కారు సారు వారి ప్లాన్ అదుర్స్ ?

వ్యూహాలు పన్నాలంటే చాణక్యుడిని స్మరించుకోవాల్సిందే. తెలుగు రాజకీయాల్లో అలా గురి తప్పకుండా మాస్టర్ ప్లాన్స్ వేయడంతో ఇద్దరు చంద్రులూ దిట్ట అనే అంటారు. వారిలో ఒకరు చంద్రబాబు [more]

Update: 2021-05-20 00:30 GMT

వ్యూహాలు పన్నాలంటే చాణక్యుడిని స్మరించుకోవాల్సిందే. తెలుగు రాజకీయాల్లో అలా గురి తప్పకుండా మాస్టర్ ప్లాన్స్ వేయడంతో ఇద్దరు చంద్రులూ దిట్ట అనే అంటారు. వారిలో ఒకరు చంద్రబాబు అయితే రెండవ వారు చంద్రశేఖరరావు. ఈ ఇద్దరూ ప్రత్యర్ధుల పోకడలను ముందుగానే గమనించి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడంలో నేర్పరులు. తాజాగా తమ మంత్రి వర్గ సహచరుడు, ఉద్యమ కాలం నుంచి వెన్నంటి ఉన్న ఈటల రాజెందర్ ని క్షణం కూడా ఆలోచించకుండా కేసీఆర్ మంత్రి పదవి పీకేసి బయటకు పంపేశారు. మరి ఆయన బీసీ నేత, నోరున్న పేరున్న నాయకుడు అని కేసీఆర్ కి తెలియదా. అక్కడే ఉంది అసలైన రాజకీయం అంటున్నారు.

ముందు చూపుతోనే ….

టీయారెస్ వరసపెట్టి రెండు ఎన్నికలను తెలంగాణాలో గెలిచింది. ముచ్చటగా మూడవసారి గెలవాలి అంటే చాలా కష్టపడాలి. అధికారం ఉంది కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల నుంచి అన్ని ఎన్నికలలో విజయాలు అలా వచ్చి వడిలో పడుతున్నాయి. కానీ తన ప్రభుత్వం మీద జనాల్లో అసంతృప్తి చాలానే ఉందనే సత్యాన్ని కేసీఆర్ దుబ్బాక, జీ హెచ్ ఎంసీ ఎన్నికతోనే అంచనా వేశారు అని చెబుతారు. అందుకే ఆయన మరో రకం రాజకీయానికి తెర తీశారు అంటున్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో కేసీఆర్ వర్సెస్ అదర్స్ అన్నట్లుగా పొలిటికల్ సీన్ ని రెడీ చేసి పెడుతున్నారు.

రెచ్చగొట్టి మరీ …

అందుకే తన పార్టీలో ఉన్న సమర్ధుడైన నేత ఈటల రాజెందర్ ని రెచ్చగొట్టి మరీ రోడ్డు మీదకు తెచ్చారని చెబుతున్నారు. ఈ కోపంతో ఈటెల రాజెందర్ సొంత పార్టీ పెట్టడమో వేరే పార్టీలో చేరి రచ్చచేయడమో చేస్తారు. ఎలా చేసినా కూడా కేసీఆర్ కే లాభం. తెలంగాణాలో ఇప్పటికే రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ గెలుపునకు ఆమడ దూరంలో ఉన్నాయి. మరో వైపు వైఎస్ షర్మిల కొత్త పార్టీ అంటోంది. ఈ నేపధ్యంలో ఈటల కూడా కొత్త పార్టీ పెడితే అది టీయారెస్ నెత్తిన పాలు పోసినట్లే అంటున్నారు. ఇలా నాలుగైదు పార్టీలు అధికార పార్టీకి వ్యతిరేకంగా బారిలో నిలిస్తే చివరికి గరిష్ట లాభం చేకూరేది గులాబీ శిబిరానికే అన్నది రాజకీయ లెక్క చెబుతోంది.

శత్రువులు పెరగాలి….

రాజకీయాల్లో మిత్రులే కాదు శత్రువులు కూడా పెరుగుతూ ఉండాలి. వారి వల్ల కూడా లాభాలు ఉంటాయి. ఇపుడు ఈటల కొత్త శత్రువు అయ్యాడు. ఇప్పటికే తెలంగాణాలో ప్రతిపక్ష శిబిరం కకావికలమై ఉంది. బీజేపీకి కాంగ్రెస్ కి పడదు, కాంగ్రెస్ లో ఒకరితో మరొకరికి పడదు, సీమాంధ్ర షర్మిల పార్టీ పెడితే తెలంగాణాలో మరొకరు కలవరు. ఈ నేపధ్యంలో ఈటల పార్టీ పెట్టినా ఇంకో కుంపటి అవుతుంది తప్ప పెద్దగా ఊపు రాదు అన్నదే రాజకీయ విశ్లేషణ. అలా కాకుండా ఆయన బీజేపీ లాంటి వాటిలో చేరితే ఆ పార్టీలకు ఎంతో కొంత బలం పెరిగి ఆ మేరకు కాంగ్రెస్ లాంటి పార్టీలకే నష్టం. ఇలా ఏ విధంగా ఆలోచించినా కొత్త శత్రువులు టీయారెస్ కే అంతిమంగా మేలు చేస్తారు అన్నదే కేసీఆర్ ప్లాన్. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి రానున్న రోజుల్లో మరింతమంది శత్రువులను తయారు చేసి కేసీఆర్ జనాల్లోకి వదిలినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. సో తెలంగాణాలో హ్యాట్రిక్ విజయానికి కారు సారు పన్నుతున్న పధకం ఇది అన్న మాట. అది పారుతుందో లేదో 2023 లోనే చూడాలి.

Tags:    

Similar News