టైమింగ్ నే నమ్ముకున్నట్లుందిగా?

తెలంగాణ‌లో మ‌ళ్లీ ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయా? ఆదిశ‌గా ప్రభుత్వాధినేత‌, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముంద‌స్తు ప్లాన్ చేసు కుంటున్నారా ? అదే వ్యూహంతో ఆయ‌న ఉన్నారా? అంటే.. [more]

Update: 2021-07-05 09:30 GMT

తెలంగాణ‌లో మ‌ళ్లీ ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయా? ఆదిశ‌గా ప్రభుత్వాధినేత‌, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముంద‌స్తు ప్లాన్ చేసు కుంటున్నారా ? అదే వ్యూహంతో ఆయ‌న ఉన్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో అంటే.. 2014లో తొలిసారి తెలంగాణ ఏర్పడిన త‌ర్వాత‌.. అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌.. ప్రతిప‌క్షాలు త‌నపైనా.. త‌న పార్టీపైనా.. త‌న పాల‌న‌పైనా… విరుచు కుప‌డుతున్న నేప‌థ్యంలో త‌క్షణ కాయ‌క‌ల్ప చికిత్సగా ఆయ‌న ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ఇంకా 9 నెల‌ల పాల‌న ఉండగానే ఆయ‌న‌.. ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న ప్రచారంలోనూ చెప్పారు.

తొమ్మిది నెలలు ముందుగానే?

ప్రతిప‌క్ష పార్టీల నోళ్లకు తాళం వేయించేందుకే.. నేను ఎన్నిక‌ల‌కు వెళ్తున్నాన‌ని చెప్పి.. ప్రభుత్వాన్ని ర‌ద్దు చేసుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లారు. మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే ఇక్కడే ట్విస్ట్ కూడా ఉంది. అప్పుడే కేసీఆర్‌పై వ్యతిరేక‌త క్రమ‌క్రమంగా పెరుగుతోంది. ఒక్కసారిగా ఆయ‌న అటు ప్రతిప‌క్షాలు, ఇటు ప్రజ‌ల మూడ్ మార్చేస్తూ ప్రభుత్వం ర‌ద్దు చేసేశారు. ఇప్పుడు కూడా ఇదే వ్యూహంతో ఏకంగా.. ఏడాది ముందుగానే పాల‌న‌కు గుడ్‌బై చెప్పి.. మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నార‌ని తెలుస్తోంది. దీనికి ప్రధాన కార‌ణం.. గ‌తంలో మాదిరిగా కాదు. ఇప్పుడు వ్యూహాలు వేరే ఉన్నాయి. ఒక‌టి.. రాష్ట్రంలో అనిశ్చితిలో ఉన్న ప్రతిప‌క్షాలు పుంజుకోక‌ముందుగానే తాను మ‌రోసారి ముచ్చట‌గా అధికారంలోకి రావాలి.

వ్యతిరేకత ముదరకముందే?

అదే స‌మ‌యంలో ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీ నేత‌ల విమ‌ర్శల నుంచి త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు ఎన్నిక‌లే మంత్రమ‌ని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ బ‌లంగా ఉంది. నీటి పారుద‌ల వ్యవ‌స్థల‌ను బ‌లోపేతం చేయ‌డం.. రైతు బంధు, క‌ళ్యాణ ల‌క్ష్మి.. ఇలా అనేక ప‌థ‌కాల‌ను విజ‌య‌వంతంగా అమ‌లు చేయ‌డం వంటి కార‌ణంగా.. ప్రభుత్వంపై సింప‌తీ ఉంది. ఇక‌, ప్రతిప‌క్షాల ప‌రంగా చూస్తే.. బీజేపీ పుంజుకుంటాన‌ని అంటూనే.. కొంత మేర‌కు పుంజుకుని మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. దీంతో .. బీజేపీ మ‌ళ్లీ పుంజుకునేలోగానే కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించాలి. బీజేపీకి ఇక్కడ ఎంత మాత్రం ఛాన్స్ ఇవ్వకూడ‌ద‌ని కేసీఆర్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

బీజేపీ బలోపేతం కాకముందే?

అదేస‌మ‌యంలో.. కాంగ్రెస్‌లో ఏర్పడిన తీవ్ర అనిశ్చితి తొలిగిపోయి.. మ‌ళ్లీ పార్టీ గాడిన ప‌డి.. పుంజుకునేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఈ క్రమంలో అప్పటి లోగానే కేసీఆర్ తిరిగి అధికారంలోకి వ‌చ్చేస్తే.. ,ఇక‌, ప్రతిప‌క్షాల‌కు తిరుగులేని దెబ్బ కొట్టిన‌ట్టు అవుతుంది. బీజేపీ ఏ చిన్న చాన్స్ వచ్చినా.. తమను వదలదని ఆయనకు తెలుసు. ఎన్నికల్లో గెలుపు కోసం టైమింగ్ కూడా ముఖ్యమని నమ్ముతారు. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ తీవ్ర ఎదురీత‌లో ఉంది. మోడీపై దేశ‌వ్యాప్తంగా వ్యతిరేక‌త ఉంది. ఇదే తెలంగాణ‌లోనూ ఉంది. ఈ నేప‌థ్యంలో బీజేపీకి చావుదెబ్బ కొట్టేందుకు స‌రైన స‌మ‌యం అని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక‌,అధికార పార్టీ విష‌యానికి వ‌స్తే.. నాగార్జున సాగ‌ర్ విజ‌యంతో పుంజుకుంది. దీంతో ఇలాంటి స‌మ‌యంలోనే త‌న వ్యూహాన్ని అమ‌లు చేయ‌డం ద్వారా స‌క్సెస్ కావ‌డంతోపాటు హ్యాట్రిక్ కొట్టొచ్చనేది కేసీఆర్ వ్యూహంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News