జూనియర్ ఎన్టీయార్ ని బాగా డిస్టర్బ్ చేస్తున్నారట…?

జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారి వారసుడు. మూడవ తరంలో సినీ రంగంలో వెలుగు జిలుగులు విరజిమ్ముతూ తన స్వయం ప్రతిభతో ఇంతదాకా ఎదిగిన కధా నాయకుడు. టాలీవుడ్ [more]

Update: 2021-04-14 00:30 GMT

జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారి వారసుడు. మూడవ తరంలో సినీ రంగంలో వెలుగు జిలుగులు విరజిమ్ముతూ తన స్వయం ప్రతిభతో ఇంతదాకా ఎదిగిన కధా నాయకుడు. టాలీవుడ్ అగ్ర నాయకులలో ఒకరిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మీద ఇపుడు ఎక్కడ లేని ప్రెషర్ పడిపోతోంది. జూనియర్ సినిమాలలో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అది అందరికీ తెలిసిందే. కానీ ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ ఎదుర్కొంటున్న వత్తిడి మామూలుగా లేదుట. అయిన అది సినిమాల నుంచి కాదు, ఆయన ఏ మాత్రం పట్టించుకోని రాజకీయాల నుంచి.

పెద్దాయనతో మొదలు…..

టీడీపీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్న మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజాగా తన మనసులో ఉన్న మాట బయటకు కక్కేశారు. జూనియర్ ఎన్టీఆర్ రావాలి, టీడీపీని బతికించాలి అన్నట్లుగానే ఆయన మాటలు సాగాయి. సరే ఇంకేముంది మిగిలిన వారంతా కూడా ఇపుడు అవే స్తోత్రపాఠాలు వల్లిస్తున్నారుట. ఇక టీడీపీ అనుకూల మీడియా అయితే జూనియర్ ఎన్టీఆర్ రాకను ఖరారు చేసే పనిలో ఫుల్ బిజీగా ఉందిట. మరో వైపు టీడీపీని అభిమానించే అతి పెద్ద సామాజికవర్గం ఇపుడు జూనియర్ రావాల్సిందే అంటూ పట్టుబడుతోందిట.

ఇటు వైపు చూడాల్సిందే ….?

తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేనంతగా ఇబ్బందులో ఇపుడు ఉంది. రెండేళ్ళు అయినా కూడా పార్టీ ఎత్తిగిల్లకపోవడంతో పాటు తాజాగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు అన్నీ కూడా ఏకపక్షంగా వైసీపీ గెలుచుకోవడంతో తమ్ముళ్లలో కలవరం రేగుతోంది. దాంతో పాటు టీడీపీని అంటిపెట్టుకుని ఉండే బలమైన నాయకులు కూడా ఇపుడు తమకు ఉన్న చనువుతో ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ మీద వత్తిడి తెచ్చే కార్యక్రమం మొదలుపెట్టారని టాక్. తాత పెట్టిన పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత మనవడిదే అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి కూడా దిగిపోతున్నారట.

అంతేనా …?

ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో ఎవరెన్ని చెప్పినా వినే సీన్ లేదని అంటున్నారు. ఆయనకు టీడీపీ ప్రస్తుత నాయకత్వం గురించి బాగా తెలుసు. పైగా తనను వాడుకుని వదిలేశారు అన్న బాధ ఆగ్రహం ఆయనలో ఉన్నాయి. ఇక సినీ రంగంలో చాలా కాలం పాటు కొనసాగే కెరీర్ ని ఫణంగా పెట్టి ఎవరి కోసమే తాను ఇపుడు రాలేనని కూడా జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు అంటున్నారు. మొత్తానికి జూనియర్ ని టీడీపీ తరఫున రాజకీయాల్లోకి దింపేందుకు పెద్ద తలకాయలే బరిలోకి దిగిపోయాయని టాక్. జూనియర్ మాత్రం అది కాదు కాకూడదు అని గట్టిగానే అంటున్నారు. మరో వైపు చూస్తే సినీ రంగంలో కూడా ఆ సామాజికవర్గానికి మంచి పలుకుబడి ఉంది. మరి అటు నుంచి కూడా నరుక్కు వస్తారా అన్నది కూడా చర్చగా ఉందిట. ఏది ఏమైనా టీడీపీ సడెన్ గా ఇలా పతనం కావడమేంటో తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ ని కుదురుగా ఉండనీయకుండా ఒక పెద్ద లాబీయింగే జరుగుతోందని ప్రచారమైతే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News