జూనియర్ వస్తున్నాడటగా?

తెలుగుదేశం రాజకీయాల్లో సినిమా ప్రభావం చాలా ఎక్కువ. అది అనేక సందర్భాల్లో రుజువై నిజమవుతోంది. 1982లో వెండితెర వేలుపు నందమూరి తారకరామారావు పార్టీని పెట్టి ఎకాఎకిన సీఎం [more]

Update: 2020-01-20 06:30 GMT

తెలుగుదేశం రాజకీయాల్లో సినిమా ప్రభావం చాలా ఎక్కువ. అది అనేక సందర్భాల్లో రుజువై నిజమవుతోంది. 1982లో వెండితెర వేలుపు నందమూరి తారకరామారావు పార్టీని పెట్టి ఎకాఎకిన సీఎం అయిపోయారు. ఆయన సినీ గ్లామర్ తోనే టీడీపీ మనగలిగింది. ఇక తరువాత కాలంలో చంద్రబాబు సీఎం అయినా కూడా బావమరిది బాలయ్య సినీ గ్లామర్ ని బాగా వాడేసుకున్నారు. మధ్యలో పెద్ద బావమరిది యాక్టర్, కమ్ పొలిటీషియన్ హరికృష్ణను కూడా ముగ్గులోకి లాగి పబ్బం గడుపుకున్నారు. ఇక 2009 ఎన్నికల నాటికి హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా రాజకీయ రొంపిలో దింపేసి గణనీయంగా సీట్లు తెచ్చుకున్నారు.

పవన్ సాయం…

ఇక 2014 నాటికి జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ని తనకు మద్దతుగా తెచ్చుకుని ఎన్నికల గండాన్ని చంద్రబాబు దిగ్విజయంగా దాటేశారు. జగన్ ని ఆమడదూరంలోకి నెట్టి మూడవసారి ముచ్చటగా సీఎం కుర్చీ ఎక్కేశారు. ఇవన్నీ ఇలా ఉంటే 2019 ఎన్నికల నాటికి మాత్రం పవన్ కల్యాణ‌్ దూరమయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇటు వైపు చూడలేదు. అయితే పవన్ పరోక్ష సాయం మీద చంద్రబాబుకు ఆశ, అవగాహన ఉండడంతో సినీ వెలితి లేకుండానే రాజకీయం కానిచ్చేశారు. ఇక 2024 నాటికి రాజకీయం చేద్దమనుకుంటే పవన్ కల్యాణ‌ తళుకు బెళుకులు అన్నీ కమలం కాంతులతో జత కాబోతున్నాయి. దీంతో పవన్ ఇక సైకిల్ బెల్లు మోగించే అవకాశాల్లేవని తేలిపోయింది.

జూనియర్ అంటున్నారు…

ఇకపోతే టీడీపీకి మళ్లీ సినీ గ్లామర్ అర్జంట్ గా అవసరం పడుతోందిట. ఇపుడున్న పరిస్థితుల్లో పార్టీని పైకి లేపాలంటే అది చంద్రబాబు వల్లా కాదు, చినబాబు వల్ల అసలు కాదు, దాంతో ఎలాగైనా మళ్ళీ నందమూరి సినీ వారసుల తలుపులు తట్టే అవకాశాలైతే గట్టిగానే ఉన్నాయని అంటున్నారు. ఇన్నాళ్ళూ తాము దూరం పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ను ఇపుడు బాబు కచ్చితంగా పిలుస్తారని, నీవే మాకు అన్నీ అంటూ కీర్తన‌లను అందుకుంటాడని పసుపు శిబిరంలో గట్టిగా వినిపించే మాట. జూనియర్ ఎన్టీఆర్ అండ లేకపోతే 2024 ఎన్నికలను కనీసం ఫేస్ చేయలేమని చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆయన మెత్తబడతారని అంటున్నారు. తొందరలోనే జూనియర్ తెలుగుదేశం తెరపై వెలిగిపోతారని కూడా అంటున్నారు.

ఫ్లెక్సీ చెప్పిన జోస్యం….

సంక్రాంతి సంబరాల్లో తెలుగుదేశం భావి రాజకీయం మళ్ళీ బాగా ప్రస్తావనకు వస్తోంది. ఎర్రగొండ‌పాలెం నియోజకవర్గం కార్యకర్తలు, ఇంచార్జి సహా అంతా కలసి భావి వెలుగు టీడీపీకి జూనియర్ ఎన్టీయారేనని డిసైడ్ చేసేసారు. 2024 నాటికి ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని వారు పెద్ద ఫ్లెక్సీని కూడా పెట్టేశారు. ఇపుడు ఏపీ రాజకీయాల్లో ఇది పెద్ద సంచలనంగా ఉంది. చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తిరిగి తేవడం అనివార్యంగా కనిపిస్తూంటే జూనియర్ కాబోయే సీఎం అని ఫ్లెక్సీలు వెలవడం మాత్రం ఇద్దరు బాబులకు ఇబ్బందికరమైన పరిణామమేనని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఆదుకునే దిక్కులేదు. జూనియర్ వస్తే సీఎం సీటుకే ఎసరు పెడతాడేమో. ఇదిపుడు టీడీపీలో హాట్ టాపిక్ గా ఉంది. ఏది ఏమైనా పవన్ సినీ గ్లామర్ ని అడ్డుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ రాక తప్పని సీన్ ఇపుడు టీడీపీలో ఉందన్నది వాస్తవం.

Tags:    

Similar News