ఇప్పుడు కాదట.. ఆ ఫలితం తర్వతేనట

హుజూరాబాద్ ఉప ఎన్నికకు మంత్రి వర్గ విస్తరణకు కేసీఆర్ ముడిపెట్టినట్లే కన్పిస్తుంది. వచ్చే ఎన్నికలకు వెళ్లాలంటే కొత్త టీంతో వెళ్లాలన్నది కేసీఆర్ ఆలోచన. ఇందుకోసం మంత్రివర్గాన్ని విస్తరించాలనుకున్నారు. [more]

Update: 2021-09-19 11:00 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నికకు మంత్రి వర్గ విస్తరణకు కేసీఆర్ ముడిపెట్టినట్లే కన్పిస్తుంది. వచ్చే ఎన్నికలకు వెళ్లాలంటే కొత్త టీంతో వెళ్లాలన్నది కేసీఆర్ ఆలోచన. ఇందుకోసం మంత్రివర్గాన్ని విస్తరించాలనుకున్నారు. ఈటల రాజేందర్ రాజీనామాతో మంత్రి వర్గంలో ఖాళీ ఏర్పడింది. దీంతో పాటు కొందరు మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి కొత్త వారికి అవకాశమివ్వాలని కేసీఆర్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు.

ఎప్పటికప్పుడు వాయిదా…

వరస ఎన్నికలు రావడంతో ఎప్పటికప్పుడు మంత్రి వర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు మంత్రి వర్గ విస్తరణ చేపడితే అసమ్మతి, అసంతృప్తి పెరిగే అవకాశముందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగిన తర్వాత తాను అనుకున్నట్లు విస్తరణ చేపట్టవచ్చని ఆయన అనుకుంటున్నారు.

కొందరిని తొలగించాలని…

ప్రస్తుతం ఉన్న మంత్రి వర్గంలో కొందరి పనితీరు బాగా లేదని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న మరికొందరు సుదీర్ఘకాలంగా మంత్రి పదవి కోసం చూస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంట ఉన్న సీనియర్ నేతలు ఈసారి తమకు కేబినెట్ లో చోటు దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. వీరిందరినీ సంతృప్తి పర్చడం సాధ్యం కాకపోవచ్చు. ఎన్నికల టీం అంటే ఎక్కువగా యువకులకే ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఆ ఎన్నిక తర్వాతే….

అయితే నిజానికి ఈ మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడో పూర్తికావాల్సి ఉన్నా సాగర్, జీహెచ్ఎంసీ ఎన్నికల రాకతో వాయిదా వేస్తు వచ్చారు. ఇప్పుడు అనూహ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా వచ్చింది. ఈ ఎన్నిక ఫలితాల తర్వాత ఖచ్చితంగా మంత్రి వర్గ విస్తరణను కేసీఆర్ చేపట్టనున్నారు. ఇప్పటికే కొందరికి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు కూడా తెలిసింది. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యనేతలతో కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం.

Tags:    

Similar News