పనికొస్తారనుకుంటే…? పనికి రాకుండా పోతున్నారే?

ఇల్లు త‌గ‌ల‌బ‌డి ఒక‌డు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాల‌ని ఒక‌డు అడిగిన‌ట్టుగా ఉంద‌ట టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు జ్యోతుల వెంక‌ట అప్పారావు ఉర‌ఫ్ నెహ్రూ వ్యవ‌హారం. టీడీపీలో [more]

Update: 2020-03-24 00:30 GMT

ఇల్లు త‌గ‌ల‌బ‌డి ఒక‌డు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాల‌ని ఒక‌డు అడిగిన‌ట్టుగా ఉంద‌ట టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు జ్యోతుల వెంక‌ట అప్పారావు ఉర‌ఫ్ నెహ్రూ వ్యవ‌హారం. టీడీపీలో సుదీర్ఘకాలం సీనియ‌ర్ నాయ‌కుడిగా ఓ వెలుగు వెలిగిన ఆయ‌న ఆ త‌ర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. అనంత‌రం 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి జంప్ చేశారు. 2014లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన ఆయ‌న జ‌గ‌న్ కు అత్యంత ఆత్మీయుడిగా గుర్తింపు సాధించారు. అసెంబ్లీలోనూ ప‌క్క ప‌క్క సీట్లలో కూర్చున్నారు. కీల‌క‌మైన పీఏసీ చైర్మన్ ప‌ద‌వి సైతం ఆయ‌న‌కు ఇచ్చారు. అలాంటి నాయ‌కుడు త‌ర్వాత చంద్రబాబు ఆక‌ర్స్ మంత్రంతో సైకిల్ ఎక్కారు.

ఏదైతే ఆశించారో?

నెహ్రూ త‌న జీవిత ఆశ‌య‌మైన మంత్రి ప‌ద‌వి ఆశించి టీడీపీలో చేరితే చంద్రబాబు ఆయ‌న‌కు షాక్ ఇచ్చారు. పార్టీ మారే ముందు మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేసినా పార్టీ మారాక మాత్రం మంత్రి ప‌ద‌వి ఇవ్వకుండా నెహ్రూ త‌న‌యుడుకు రెండేళ్లు జ‌డ్పీ చైర్మన్ ప‌ద‌వి ఇచ్చి స‌రిపెట్టేశారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీలో ఆయ‌న ఓడిపోయారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. పార్టీ కూడా అధికారం కోల్పోవ‌డంతో అప్పటి నుంచి మౌనంగా ఉంటున్నారు., అయితే, ఈ మౌన‌మే ఇప్పుడు ఆయ‌న‌కు శాపంగా మారిపోయింది.

పార్టీని వీడి వెళుతున్నా….

వాస్తవానికి టీడీపీలో కీల‌క నాయ‌కుడిగా జ్యోతుల నెహ్రూ చ‌క్రం తిప్పుతార‌ని అంద‌రూ అనుకున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన కాపు నాయ‌కుడు కూడా కావ‌డంతో ఆయ‌న పార్టీకి మేలు చేస్తార‌ని చంద్రబాబు భావించారు. అయితే ఇప్పుడు పార్టీ భ్రష్టుప‌డుతున్నా.. నాయ‌కులు తుర్రు మంటూ జంప్ చేస్తున్నా.. జ్యోతుల నెహ్రూ వంటి నాయ‌కుడు వారికి స‌ర్దిచెప్పడం మానేసి.. త‌న మానాన తాను ఉండ‌డం పార్టీ కేడ‌ర్‌కు స‌ర్వత్రా విస్మయాన్ని క‌లిగిస్తోంది. వారానికో, 15 రోజులకో ఒకసారి కాకినాడలో మీడియాతో మాట్లాడటానికే ఆయన పరిమి తమవుతున్నారే తప్ప టీడీపీకి కాయకల్ప చికిత్స చేయలేకపోతున్నారు.

ఆయనకంటే చినరాజప్ప…..

ఇటీవ‌ల తూర్పు గోదావ‌రి జిల్లాలో ప‌లువురు కాపు నేత‌లు వైసీపీలోకి జంప్ చేస్తున్నారు. మంత్రి కురసాల కన్నబాబు కాపు నేత‌ల‌పై బాగా గురి పెట్టి వాళ్లను వైసీపీలో చేర్చుకుంటున్నారు. ఇక తోట త్రిమూర్తులు వంటి కాపు నేత‌లు కూడా పార్టీ మారిపోయారు. ఇంత జ‌రుగుతున్నా కూడా జ్యోతుల నెహ్రూ ఎక్కడా కూడా పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయ‌లేదు. పైగా ఆయ‌న త‌న‌కు పార్టీలో ఇంకా గుర్తింపు ల‌భించ‌డం లేద‌నే బాధ‌లో ఉన్నట్టు చెబుతున్నారు. పైగా ఆయ‌న కంటే నిమ్మకాయ‌ల చిన‌రాజ‌ప్ప చాలా బెట‌ర్ అని జిల్లా కేడ‌ర్ అంతా చ‌ర్చించుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల‌పై ఉన్నంత‌లో ఆయ‌నే ఫైట్ చేస్తున్నారు. పార్టీలో కీల‌క ప‌ద‌వులు కోరుకునే జ్యోతుల నెహ్రూ.. మ‌రి పార్టీ కోసం ఏం చేశారు? ఏం చేస్తున్నారు? అనే ప్రశ్న తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు మాత్రం ఆయ‌న బోగి మంట‌ల్లో చ‌లికాచుకుంటున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News