kcr : ఈయన లెక్కలు ఇవేనట..అందుకే వెనక్కు?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ఊహాగానాలు వస్తున్నాయి. అయితే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లేందుకు కేసీఆర్ [more]

Update: 2021-09-25 11:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ఊహాగానాలు వస్తున్నాయి. అయితే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ మరో రెండేళ్లలో దానిని అధిగమించాలన్నది కేసీఆర్ ప్రయత్నంగా ఉంది. గతంలో మాదిరి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రెండుసార్లు గెలిచి…

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ తన పార్టీని విజయం వైపు నడిపించారు. అయితే తర్వాత ఎన్నికలకు ఏడాది ముందుగానే 2018లో ఎన్నికలకు వెళ్లి మరోసారి ఘన విజయం సాధించారు. అయితే రెండుసార్లు వరసగా విజయం సాధించడంతో సహజంగానే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. దీనిని అధిగమించాలంటే అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకునే దిశగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.

అన్ని వర్గాలను…

ఇప్పటికే దళితబంధు పథకంతో ఒక సామాజికవర్గాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు కావాలంటే కొంత సమయం పడుతుంది. దీంతో పాటు మరికొన్ని పథకాలు కూడా కేసీఆర్ మస్తిష్కంలో ఉన్నాయి. వాటి రూపకల్పన జరుగుతుంది. వీటిని అమలు చేయాలంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని భావిస్తున్నారు. బీసీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాలను ఆకట్టుకునేందుకు త్వరలోనే పథకాలను ప్రకటించనున్నారు.

అమలు చేసిన తర్వాతే?

ఈ పథకాలన్నీ ఎన్నికలకు ముందుగానే అమలు చేసి క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఏదీ చేయడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి కాంగ్రెస్ కొంత పుంజుకోగలిగితే తమ విజయం సాధ్యమవుతుందని, అందుకు కొంత సమయం పడుతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. దీంతో పాటు గతంలో లాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సయితం సహకరించే పరిస్థితి లేదు. అందుకే కేసీఆర్ ముందస్తు ఆలోచనను విరమించుకున్నారని తెలిసింది.

Tags:    

Similar News