జేసీ చెబితే ఆలోచిస్తామన్నారట

ఏపీ రాజకీయాల్లో జేసీ దివాకరరెడ్డి ఒక ప్రత్యేకమైన నాయకుడు. ఆయన కాంగ్రెస్ లో పుట్టి పెరిగి చివరికి 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరారు. ఆ పార్టీలో ఒకసారి [more]

Update: 2020-01-30 15:30 GMT

ఏపీ రాజకీయాల్లో జేసీ దివాకరరెడ్డి ఒక ప్రత్యేకమైన నాయకుడు. ఆయన కాంగ్రెస్ లో పుట్టి పెరిగి చివరికి 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరారు. ఆ పార్టీలో ఒకసారి ఎంపీగా పనిచేసిన జేసీ దివాకర్ రెడ్డి 2019 ఎన్నికలు వచ్చేసరికి పోటీ చేయనని తప్పుకున్నారు. అప్పటి రాజకీయ వాతావరణం వైసీపీకి అనుకూలంగా ఉండడంతో కొడుకు పవన్ రెడ్డిని బరిలోకి దింపి తెర వెనక్కు వెళ్ళారు. ఇక ఎన్నికల ఫలితాలకు ముందు జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు వద్ద చేసిన హడావుడి అంతా ఇంతా కాదు, కచ్చితంగా చంద్రబాబు గెలుస్తాడని, పసుపు కుంకుమ స్కీమ్ సొమ్ము బాగా పనిచేసిందని జేసీ దివాకర్ రెడ్డి బాబుని ఉబ్బించారు. తీరా రిజల్ట్ వేరేగా ఉండటమే కాదు, ఘోరంగా టీడీపీకి ఘోరీ కట్టింది.

బీజేపీతోనట….

బీజేపీతో కలసి వెళ్తే టీడీపీ ఓడిపోయేది కాదని జేసీ దివాకర్ రెడ్డి అంటున్నారు. తాజాగా ఆయన ఒక ఛానల్ ఇంటర్యూలో మాట్లాడుతూ బాబు మోడీతో కయ్యం పెట్టుకోవడమే కొంప ముంచిందని కూడా విశ్లేషించారు. బీజేపీ అండ లేకపోవడం వల్ల చంద్రబాబు దారుణంగా పరాజయం పాలయ్యారని జేసీ అంటున్నారు. అయితే ఎన్నికల ఫలితాల తరువాత ఆ సత్యాన్ని బాబు గ్రహించారని, ఇపుడు తమ నాయకుడు బాగా తగ్గారని కూడా జేసే చెప్పుకుంటున్నారు. 2014 మాదిరిగానే చంద్రబాబు, పవన్, బీజేపీ కలిస్తే 2024లో విజయం మళ్ళీ బాబుదేనని జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెబుతున్నారు.

నడ్డాకు చెప్పారట…

ఏపీలో చంద్రబాబుని కలుపుకుని పోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు స్వయంగా తాను చెప్పినట్లుగా జేసీ దివాకర్ రెడ్డి గుట్టు బయటపెట్టారు. ఈ మధ్యన తాను ఢిల్లీ వెళ్ళి బీజేపీ అగ్ర నేతలను వరసగా కలిశానని, వారికి ఏపీలో రాజకీయ పరిస్థితులను పూర్తిగా వివరించానని కూడా జేసీ వెల్లడించారు. పనిలో పనిగా నడ్డాతో భేటీ వేసి మరీ బాబుతో పొత్తు గురించి కదిపానని కూడా జేసీ చెప్పడం విశేషం. బాబు ఏపీలో బలమైన నాయకుడని, ఆయనతో కలసి వెళ్తేనే బీజేపీకి కూడా బాగుంటుందని తాను గెలుపు మంత్రం గురించి వివరించానని జేసీ అంటున్నారు.

జగన్ ని కొట్టాలంటే…?

జగన్ అన్ని రకాలుగా ఆయుధాలు వాడేస్తున్నాడని, ఏపీలో తన ఇష్టం వచ్చిన పాలన చేస్తున్నాడని కూడా జేసీ దివాకర్ రెడ్డి గుస్సా అవుతున్నారు. జగన్ పాలన దూకుడు ఇలాగే ఉంటే మాజీ అవడం ఖాయమని కూడా ముందే ప్రజా తీర్పు చెబుతున్న జేసీ మూడు పార్టీలుగా మళ్ళీ విడిగా వెళ్తే జగన్ ని కొట్టడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా బాబు, పవన్, బీజేపీ కలిస్తే మాత్రం జగన్ ఇంటికి వెళ్ళడం ఖాయమని అంటున్నారు. ఇదే విషయం బీజేపీ పెద్దలతో చెప్తే ఆలోచిస్తామని హామీ ఇచ్చారని కూడా జేసీ అంటున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని, 2024లో బాబుకు అవకాశం దక్కుతుందని జేసీ ధీమాగా చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తూంటే బాబు తరఫున జేసీ ఢిల్లీ రాయబేరాలు బాగానే చక్కబెడుతున్నట్లుగా అర్ధమవుతోంది.

Tags:    

Similar News