రంజన్ జన రంజకంగా..!!

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ కు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈశాన్య ప్రాంతం నుంచి తొలి ప్రధాన న్యాయమూర్తి అయింది రంజన్ గొగొయ్ మాత్రమే. [more]

Update: 2019-11-09 17:30 GMT

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ కు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈశాన్య ప్రాంతం నుంచి తొలి ప్రధాన న్యాయమూర్తి అయింది రంజన్ గొగొయ్ మాత్రమే. ఆయనది రాజకీయ కుటుంబం కూడా కావడం విశేషం. తండ్రి కేశవ చంద్ర గొగొయ్ం అసోం కాంగ్రెస్ లో కీలక నాయకుడు. 1982 లో ఆయన కొద్దికాలం పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. తండ్రి బాటకు భిన్నంగా న్యాయవాద వృత్తిని ఎంచుకున్న రంజన్ గొగొయ్ ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను చేరుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా 2018 అక్టోబరు 18న బాధ్యతలను స్వీకరించిన జస్టిస్ రంజన్ గొగొయ్ ఈ నెల 17వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోగా అనేక కీలక కేసుల్లో తీర్పులు వెలువడనున్నాయి. ఈ కేసులు దేశ గతిని మార్చగలవనడంలో సందేహం లేదు. వాటిల్లో అయోధ్య వివాదం అత్యంత కీలకమైనది.

అయోధ్య వివాదం….

అయోధ్య వివాదం ఈనాటిది కాదు. దానికి దాదాపు మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. దేశంలో భిన్న మతాల మధ్య భావోద్వేగాలను రగిలించిన సున్నితమైన కేసు ఇది. చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ విఫలం కావడంతో చివరికి అత్యున్నత న్యాయస్థానానికి వివాదం చేరింది. జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులు గల ధర్మాసనం40 రోజుల పాటు విచారించింది. కొత్త ప్రధాన న్యాయమూర్తి కానున్న జస్టిస్ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ నజీర్ సభ్యులుగా గల ధర్మాసనం ఈ కేసు తీర్పును అక్టోబరు 16న రిజర్వ్ చేసింది. అంతకు ముందు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఇచ్చిన తీర్పుపై నర్వోన్నత న్యాయస్థానంలో 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. అయోధ్యలోని వివాదాస్పద భూభాగంలోని 2.77 ఎకరాల స్థలం హిందువులకు చెందినదేనని తాజాగా తీర్పు వెలువడింది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా అనేక వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. అంతర్జాతీయ స్థాయిలో సయితం సుప్రీంకోర్టు తీర్పుకు అభినందనలు వెలువడ్డాయి.

రఫేల్ కేసును….

ఎనిమిదో దశకంలో రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్స్ కొనుగోళ్లు ఎంత వివాదాస్పదమయ్యాయో, తాజాగా మోదీపై రఫేల్ వివాదం అంతే సంచలనమయింది. ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోళ్లను గత ఏడాది డిసెంబరు 14న సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ తీర్పుపై మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. ఇందులో జస్టిస్ ఎస్.కె. కౌల్, జస్టిస్ కె.ఎం. జోసెఫ్ సభ్యులు. దీనిపై కూడా తీర్పు ఈనెల 17వ తేదీలోగా వెలువడనుంది. ఈ తీర్పు కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై ప్రభావం చూపనుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే రాజకీయంగా సంచలనం సృష్టించనుంది. కేంద్రంపై ప్రభావం చూపనుంది.

సంచలన కేసులను….

శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ 2018 సెప్టంబరులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై దాఖలైన రివ్యూ పిటిషన్ ను విచారించిన జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వ్ చేసింది. ఇందులో జస్టిస్ ఆర్.ఎఫ్ నారిమన్, జస్టిస్ బాన్ విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస ఇందు మల్మోత్రా సభ్యులు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆర్టీఐ చట్ట పరిధిలోకి తేవాలంటూ దాఖలైన పిటీషన్ పై కూడా జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా సభ్యులు. ఫైనాన్స్ చట్టం 2017 ను ద్రవ్యబిల్లుగా పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించిన జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించి దీనిపై తీర్పు ఇవ్వనుంది. ప్రధాని నరేంద్ర మోదీని చౌకీదార్ చోర్ హై అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు రఫేల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు వర్తించాయన్న వివాదంపైనా జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పనుంది. మొత్తం మీద జస్టిస్ రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేసేలోపే కీలక కేసుల్లో తీర్పులు వెలవడనున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News