జేసీ కసి నెరవేరుతుందా?

జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు కసితో ఊగిపోతున్నారు. ఆర్థికంగా, మానసికంగా తమ కుటుంబాన్ని వైసీపీ ప్రభుత్వం వేధిస్తుండటంతో జేసీ బ్రదర్స్ ఉక్కిరిబిక్కిరి అవతున్నారు. కేసు వెంట కేసు [more]

Update: 2020-10-28 08:00 GMT

జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు కసితో ఊగిపోతున్నారు. ఆర్థికంగా, మానసికంగా తమ కుటుంబాన్ని వైసీపీ ప్రభుత్వం వేధిస్తుండటంతో జేసీ బ్రదర్స్ ఉక్కిరిబిక్కిరి అవతున్నారు. కేసు వెంట కేసు వచ్చిపడుతుండటంతో తట్టుకోలేక పోతున్నారు. అయితే ఇప్పటి వరకూ భరిస్తూ వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి ఇది తమ సమయం కాదని అంటున్నారు. తమకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కసి తీర్చుకుంటామని చెబుతున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు…..

రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి హవా అంతా ఇంతా కాదు. ఆయన చెప్పిందే వేదం అన్నట్లు నడిచేది. కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం కొనసాగిన జేసీ దివాకర్ రెడ్డి 2014లో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. వైసీపీ నుంచి ఆఫర్ ఉన్నా జేసీ కుటుంబం టీడీపీ వైపే మొగ్గు చూపింది. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో జేసీ కుటుంబం ఆడిండి ఆట పాడింది పాట అన్నట్లు తయారయింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యే ప్రశ్నే లేదని భావించిన బ్రదర్స్ జగన్ పై వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు.

పదిహేను నెలల నుంచి……

అయితే 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. వరస కేసులు వెంటాడుతున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. మళ్లీ జేసీపై రెండు కేసులు నమోదయ్యాయి. మరోవైపు మైనింగ్ వ్యాపారాన్ని కూడా అధికారులు నిలిపివేయడంతో జేసీ కుటుంబం తల్లడిల్లి పోతుంది. జేసీ దివాకర్ రెడ్డికి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా కేసులతో శారీరకంగా, మానసికంగా వ్యాపారాలను దెబ్బతీసి ఆర్థికంగా జేసీ కుటుంబం కోలుకోలేకుండా ఉంది.

ప్రతీకారం తప్పుదు……

కానీ జేసీ దివాకర్ రెడ్డి ఏమాత్రం తగ్గడం లేదు. టీడీపీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకంతో జేసీ ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసుకు కేసు.. రద్దుకు రద్దు అంటున్నారు. అధికారులను కూడా వదిలేది లేదని బహిరంగంగానే చెబుతున్నారు. తమను వేధించిన వారిని వదిలేది లేదంటున్నారు. చంద్రబాబు అంగీరించకపోయినా తాము వత్తిడి తెచ్చి పగ తీర్చుకునేది ఖాయమని జేసీ దివాకర్ రెడ్డి ఇటు అధికారులకు, అటు వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తం మీద పెద్దాయన కసి మీదున్నారు. మరి టీడీపీ అధికారంలోకి వస్తుందా? లేదా? అన్నది తెలియాలంటే మూడేళ్లు ఆగాల్సిందే.

Tags:    

Similar News