్తారు. ఇపుడుజేసీ దివాకర్ రెడ్డి విపక్షంలో ఉండి కూడా నోరు చేస్తే మరింతమంది మాధవ్ లు తయారై పొలిటికల్ గా చాలెంజ్ చేయడం ఖాయం. మొత్తానికి మాధవ్ లాంటి ఎందరొకో తెలియకుండానే రాజకీయ గాడ్ ఫాదర్ గా జేసీ దివాకరరెడ్డి మారుతున్నారన్న సంగతిని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత త్వరగా నోటికి లాక్ పడుతుంది.

Tags:    

Similar News