ఎంత దువ్వినా… ఇప్పుడు కాదటగా?

ఎన్టీఆర్…ఈ మూడు అక్షరాలకు ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ అద్భుతం. సీనియర్ ఎన్టీయార్ అటు సినిమా, ఇటు రాజకీయ రంగాలలో ఎదురులేని నాయకుడిగా నిలిచారు. ఆయన వారసుడిగా వచ్చిన [more]

Update: 2020-05-24 13:30 GMT

ఎన్టీఆర్…ఈ మూడు అక్షరాలకు ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ అద్భుతం. సీనియర్ ఎన్టీయార్ అటు సినిమా, ఇటు రాజకీయ రంగాలలో ఎదురులేని నాయకుడిగా నిలిచారు. ఆయన వారసుడిగా వచ్చిన మనవడు, అదే పేరింటివాడు అయిన జూనియర్ ఎన్టీఆర్ కూడా తన పేరుబలంతో సినిమాల్లో అగ్రభాగాన ఉన్నాడు. టాలెంట్ కూడా అందుకు తోడు అయింది. ఇక జూనియర్ రాజకీయం అన్నది ఇప్పటికి అప్రస్తుతం అయినా కూడా తాత పార్టీతో ఆయనకు బంధాలు గతజలసేతు బంధనంగా కొనసాగుతూనే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికిపుడు రాజకీయాల్లోకి రావాలనుకోవడంలేదు, కానీ ఆయన వస్తే రెడ్ కార్పెట్ పరచేందుకు టీడీపీ సిధ్ధంగా ఉందని తెలిపే సంకేతాలు తాజాగా వెలువడుతున్నాయి.

బాబు తప్ప…

జూనియర్ ఎన్టీయార్ పుట్టిన రోజున ఆయన్ని మొత్తం టీడీపీ పార్టీయే అభినందనలతో ముంచెత్తింది. చంద్రబాబు తరువాత అంతటివాడు చినబాబు లోకేష్ తో మొదలుపెడితే మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, ఎంపీలు అంతా కూడా జూనియర్ అని కల‌వరించారు. నిజానికి గత ఏడాది ఇదే రోజున జూనియర్ బర్త్ డే జరిగినపుడు ఈ హడావుడి, సందడి అసలు లేదు. ఎందుకంటే ఏపీ ఎన్నికల ఫలితాలు అప్పటికి ఇంకా వెలువడలేదు. తామే అధికారాంలోకి వస్తామన్న మేకపోతు గాంభీర్యంతో టీడీపీ ఉంది. ఈసారి మాత్రం అందుకు భిన్నం. పార్టీ ఓడి ఏడాది అయినా చేవ చచ్చిన తీరుతో మొత్తానికి మోసం వచ్చేలా సీన్ ఉంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ మీద ఎక్కడలేని అభిమానాన్ని టీడీపీ ఒలకబోసింది.

చెప్పేస్తున్నారా..?

ఎన్నడూ లేని విధంగా పసుపు పార్టీ మొత్తం ఇలా జూనియర్ ఎన్టీఆర్ ని అభినందిస్తూ క్యూ కట్టడం అంటే అది రాజకీయంగా చర్చనీయాంశంగానే ఉంది. జూనియర్ బావ అయిన నారా లోకేష్ కూడా గ్రీట్ చేయడం అతి పెద్ద విశేషం. అంటే జూనియర్ తో అనుబంధం పెనవేసుకోవాలని టీడీపీ పడుతున్న తాపత్రయం అర్ధమైపోతోంది. జూనియర్ వంటి చరిష్మాటిక్ లీడర్ పార్టీకి ఇపుడు రాజకీయ అవసరం అని మొత్తం అంతా భావిస్తున్నట్లుగానే ఉంది. ఆ అభిప్రాయం బయటపెట్టలేక ఇలా ఇండైరెక్ట్ గా జూనియర్ కి జై కొట్టారని అంటున్నారు. మనసులోని భావాలని చెప్పకనే ఇలా పార్టీ నాయకత్వం చెప్పేసిందని అంటున్నారు.

కుదిరేది కాదట….

సరే టీడీపీకి 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ బాగానే సాయం చేశాడు. తన చావును కూడా కోరి తెచ్చుకుని మరీ ప్రచారం చేపట్టాడు. అంత చేసినా కూడా పార్టీ అధినాయ‌కత్వం కరివేపాకులా తీసిపక్కన పడేసింది. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ని ప్రమోట్ చేయడం కోసం జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టేశారని అంటారు. ఇక తన తండ్రి స్థాపించిన పార్టీలో తన కుమారుడు జూనియర్ అయినా ఒక వెలుగు వెలగాలని ఆశించిన దివంగత నేత నందమూరి హరిక్రిష్ణ ఆ ఆశ తీరకుండానే కన్నుమూశారు. తండ్రి అంటే అమితంగా ఇష్టపడే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి మనసులో ఏముందో తెలుసు అంటారు. అందుకే ఆయన చంద్రబాబుకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఇపుడు కూడా పార్టీ మొత్తం ఒక్కటై నిలిచి పిలిచినా కూడా జూనియర్ ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చేది లేదన్నది సన్నిహితుల మాట. అయితే జూనియర్ ఎన్టీఆర్ కావాలన్న టీడీపీ ఆరాటం మాత్రం ఇలా బాహాటంగా అర్ధమయిపోతోంది. దాంతో పాటే నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ బేలతనం కూడా బయటపడిపోతోంది. అయినా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇపుడు ఏమీ చేయలేడంతే.

Tags:    

Similar News