కాల్వకు.. ఈసారి కష్టమేనా..?

అనంతపురం జిల్లాలో మళ్లీ పట్టు నిలుపుకోవాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి పార్టీలోని అసమ్మతి సమస్యగా మారింది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పట్ల క్యాడర్ లో అసంతృప్తి ఉంది. టిక్కెట్ల [more]

Update: 2019-03-24 09:30 GMT

అనంతపురం జిల్లాలో మళ్లీ పట్టు నిలుపుకోవాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి పార్టీలోని అసమ్మతి సమస్యగా మారింది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పట్ల క్యాడర్ లో అసంతృప్తి ఉంది. టిక్కెట్ల కోసం ఆశావహులు ఎక్కువగా ఉండటంతో టక్కెట్లు దక్కని నేతలు కూడా పార్టీ అభ్యర్థులను ఓడిస్తామంటూ బాహాటంగానే ప్రకటన చేస్తున్నారు. ఏకంగా మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రానినిథ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలోనే అసమ్మతి తారస్థాయిలో ఉంది. కాల్వను ఓడిస్తామని ఆయనకు వ్యతిరేంకగా ఉన్న రెండు వర్గాల నేతలు బాహాటంగా ప్రకటన చేయడంతో కాల్వకు ఈసారి ఎదురీత తప్పదే అంచనాలు ఉన్నాయి.

కాల్వ శ్రీనివాసులుపై స్వంత పార్టీలోనే వ్యతిరేకత

ఎంపీగా పనిచేసిన కాల్వను గత ఎన్నికల్లో రాయదుర్గం నుంచి చంద్రబాబు బరిలో దింపారు. వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డిపై ఆయన 1,827 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు మొదట చీఫ్ విప్ పదవి, తర్వాత మంత్రి పదవి దక్కింది. దీంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు బాగానే చేయగలిగారు. అయితే, పార్టీలోనే అసంతృప్తి ఆయనకు సమస్యగా మారింది. ఈ టిక్కెట్ ఆశించిన జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఇప్పుడు టీడీపీపై గుర్రుగా ఉన్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. దీపక్ రెడ్డికి ఇక్కడ బలమైన అనుచరవర్గం ఉంది. దీంతో ఆయనను బుజ్జగించాల్సిన బాధ్యతను చంద్రబాబు జేసీ సోదరులపైనే పెట్టారు.

బలమైన అభ్యర్థిగా ఉన్న కాపు…

ఇక, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి కూడా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకుండా మళ్లీ కాల్వకే టిక్కెట్ ఖరారు చేయడం పట్ల ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఆయనకు సైతం నియోజకవర్గంలో కొంత పట్టుంది. దీంతో ఆయనను బుజ్జగించేందుకు స్వయంగా కాల్వ శ్రీనివాసులు రంగంలోకి దిగారు. తన గెలుపునకు సహకరించాలని ఆయనను కోరారు. అయితే, కాల్వ రాయబారం ఫలించలేదు. దీంతో ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. ఇన్ని ప్రతికూలతల మధ్య కాల్వ శ్రీనివాసులు ఎన్నికలను ఎదుర్కోనున్నారు. ఇక, వైసీపీ నుంచి మరోసారి కాపు రామచంద్రారెడ్డి బరిలో ఉండనున్నారు. ఆయన ఇంతకుముందు రెండుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇచ్చారు. ఆర్థికంగా బలంగా ఉన్న ఆయన స్వంత నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరుంది. ఈసారి ఆయన కాల్వకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. మొత్తానికి కాల్వ శ్రీనివాసులు ఈసారి రాయదుర్గంలో గడ్డు పరిస్థితినే ఎదుర్కుంటున్నారు. అసమ్మతులు దారికొచ్చి పూర్తిగా ఆయనకు సహకరించకపోతే ఆయన గెలుపు కష్టమే అవుతుంది అంటున్నారు.

Tags:    

Similar News