కమల్ మెంటల్ గా ఫిక్స్ అయ్యారా?

తమిళనాడు ఎన్నికల ఫలితాలపై కమల్ హాసన్ కు కొంత స్పష్టత వచ్చినట్లు అనిపిస్తోంది. అందుకే ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేశారనిపిస్తోంది. తన పార్టీకి [more]

Update: 2021-04-20 18:29 GMT

తమిళనాడు ఎన్నికల ఫలితాలపై కమల్ హాసన్ కు కొంత స్పష్టత వచ్చినట్లు అనిపిస్తోంది. అందుకే ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేశారనిపిస్తోంది. తన పార్టీకి ఇవే చివరి ఎన్నికలు కావని, ఇది ప్రారంభం మాత్రమేనని కమల్ హాసన్ చెప్పడం తాను పెద్దగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపలేక పోతానని అంగీకరించినట్లయిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. కమల్ హాసన్ తృతీయ కూటమిగా బరిలోకి దిగి అన్ని స్థానాల్లో పోటీ చేశారు.

ప్రధాన పోటీ…..

అయితే ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకే ల మధ్యనే ఉంది. కమల్ హాసన్ ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా కన్పించలేదంటున్నారు. కమల్ హాసన్ ఒకరకంగా విపక్ష డీఎంకేకు మేలు చేశారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. తమిళనాడులో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని దాదాపు మూడేళ్ల క్రితం ప్రారంభించారు. అరవింద్ కేజ్రీవాల్ ను పిలిచి మరీ పార్టీని ప్రారంభించారు. అప్పటి నుంచి జరిగిన కొన్ని ఎన్నికల్లో పోటీ చేసినా గెలుపు దక్కలేదు.

రజనీ సహకారం…

ఈసారి రజనీకాంత్ పార్టీ పెడితే దానితో కలసి పోటీ చేయాలని కమల్ హాసన్ భావించారు. కానీ రజనీకాంత్ మధ్యలోనే ఆ ఆలోచనను విరమించుకున్నారు. అయినా రజనీకాంత్ మద్దతు తనకు లభిస్తుందనుకున్నారు. సినీ పరిశ్రమ నుంచి ఇద్దరికి మంచి సంబంధాలు ఉండటంతో తనకు మద్దతుగా కనీసం ఒక ప్రకటన అయినా చేస్తారని ఊహించారు. ఒకసారి రజనీకాంత్ ను కలసి మద్దతు కోరారు. అయినా రజనీకాంత్ ఈ ఎన్నికలలో ఎవరికి మద్దతు ప్రకటించలేదు.

క్యాడర్ లో ధైర్యం నింపేందుకే…?

ఇక కమల్ హాసన్ కూటమి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని ఎన్నికల అనంతరం విశ్లేషణలు రావడంతో క్యాడర్ ను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు కమల్ హాసన్. ఇది ప్రారంభం మాత్రమేనని, ముందు ముందు చాలా ఎన్నికలు ఉంటాయని కమల్ హాసన్ చెప్పడాన్ని చూస్తే ఆయన మానసికంగా ఓటమిని అంగీకరించినట్లేనని అంటున్నారు. ఈ ఎన్నికల అనుభవాన్ని ఉప యోగించుకుని భవిష్యత్ కు బాటలు వేసుకుందామని కమల్ హాసన్ చెప్పడం విశేషం.

Tags:    

Similar News