భజనకు వేళాయరా…!!

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఎవరు అతీతులు కాదు. ఏపీలో కొన్ని సంఘాలు కూడా ఇందుకు అతీతంగా లేవు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన [more]

Update: 2019-09-09 16:30 GMT

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఎవరు అతీతులు కాదు. ఏపీలో కొన్ని సంఘాలు కూడా ఇందుకు అతీతంగా లేవు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భజన సంఘాలకు పెద్దగా పని లేకుండా పోయింది. గత ఐదేళ్లలో ప్రభుత్వ నిర్ణయాలకు చిడతలు వాయించడంలో అన్ని సంఘాలు పోటీలు పడ్డాయి. ప్రభత్వ పోరాట దీక్షలు, నిర్మాణ దీక్షల్లో ఈ సంఘాలు ముందుండి నడిచేవి. ఇందులో వాటి ఆసక్తి వాటికుంది. ఉద్యోగ సంఘాలతో పాటు, జర్నలిస్ట్ సంఘాల్లో కూడా విభజన సమయంలో చీలిక వచ్చింది.

రాష్ట్రం విడిపోయిన తర్వాత….

ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన యూనియన్ లుగా ఉన్న వాటి అగ్ర నాయకత్వం తెలంగాణకు చెందిన వారు కావడంతో, ఏ ప్రాంత ప్రజల డిమాండ్లకు అనుగుణంగా ఈ సంఘాలు పోరాటాలు చేశాయి. అదే సమయంలో కొన్ని కొత్త సంఘాలు పుట్టుకొచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏపీ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో టీడీపీ అనుకూల యూనియన్ కు ప్రాధాన్యత దక్కింది. ఆ తర్వాత మిగిలిన సంఘాలు కూడా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకున్నాయి. చివరకు ప్రభుత్వం తీసుకునే రాజకీయ నిర్ణయాలకు కూడా ఈ సంఘాలు వత్తాసు పలకడం, ముఖ్యమంత్రి తో పాటు పోరాట దీక్షలు చేయడం ప్రారంభించాయి.

ప్రభుత్వ ఖర్చులతో…..

ప్రభుత్వ ఖర్చులతో విమానాల్లో ఢిల్లీ తీసుకు వెళ్లి పోరాటాలు చేస్తే ఈ సంఘాల నేతలు బహిరంగంగా మద్దతు ఇచ్చేవి. ఈ క్రమంలో ఈ సంఘాలకు చెందిన జాతీయ నాయకులు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని ఆంధ్రాలో అడుగు కూడా పెట్టనిచ్చే వారు కాదు. యూనియన్ వ్యవహారాల్లో కూడా వారి ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడేవారు. ఇటీవలి ఎన్నికల్లో ఫలితాలు తారుమార్తె వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఓ ప్రధాన యూనియన్ కి చెందిన తెలంగాణ నాయకుడికి రాష్ట్రంలో కీలక పదవి దక్కింది. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం దర్శనం కూడా దక్కని యూనియన్ లకు ఒకప్పుడు ఏ నాయకుడి పేరు ప్రస్తావించే సాహసం కూడా చేయలేదో ఆయనే అవసరం అయ్యాడు.

జగన్ దర్శనం కావాలంటే….

ఆయన్ని వెంట పెట్టుకుని వెళితే తప్ప సీఎం దర్శన భాగ్యం దక్కలేదు. దీంతో ఆ నాయకుడి భజన ప్రారంభించారు. ఆ నాయకుడితో తమకు ఉన్న అనుబంధాన్ని వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేయడం ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో నాయకుడి పుట్టిన రోజు వేడుకల్ని కూడా బెజవాడలో ఆయన ఫోటో తో నిర్వహించారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కీలక స్థానాల్లో ఉంది మా నాయకులే అని ప్రచారం చేసుకోడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. త్వరలో భారీ ఎత్తున ఓ కార్యక్రమం నిర్వహించి సీఎంతో పాటు, తమ నాయకుల్ని సత్కరించే యోచన కూడా ఉందట….. వీరి తీరు చూసి జర్నలిస్ట్ లే ముక్కున వేలేసుకుంటున్నారు

Tags:    

Similar News