జ‌గ‌న్ మామ‌కు అంత ఈజీ కాదా..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్వంత జిల్లా క‌డ‌ప‌లో ఈ ఎన్నిక‌లు ఆస‌క్తిక‌రంగా జ‌రిగాయి. ఈసారి జిల్లాలో అన్ని స్థానాలు గెలిచి స్వీప్ [more]

Update: 2019-05-15 01:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్వంత జిల్లా క‌డ‌ప‌లో ఈ ఎన్నిక‌లు ఆస‌క్తిక‌రంగా జ‌రిగాయి. ఈసారి జిల్లాలో అన్ని స్థానాలు గెలిచి స్వీప్ చేయాల‌ని వైసీపీ భావించ‌గా క‌నీసం నాలుగైదు స్థానాలు గెలుచుకొని వైసీపీ హ‌వాకు బ్రేక్ వేయాల‌ని తెలుగుదేశం పార్టీ ప‌ట్టుద‌ల‌గా వ్య‌వ‌హ‌రించింది. ముఖ్యంగా జిల్లాలో పులివెందుల త‌ర్వాత తెలుగుదేశం పార్టీ క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. ఇక్క‌డి నుంచి స్వ‌యానా జ‌గ‌న్ మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి పోటీ చేయ‌డంతో ఈసారి ఆయ‌న‌ను ఓడించాల‌ని తెలుగుదేశం పార్టీ కంక‌ణం క‌ట్టుకొని ప‌నిచేసింది. వైసీపీ కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ వ్యూహాలు ప‌న్ని విజ‌యంపై ధీమాగా ఉంది.

పుత్తాపై సానుభూతి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి పుత్తా న‌ర‌సింహారెడ్డిపై 5,345 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. అంత‌కుముందు పుత్తా న‌ర‌సింహారెడ్డి రెండుసార్లు పోటీ చేసి వీర‌శివారెడ్డి చేతిలో ఓట‌మి పాల‌య్యారు. దీంతో వ‌రుస‌గా మూడుసార్లు ఓడిపోయిన పుత్తా ఈసారి క‌చ్చితంగా గెలుస్తాన‌ని భావిస్తున్నారు. మూడుసార్లు ఓడిపోయినందున ఆయ‌న‌కు సానుభూతి బాగా ఉప‌యోగ‌ప‌డింది. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గానికి సాగునీరు అందించామ‌ని తెలుగుదేశం పార్టీ ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది. జిల్లాను బాగా అభివృద్ధి చేశామ‌ని అభివృద్ధి మంత్రం జ‌పించింది. అయితే, తెలుగుదేశం పార్టీలో వ‌ర్గ విభేదాలు ఆ పార్టీకి ఇబ్బందిక‌రంగా మారాయి. ఈసారి టీడీపీ క‌మ‌లాపురం టిక్కెట్ కు పుత్తాతో పాటు మాజీ ఎమ్మెల్యే వీర‌శివారెడ్డి కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నించారు.

వైసీపీకి మ‌ద్ద‌తిచ్చిన టీడీపీ నేత‌

మూడుసార్లు ఇక్క‌డ ఎమ్మెల్యేగా ప‌నిచేసిన వీర‌శివారెడ్డికి నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టుంది. అయినా, మూడుసార్లు ఓడినందున చంద్ర‌బాబు పుత్తాకే టిక్కెట్ ఇచ్చి మ‌రో ఛాన్స్ ఇచ్చింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు టీడీపీలో ఉన్న వ‌ర్గ విభేదాల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు పావులు క‌దిపారు. తెలుగుదేశం పార్టీలోనే ఉన్న వీర‌శివారెడ్డి అంత‌ర్గ‌తంగా వైసీపీ అభ్య‌ర్థి ర‌వీంద్ర‌నాథ్ రెడ్డికి మ‌ద్ద‌తు ఇచ్చారు. ఆయ‌న వ‌ర్గం మొత్తం ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి గెలుపున‌కు స‌హ‌క‌రించింది. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ బ‌లం పెరిగింది. పోలింగ్ ముగిసిన రెండు రోజుల‌కే వైసీపీ అభ్య‌ర్థి వెళ్లి వీర‌శివారెడ్డిని క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారంటే ఆయ‌న వైసీపీకి ఎంత‌గా స‌హ‌క‌రించారో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే, ఎమ్మెల్యేగా ఐదేళ్లు ప‌నిచేసినా నియోజ‌క‌వ‌ర్గంలో ర‌వింద్ర‌నాథ్ రెడ్డి త‌న‌దైన ముద్ర వేసుకోలేక‌పోయారు. కానీ, జిల్లాలో వైసీపీ హ‌వా ఉండ‌టంతో ఆయ‌న విజ‌యంపై ధీమాగా ఉన్నారు. మొత్తంగా టీడీపీ అభ్య‌ర్థి పుత్తాకు సానుభూతి క‌లిసివ‌చ్చినా వ‌ర్గ విభేదాలు దెబ్బ‌తీశాయి. దీంతో వైసీపీ అభ్య‌ర్థి గెలిచే అవ‌కాశాలు క‌నిపిస్తున్న మెజారిటీ మాత్రం స్వ‌ల్పంగానే ఉండే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News