జ్యోతుల రాజకీయం ఇక అక్కడ ముగిసినట్లేనా?

తూర్పుగోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గంలో మూడు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాలు చేస్తున్న జ్యోతుల నె హ్రూ ఉర‌ఫ్ జ్యోతుల వెంక‌ట అప్పారావు హ‌వా స‌న్నగిల్లిందా? ఆయ‌న చేసుకున్న రాజ‌కీయాలే [more]

Update: 2020-05-09 06:30 GMT

తూర్పుగోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గంలో మూడు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాలు చేస్తున్న జ్యోతుల నె హ్రూ ఉర‌ఫ్ జ్యోతుల వెంక‌ట అప్పారావు హ‌వా స‌న్నగిల్లిందా? ఆయ‌న చేసుకున్న రాజ‌కీయాలే ఆయ‌న‌కు వ్యతిరేకంగా మారాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టున్న నాయ‌కుడుగా జ్యోతుల నెహ్రూకు ఒక‌ప్పుడు పేరుంది. అయితే, ఆయ‌న పార్టీలు మార‌డంతో ప్రజ‌ల్లో న‌మ్మకం, విశ్వస‌నీయ‌త వంటివి కోల్పోయార‌ని అంటున్నారు. టీడీపీ నుంచి రాజ‌కీయాలు ప్రారంభించిన జ్యోతుల నెహ్రూ 1994, 1999 ఎన్నికల్లో గెలిచారు.

రెండు సార్లు…..

అయితే, 2004లో వైఎస్ హ‌వాతో ఆయ‌న టీడీపీ నుంచి పోటీ చేసిన‌ప్పటికీ.. ప‌రాజ‌యం పాల‌య్యారు. ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం., అయితే, ఆయ‌న త‌ర్వాత క్రమంలో చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలోకి జంప్ చేశారు. ఆయ‌న అటు జంప్ చేయడంతో ఈ కుటుంబం నుంచే మ‌రో నాయ‌కుడు జ్యోతుల చంటిబాబు.. రాజ‌కీయ రంగ ప్రవేశం చేశారు. అది కూడా టీడీపీలో చేరారు. వీరిద్దరూ కూడా 2009 ఎన్నిక‌ల నాటికి ఒక‌రు ప్రజారాజ్యం త‌ర‌ఫున‌, మ‌రొక‌రు టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసినా.. ఓడిపోయారు. నెహ్రూ ఈ రెండు సార్లు కూడా తోట న‌ర‌సింహం చేతిలో ఓడిపోయారు.

వైసీపీలో చేరి గెలిచి…..

ఇక‌, 2014 కి వచ్చేసరికి జ్యోతుల నెహ్రూ మ‌ళ్లీ పార్టీ మారి.. జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీలో చేరారు. ఈ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే, చంటిబాబు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక‌, ఈ క్రమంలో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీలోకి జ్యోతుల నెహ్రూ జంప్ చేయ‌డంతో అప్పటి వ‌ర‌కు ఆ పార్టీలో ఉన్న చంటి బాబు వైసీపీలోకి వ‌చ్చారు. చంద్రబాబు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పడంతోనే జ్యోతుల నెహ్రూ పార్టీ మారిపోయార‌న్నది ఓపెన్ సీక్రెట్ అంటుంటారు. అయితే బాబు మాత్రం మంత్రి ప‌ద‌వి ఇవ్వకుండా ఓ రెండేళ్లు ఆయ‌న కుమారుడు న‌వీన్‌కు జ‌డ్పీచైర్మన్ ప‌ద‌వి ఇచ్చి మ‌మః అనిపించేశారు.

వచ్చే ఎన్నికల్లో…..

ఇక గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో చంటిబాబు విజ‌యం సాధించారు. ఇక‌, అప్పటి నుంచి కూడా ఆయ‌న జ‌గ్గంపేట‌లో ప‌ట్టు పెంచుకున్నారు. సీనియ‌ర్ మోస్ట్ అయి ఉండి కూడా జ్యోతుల నెహ్రూ మాత్రం త‌న వ్యూహాల‌ను పారించ‌లేక పోతున్నార‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. ప్రస్తుతం చంటిబాబు హ‌వా మంచి జోరుగా ఉంది. అదే స‌మ‌యంలో టీడీపీ త‌ర‌పున సీనియ‌ర్ నాయ‌కుడే అయిన‌ప్పటికీ నెహ్రూ ఎక్కడా దూకుడు ప్రద‌ర్శించ‌లేక పోతున్నారు. పైగా.. ఆయ‌న ఓడిపోవ‌డం, టీడీపీ అధికారం కోల్పోవ‌డం వ‌య‌స్సు పైబ‌డిన నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ర‌న్న ప్రచారం ఆయ‌న రాజ‌కీయ భ‌విష్యత్తుకు శుభం కార్డు వేసింద‌నే అంటున్నారు.

కుమారుడికే పగ్గాలు….

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మార్పు రాక‌పోతే జ్యోతుల నెహ్రూ త‌న‌యుడు న‌వీన్‌కు నియోజ‌క‌వ‌ర్గ ప‌గ్గాలు ఇచ్చినా నెహ్రూ రేంజ్‌లో రాజ‌కీయం చేసే సీన్ లేద‌నే జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్రచారం జ‌రుగుతోంది. ఏదేమైనా జ్యోతుల నెహ్రూ నాడు వైసీపీని వీడ‌కుండా ఉంటే ఈ రోజు క‌న్నబాబు ప్లేస్‌లో ఆయ‌న మంత్రి అయ్యి ఉండేవార‌ని.. నాడు మంత్రి ప‌ద‌విపై ఆశ‌తో పార్టీ మారి ఆ ప‌ద‌వి ద‌క్కక … నేడు రాజ‌కీయ శూన్యత‌లో ప‌డిపోయార‌న్నది సుస్పష్టం.

Tags:    

Similar News