రాయదుర్గంలో కాల్వ పరిస్థితి ఏంటి…?

తెలుగుదేశం కంచుకోట అనంతపురం జిల్లాలో కర్ణాటక సరిహద్దుగా విస్తరించి ఉన్న నియోజకవర్గం రాయదుర్గం. ప్రస్తుతం ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రాధినిథ్యం [more]

Update: 2019-02-08 00:30 GMT

తెలుగుదేశం కంచుకోట అనంతపురం జిల్లాలో కర్ణాటక సరిహద్దుగా విస్తరించి ఉన్న నియోజకవర్గం రాయదుర్గం. ప్రస్తుతం ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రాధినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో చివరి క్షణంలో రాయదుర్గం సీటు దక్కించుకున్న ఆయన స్వల్ప తేడాతో విజయం సాధించారు. అనంతరం రెండేళ్ల క్రితం జరిగిన క్యాబినెట్‌ ప్రక్షాళనలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీసీ కోటాలో మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఆయ‌న‌ రెడీ అవుతున్నారు. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకుడు అయిన మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ గుణపాటి దీపక్‌ రెడ్డి ఇద్దరూ కాల్వకు ఎంత వరకు సహకరిస్తారన్నది సందేహమే. మెట్టు గోవిందరెడ్డి వైసీపీ వైపు కూడా చూస్తున్నారు. టిక్కెట్‌పై హామీ వస్తే ఆయన వైసీపీలోకి జంప్‌ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్థానికుడు అయిన తనకే టీడీపీ సీటు ఇవ్వాలని ఆయన పట్టు పడుతున్నారు.

ఎక్కువసార్లు గెలిచిన కాంగ్రెస్

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవానికి ముందు ఇక్కడ నుంచి వరసగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు విజయం సాధిస్తూ వచ్చారు. 1952లో నియోజకవర్గం ఏర్పాటు అయినప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జీ. నాగభూషణం తొలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీకే చెందిన ఎన్‌సీ శాషాద్రి, ఎల్‌. చిన్నపు రెడ్డి, గొల్లప‌ల్లి త్విప్పేస్వామి వరుసగా మూడు సార్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్‌ ప్రభంజం వీచినా ఇక్కడ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన పాటిల్‌ వేణుగోపాల్‌ రెడ్డి టీడీపీ అభ్యర్థి కాటా గోవిందప్ప, కాంగ్రెస్‌ అభ్యర్థిపై సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత బండి హులికుంటప్ప కాంగ్రెస్‌ పార్టీ తరపున విజయం సాధించారు. 1989లోనూ కాంగ్రెస్‌ నుంచి పాటిల్‌ వేణుగోపాల్‌ రెడ్డి గెలుపొందారు. ఇక 1994లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఎన్టీఆర్‌ ప్రభంజనంలో అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న బండి హులికుంటప్ప టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వేణుగోపాల్‌ రెడ్డిపై 20,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 1999లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన వేణుగోపాల్‌ రెడ్డి విజయం సాధించారు. 2004లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ గాలి వీస్తే రాయదుర్గంలో మాత్రం టీడీపీ నుంచి పోటీ చేసిన గోవింద‌రెడ్డి విజయం సాధించారు. ఇక 2009లో ఇక్కడ నుంచి తొలిసారి పోటీ చేసిన కాపు రామచంద్రారెడ్డి విజయం సాధించారు.

వైసీపీ అభ్యర్థి ఎవరో..?

2012లో రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి ఘన విజయం సాధించారు. ఇక గత ఎన్నికలకు ముందు కాల్వ శ్రీనివాసులు కేవలం 15 రోజులకు ముందే రాయదుర్గంలో ఎంట్రీ ఇచ్చి విజయం సాధించారు. కాల్వ కేవలం 1,827 ఓట్ల మెజారిటీతో మాత్రమే విజయం సాధించి బయట పడ్డారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీలో సీటు కోసం కాల్వతో పాటు పార్టీ సీనియర్‌ నేత గోవిందరెడ్డి పోటీ పడుతున్నా చంద్రబాబు కాల్వ వైపే మొగ్గు చూపే ఛాన్సులు ఉన్నాయి. ఇక నియోజకవర్గంలో మంత్రిగా కాల్వ చేసిన అభివృద్ధి టీడీపీకి కలిసిరానుంది. అయితే ద్వితీయశ్రేణి కేడర్‌లో ఉన్న అసంతృప్తి, అటు గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి ఎంత వరకు సహకరిస్తారన్న సందేహాలు కాల్వకు మైనెస్‌గా మారాయి. నియోజకవర్గంలో బీసీ ఓటర్ల ప్రాబ‌ల్యం ఎక్కువ. మొత్తం 2,40,000 ఓటర్లు ఉండగా అందులో అత్యధిక శాతం బీసీలైన వాల్మీకులు, యాదవులు, కురుబ ఓటర్లు ఉన్నారు. 2004 ఎన్నికల తర్వాత చూస్తే స్థానికేతురులే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా పోటీ చేస్తున్నారు. ఇక వైసీపీ నుంచి కాపు రామచంద్రారెడ్డి పోటీ చేసేందుకే ఛాన్సులు ఉన్నా చివరి క్షణంలో సమీకరణలు మారవచ్చన్న ప్రచారమూ ఉంది. ఆయ‌న రాజ‌కీయాల్లో నిస్తేజంగా ఉంటున్నార‌న్న భావ‌న వైసీపీ అధిష్టానంలో ఉంది. ఇక ఈ నియోజకవర్గంలో జనసేన ప్రాబ‌ల్యం పెద్దగా లేదు. అయితే జనసేన బీసీల్లో బలమైన అభ్యర్థికి సీటు ఇస్తే ప్రధాన పార్టీల అభ్యర్థుల జాతకాలు మారే అవకాశం ఉంది.

Tags:    

Similar News