జంప్ చేసినా ఓకేనా?

మహారాష్ట్ర ఎన్నికలకు, కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికలకు చాలా తేడా ఉంది. మహారాష్ట్రలో పార్టీ మారిన వారిని అక్కడి ప్రజలు చిత్తుగా ఓడిస్తే కర్ణాటకలో మాత్రం జంప్ [more]

Update: 2019-12-11 18:29 GMT

మహారాష్ట్ర ఎన్నికలకు, కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికలకు చాలా తేడా ఉంది. మహారాష్ట్రలో పార్టీ మారిన వారిని అక్కడి ప్రజలు చిత్తుగా ఓడిస్తే కర్ణాటకలో మాత్రం జంప్ జిలానీలకు జనం పట్టం కట్టారు. ఇందుకు కారణాలు అనేకం ఉన్నప్పటికీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదే చర్చనీయాంశమైంది. ఫిరాయింపు చేసినా పెద్దగా ప్రజలు పట్టించుకోరని కన్నడ ప్రజల తీర్పు ఒక సందేశాన్ని దేశ వ్యాప్తంగా పంపించినట్లయింది.

ఇద్దరు మినహా…..

కర్ణాటక శాసనసభలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో ఇద్దరు తప్ప అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలందరూ విజయం సాధించారు. నిజానికి మహారాష్ట్రలో కొద్దికాలం క్రితం జరిగిన ఎన్నికల్లో ఫిరాయింపుదారులను ప్రజలు గెలిపించలేదు. దీంతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఒకింత ఆలోచనలో పడింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తే గెలవలేరేమోనన్న సందేహాన్ని వెలిబుచ్చింది. అయినా యడ్యూరప్ప మాత్రం తనను ముఖ్యమంత్రిని చేసిన వారికి టిక్కెట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి మరీ గెలిపించుకున్నారు.

పన్నెండు మంది గెలిచి…..

సంకీర్ణ ప్రభుత్వంలో 14 నెలల పాటు ఉండిన కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ కు సంబంధించిన పదిహేడు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతోనే అప్పటి కుమారస్వామి సంకీర్ణ సర్కార్ కుప్పకూలింది. అయితే వీరిపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించి మరీ తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. చివరకు ఎన్నికల్లో పోటీ చేసింది పదమూడు మంది అనర్హత ఎమ్మెల్యేలు మాత్రమే. ఇద్దరికి బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదు. ఇందులో చివరకు ఇద్దరు ఓటమి పాలయ్యారు. ఇలా పార్టీలు మారి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమయిన వారిని కూడా జనం గెలిపించారనే చెెప్పాలి.

కారణాలివే…..

ఇందుకు అనేక కారణాలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలతో పాటుగా సంకీర్ణ సర్కార్ పై నమ్మకం లేకపోవడమే. గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలను సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కాంగ్రెస్ అతి తక్కువ స్థానాలను దక్కించుకున్న జేడీఎస్ నేత కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడం కూడా జనాగ్రహానికి కారణమని చెప్పాలి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ క్యాడర్ సయితం కలసికట్టుగా పనిచేయడం వల్లనే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు సులువుగా విజయం సాధించారు. పార్టీ మారినంత మాత్రాన గెలవలేమన్నది తప్పు అని నిరూపించారు కర్ణాటక అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు.

Tags:    

Similar News