మళ్లీ రాజుకుందే… ఇప్పట్లో ఆగేట్లు లేదుగా

అధికార పార్టీలో అసంతృప్తులు మామూలే. పదవులు రాలేదని కొందరు, తమను నిర్లక్ష్యం చేశారని మరికొందరు అలకపాన్పు ఎక్కుతారు.కానీ పార్టీని మాత్రం ఇబ్బంది పెట్టరు. కానీ ఇక్కడ మాత్రం [more]

Update: 2020-08-19 09:30 GMT

అధికార పార్టీలో అసంతృప్తులు మామూలే. పదవులు రాలేదని కొందరు, తమను నిర్లక్ష్యం చేశారని మరికొందరు అలకపాన్పు ఎక్కుతారు.కానీ పార్టీని మాత్రం ఇబ్బంది పెట్టరు. కానీ ఇక్కడ మాత్రం గత కొన్నేళ్లుగా విభేదాలు భగ్గుమంటున్నాయి. నియోజకవర్గంలో పట్టుకోసం ఇద్దరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాళ్లే మాజీ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, రాజయ్య. ఈ ఇద్దరి మధ్య స్టేషన్ ఘన్ పూర్ క్యాడర్ రెండుగా చీలిపోయింది.

స్టేషన్ ఘన్ పూర్ లో ఆధిపత్యం కోసం….

కాంగ్రెస్ నుంచి రాజయ్య టీఆర్ఎస్ లోకి వచ్చిన నాటి నుంచి ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. స్టేషన్ ఘన్ పూర్ టిక్కెట్ కోసం కడియం శ్రీహరి ప్రయత్నించారు. తన కుమార్తెను అక్కడి నుంచి పోటీ చేయించాలని కడియం శ్రీహరి భావించారు. కానీ కేసీఆర్ మాత్రం రాజయ్యకే టిక్కెట్ ఇస్తూ వస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఇద్దరి మధ్య అధిష్టానం సయోధ్య కుదిర్చింది. దీంతో రాజయ్య గెలుపు సాధ్యమయింది.

కడియం వర్గీయులపై వేటు….

అయితే కడియం శ్రీహరి మంత్రి పదవి లేక కొన్నాళ్లుగా ఖాళీగా ఉండటంతో తిరిగి స్టేషన్ ఘన్ పూర్ లో తన వర్గాన్ని పటిష్టం చేసే పనిలో పడ్డారు. దీంతో రాజయ్యకు ఇబ్బందిగా మారింది. కడియం శ్రీహరికి అనుకూలంగా తనకు వ్యతిరేకిస్తున్న ఇద్దరిని ఇటీవల పార్టీ నుంచి రాజయ్య సస్పెండ్ చేయడంతో విభేదాలు మరింత ముదిరాయి. చిల్పూరు మండల అధ్యక్షుడు కేసిరెడ్డి మనోజ్ రెడ్డిని ఆ పదవి నుంచి రాజయ్య తొలగించారు. మరో నేత ఎడవల్లి విజయను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

అధిష్టానానికి ఫిర్యాదు…..

దీంతో తన వర్గంపై రాజయ్య కత్తులు దూస్తున్నారన్న విషయం అర్థమయిన కడియం శ్రీహరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పార్టీ సంస్థాగత కమిటీల్లోనూ కడియం వర్గాన్ని రాజయ్య పూర్తిగా దూరం పెట్టారు. ఇలా స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్య, కడియం వర్గాలుగా విడిపోయి ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. అధిష్టానం జోక్యం చేసుకోకుంటే పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తం మీద ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య పోరు పార్టీని ఎటువైపుకు తీసుకెళుతుందో చూడాలి.

Tags:    

Similar News