ఎవరికి దెబ్బేస్తారో కదా…??

తమిళనాట ఎన్నికల సమయంలో కమల్ హాసన్ ఇప్పుడు హాట్ టాపిక్ గామారారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ఇప్పటికే ప్రారంభం కాలేదు. ఆయన వచ్చే లోక్ సభ [more]

Update: 2019-02-26 18:29 GMT

తమిళనాట ఎన్నికల సమయంలో కమల్ హాసన్ ఇప్పుడు హాట్ టాపిక్ గామారారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ఇప్పటికే ప్రారంభం కాలేదు. ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాము పోటీ చేసేది లేదని చెప్పేశారు. కానీ కమల్ హాసన్ మాత్రం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. తొలుత కమల్ హాసన్ డీఎంకే కూటమిలో చేరతారనుకున్నారు. కానీ డీఎంకే కూటమిలో చేరకుండా ఆయన సొంతంగా బరిలోకి దిగేందుకే సిద్ధమయ్యారు. చిన్నా చితకా పార్టీలను కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలన్నది కమల్ హాసన్ వ్యూహంగా కన్పిస్తోంది.

మక్కల్ నీది మయ్యమ్ తో…..

కమల్ హాసన్ ఏడాది క్రితమే మక్కల్ నీది మయ్యమ్ పార్టీని ప్రకటించారు. అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఎక్కవగా యువ ఓటర్లను ఆకట్టుకునేలా ఆయన పర్యటనలు సాగుతున్నాయి. కమల్ తొలి నుంచి కమలం పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నారు. బీజేపీపైన నెగిటివ్ కామెంట్లు అనేక సందర్భాల్లో చేసిన కమల్ హాసన్ ఆ పార్టీ ఉన్న కూటమిలో చేరరని దాదాపుగా అప్పుడే తేలిపోయింది. ఇక అధికార అన్నాడీఎంకే పైనా కమల్ విరుచుకుపడుతుంటారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం టార్గెట్ గా కమల్ అనేకాసార్లు విమర్శలు బహిరంగ సభల్లోనూ, ట్వీట్ల ద్వారా చేశారు.

డీఎంకే కూటమిలో…..

దీంతో కమల్ హాసన్ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ కూటమిలో చేరతారన్న ప్రచారం జరిగింది. దీనికితోడు కాంగ్రెస్ అధినేతలైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలసి రావడం కూడా ఇందుకు మరింత ఊతమిచ్చింది. అయితే డీఎంకేకూటమిలో ఇప్పటికే దాదాపు పదిహేను పార్టీలున్నాయి. అందులో చేరడానికి కమల్ సుముఖత చూపలేదు. దీంతోపాటు డీఎంకే నుంచి కూడా కమల్ తో చర్చలు జరిపేందుకు ఎటువంటి సంకేతాలు రాలేదు. దీంతో కమల్ హాసన్ ఒంటరిగానే పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయించారు.

అన్ని స్థానాలకూ….

తమిళనాడులోని 40 పార్లమెంటు స్థానాలకూ తర్వలో అభ్యర్థులను ప్రకటిస్తానని కమల్ చెబుతుండటం విశేషం. అభ్యర్థుల ఎంపికలో కమల్ హాసన్ బిజీగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కమల్ హాసన్ వల్ల ఎవరికి దెబ్బ అన్న చర్చజరుగుతోంది. అధికార అన్నాడీఎంకే ఓట్లనే ఎక్కువగా కమల్ హాసన్ చీలుస్తారన్నది విశ్లేషకుల అంచనా. అయితే లోక్ సభ ఎన్నికలను కమల్ హాసన్ ఒక ప్రయోగంలా చూస్తున్నారట. ఇందులో ఒంటరిగా పోటీ చేసి వచ్చే ఫలితాలను బట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవ్వాలన్నది కమల్ ఆలోచనగా ఉంది. దీంతో కమల్ ఎవరికి దెబ్బేస్తారోనన్న భయం అన్నిపార్టీలకూపట్టుకుంది.

Tags:    

Similar News