కీ “రోల్” పోషిస్తేనే

జగత్ ప్రకాశ్ నడ్డా…. నిన్న మొన్నటి వకూ జాతీయ రాజకీయాలకు పూర్తిగా అపరిచితుడు. పార్టీ శ్రేణులకు కూడా అంత సుపరిచితులు కాదు. తాజాగా భారతీయ జనతా పార్టీ [more]

Update: 2019-07-09 17:30 GMT

జగత్ ప్రకాశ్ నడ్డా…. నిన్న మొన్నటి వకూ జాతీయ రాజకీయాలకు పూర్తిగా అపరిచితుడు. పార్టీ శ్రేణులకు కూడా అంత సుపరిచితులు కాదు. తాజాగా భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జె.పి. నడ్డా నియమితులవ్వడంతో ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. దీంతో పార్టీలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తర్వాత మూడో కీలక వ్యక్తిగా మారారు. మూడో అధికార కేంద్రంగా తయారయ్యారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని నెరిపే పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడు కావడం ఆషామాషీ కాదు. అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ రెండోతరం మూలపురుషుడుగా పేర్కొనే మోదీ అధికార పదవుల్లో క్షణం తీరిక లేకుండా ఉండటంతో కార్యనిర్వాహక అధ్యక్షుడు అవసరమయ్యారు. ఈ హోదాలో నడ్డా పార్టీ రోజువారీ కార్యక్రమాలు, సంస్థాగత వ్యవహారాలను చక్కబెడతారు. పార్టీలో కార్యనిర్వాహక అధ్యక్షుడు పోస్టును ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.

కార్యకర్తలతో కలివిడిగా…..

బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జె.పి. నడ్డా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసి పార్టీలో కీలక నేతగా ఎదిగారు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన జె.పి. నడ్డా తనకు అప్పగించిన బాధ్యతలను త్రికరణ శుద్ధితో నెరవేరుస్తారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. అప్పగించిన బాధ్యత చిన్నదా? పెద్దదా? అనే విష‍యంతో సంబంధం లేకుండా పనిని పూర్తి చేయడంపైనే దృష్టి సారించే వారు. కార్యకర్తలు, నాయకులతో మమేకమయ్యేవారు. అధికార హోదాలను పట్టించుకోకుండా అందరితో కలివిడిగా వ్యవహరించేవారు. వాస్తవానికి 2014 ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి జె.పి. నడ్డా పేరు వినిపించింది. అయితే అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రివర్గంలో చేరక పోవడంతో జె.పి.నడ్గాకు అవకాశం చిక్కలేదు.

ముఖ్యమంత్రి పదవి మిస్….

రాజ్యసభ సభ్యుడైన జె.పి.నడ్డా హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వారు. 196* డిసెంబరు 2న జన్మించారు. మోదీ మంత్రివర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. సిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1993లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998లో మళ్లీ ఎన్నికయ్యారు. కొంతకాలం బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా, రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. 2007లో అసెంబ్లీకి ఎన్నికైన జె.పి.నడ్డా కొంతకాలం మంత్రిగా పనిచేశారు. అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రిగా కీలక బాధ్యతలను నిర్వహించారు. 2012లో అసెంబ్లీ ఎన్నికల్లో జె.పినడ్డా పోటీ చేయలేదు. రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో మోదీ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. వాస్తవానికి ఒక దశలో జె.పి.నడ్డా రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సి వుంది. సామాజిక సమీకరణాలు కుదరక పదవికి దూరంగా ఉండిపోయారు. రాష్ట్రంలో బలమైన ఠాకూర్ వర్గం నుంచి గట్టి పోటీ ఎదురు కావడంతో బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన జె.పి.నడ్డా వెనక్కు తగ్గాల్సి వచ్చింది. అయినప్పటికి చివరికి మంచి పదవి దక్కింది.

అనేక సవాళ్లు…..

జె.పి.నడ్డా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఆయన నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. వీటిలో అన్నింటికంటే కీలకమైనవి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో శివసేన పొత్తుతో పార్టీ అధికారాన్ని సాధించింది. ఇటీవల లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీపై శివసేన తరచూ ధ్వజమెత్తేది. ఇప్పుడు దూకుడు తగ్గించింది. వచ్చే ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించే దిశగా బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తే పార్టీలో జె.పి.నడ్డా ప్రతిష్ట పెరుగుతుంది. మహారాష్ట్ర తర్వాత హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలుపుకోవడంపై జె.పి.నడ్డా దృష్టి పెట్టాల్సి ఉంది. అన్నింటికన్నా కీలకమైనవి కశ్మీర్ ఎన్నికలు. ఈ సరిహద్దు రాష్ట్రంపై పార్టీ పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. ఇక్కడ విజయం సాధిస్తే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జె.పి.నడ్డా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కశ్మీర్ లో ఈ దఫా ఎలాగైనా అధికారంలోకి రావాలని కమలం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇటీవల పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కశ్మీర్ ను సందర్శించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేశాక ఓ నిర్ణయానికి వచ్చారు. జమ్మూ, లడఖ్ లో పట్టు కాపాడుకుంట, కాశ్మీర్ లోయలో ముస్లిమేతర ఓట్లతో కొన్ని సీట్లను గెలవవచ్చన్నది కమలం వ్యూహం. ఈ వ్యూహం విజయవంతమైతే అధికారానికి చేరువవుతారు. జె.పి.నడ్డా కూడా ఇదే పనిలో ఉన్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News