వైసీపీ కంచుకోటలో సైకిల్ చ‌క్రం తిరుగుతుందా ?

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సొంత జిల్లా కేంద్రమైన కడపలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ సీటును గెలుచుకునేందుకు వైసీపీతో పాటు టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా పోటీ పడుతున్నాయి. ప్రస్తుత [more]

Update: 2019-02-09 11:00 GMT

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సొంత జిల్లా కేంద్రమైన కడపలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ సీటును గెలుచుకునేందుకు వైసీపీతో పాటు టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా పోటీ పడుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే అంజద్‌ బాషా తిరిగి మరో సారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చెయ్యనున్నారు. ఇక మైనార్టీల ప్రాబ‌ల్యం ఎక్కువగా ఉండడంతో తెలుగుదేశం పార్టీ కూడా ఈ సారి మైనార్టీ కార్డును వాడనుంది. మాజీ ఎమ్మెల్యే అహ్మదుల్లా తనయుడిని కడప నుంచి పోటీ చేయించేందుకు రంగం సిద్ధమైంది. అహ్మదుల్లా 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి వరుస విజయాలు సాధించడంతో పాటు మంత్రిగా కూడా పని చేశారు. అహ్మదుల్లాకు కడపలో మంచి ఇమేజ్‌ ఉంది. 1952లో ఏర్పడ్డ కడప నియోజకవర్గం నుంచి మహామహులు పోటీ చేశారు. 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించాక‌ ఈ నియోజకవర్గంలో టీడీపీ పలు మార్లు విజయాలు సాధించింది.

1983 తర్వాత ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు టీడీపీ, మూడు సార్లు కాంగ్రెస్‌, ఒక సారి వైసీపీ విజయం సాధించాయి. తెలుగుదేశంకు జిల్లా కేంద్రమైన కడపలో మంచి పట్టు ఉన్నప్పటికి 2004 నుంచి గత మూడు ఎన్నికల్లోనూ వరసగా ఓడిపోతూ వస్తోంది. ఇంకా చెప్పాలంటే 2004 నుంచి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రాభవం క్రమక్రమంగా క్షీనిస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అంజద్‌ బాషా టీడీపీ అభ్యర్థి దుర్గా ప్రసాద్‌పై ఘన విజయం సాధించారు. 1994 నుంచి కడప నియోజకవర్గంలో పార్టీ ఏదైనా వరసగా మైనార్టి అభ్యర్థులే గెలుపొందుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కడప మైనార్టీలకు కంచుకోటగా మారింది. ఈ పరిస్థితుల్లో గతంలో కాంగ్రెస్‌ ఆ తర్వాత వైసీపీ కడప సీటును మైనార్టీలకు కేటాయిస్తూ వరుస విజయాలు సాధిస్తుండడంతో ఈ సారి తెలుగుదేశం కూడా మైనార్టి అభ్యర్థిని రంగంలోకి దించేందుకు సిద్ధమైంది.

ఈ క్రమంలోనే వైసీపీ నుంచి ఇప్పటికే మైనార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అంజ‌ద్‌ బాషా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన బాషా అభివృద్ధి పరంగా చెప్పుకోదగ్గ పనులు చెయ్యలేదు. అయితే వైసీపీ అధినేత జగన్‌ సొంత జిల్లా కేంద్రం కావడం, క్షేత్రస్థాయిలో వైసీపీకి పట్టు ఉండడంతో పాటు ప్రతిపక్షంలో ఉన్నందున పెద్దగా పనులు చెయ్యలేకపోయారన్న సానుభూతి ఆయనపై ఉంది. దీనికి తోడు సౌమ్యుడుగా ఆయనకు పేరుండడం కలిసిరానుంది. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి వరుస విజయాలు సాధించి మంత్రిగా పని చేసిన అహ్మదుల్లా, ఆయన తనయుడు అష్ర‌ఫ్‌ నెల రోజుల క్రితమే కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరారు. వీరిలో అష్రఫ్‌కు టీడీపీ అసెంబ్లీ టిక్కెట్‌ ఖరారు అయినట్టే. ఇక ప్రధాన పార్టీలు రెండూ మైనార్టీ అభ్యర్థులను బరిలోకి దించడంతో మైనార్టీల ఓట్లు ఎవరు ఎక్కువ చీల్చుకుంటారు.. అలాగే మిగిలిన సామాజికవర్గాల ఓటర్లు ఎటు వైపు ఉంటారన్నది కూడా ఆసక్తిగా ఉంది.

ఇక జనసేన ప్రధాన పార్టీలు రెండూ మైనార్టి అభ్యర్థులను రంగంలోకి దించడంతో వచ్చే ఎన్నికల్లో తొలి సారి పోటీ పడుతున్న జనసేనకు ఇక్కడ బలం లేకపోయినా మైనార్టీయేతర అభ్యర్థిని ఇక్కడ పోటీ చేయించే వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన జ‌యాపజాయాలు ఎలా ఉన్నా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపితే కొంత వరకు ఆదరణ కనిపించే అవకాశం ఉంది. ఏదేమైనా జగన్‌ కంచుకోటగా ఉన్న కడప బరిపై టీడీపీ, వైసీపీ రెండూ గురి పెట్టాయి, మరి ఆ గురిలో ఎవరు సక్సెస్‌ అవుతారో చూడాల్సి ఉంది. ప్ర‌స్తుతానికి ఇక్క‌డ వైసీపీకి కొంత అనుకూల‌త ఉంది.

Tags:    

Similar News