టీడీపీలో క‌మ్మ వ‌ర్గానిది.. అల‌కా.. ఆవేద‌నా..?

క‌మ్మ సామాజిక వ‌ర్గం ప్రాతినిధ్యం, ప్రాధాన్యం ఎక్కువ‌గా ఉండే.. ప్రధాన ప్రతిప‌క్షం.. టీడీపీలో ఇప్పుడు పెద్ద చిక్కే వ‌చ్చి ప‌డింది. అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా ఉన్న.. పార్టీ [more]

Update: 2020-10-22 03:30 GMT

క‌మ్మ సామాజిక వ‌ర్గం ప్రాతినిధ్యం, ప్రాధాన్యం ఎక్కువ‌గా ఉండే.. ప్రధాన ప్రతిప‌క్షం.. టీడీపీలో ఇప్పుడు పెద్ద చిక్కే వ‌చ్చి ప‌డింది. అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా ఉన్న.. పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు దూకుడుగా వ్యవ‌హ‌రించిన క‌మ్మ సామాజిక వ‌ర్గం నేత‌లు.. ఇప్పుడు చంద్రబాబుకు దూరంగా ఉన్నారు. ఆయ‌న చెప్పేది వినడం లేదు.. ఎవ‌రూ బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేదు.. పైగా ఇటీవ‌ల పార్లమెంట‌రీ జిల్లా ఇంచార్జ్‌లు, క‌మిటీలు వేశాక‌.. చంద్రబాబుపై ఒకింత అస‌హ‌నం, వ్యతిరేక‌త‌, అల‌క‌, ఆవేద‌న‌ మ‌రింత ఎక్కువైంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా అమ‌రావ‌తి రాజ‌ధానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాలు నిర్వహించాల‌ని.. జ‌గ‌న్‌ను ఏకేయాల‌ని చంద్రబాబు పిలుపు నిచ్చారు.

ఒకిరద్దరు మినహా….

అయితే, కీల‌క‌మైన క‌మ్మసామాజిక వ‌ర్గం పోగుప‌డ్డ.. కృష్ణాజిల్లా, ప్రధాన‌న‌గ‌రం విజ‌య‌వాడ‌, గుంటూరు, ప్రకాశం, ఒంగోలు, విశాఖ‌, అనంత‌పురంల‌లో ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా ముందుకురాలేదు. ఎప్పుడూ మైకు ప‌ట్టుకుని ఉండే మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వర‌రావు వ‌చ్చి కొద్దిసేపు హ‌డావుడి చేశారు. ఇక‌, గుంటూరుపై ప‌ట్టు పెంచుకునేందుకు ప్రయ‌త్నిస్తున్న గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ మాత్రం కొద్దిసేపు క‌నిపించారు. మిగిలిన జిల్లాల్లో గ‌న్ని ఆంజ‌నేయులు, ఏలూరి సాంబ‌శివ‌రావు లాంటి ఒక‌రిద్దరు నేత‌లే బ‌య‌ట‌కు వ‌చ్చారు త‌ప్ప.. కీల‌క‌మైన నాయ‌కులు ఎక్కడా క‌న‌ప‌డ‌లేదు.

కీలక నేతల వర్గాలు కూడా…..

ద‌శాబ్దాలుగా టీడీపీలో రాజ‌కీయం చేస్తూ ఎన్నో కీల‌క ప‌ద‌వులు అధిరోహించిన వారు, ఏళ్లకు ఏళ్లుగా పాతుకుపోయిన క‌మ్మ నేత‌లు ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్‌, ఎంపీ కేశినేని నాని, ఆల‌పాటి రాజేంద్ర, య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు వ‌ర్గం ఎక్కడా కిక్కురు మ‌న‌లేదు. అనంత‌పురంలో పార్టీకి బ‌లైమ‌న కేడ‌ర్ ఉంది. అయితే, ఒక్క ప్రభాక‌ర్ చౌద‌రి త‌ప్ప ఉర‌వ కొండ నుంచి గెలుపు గుర్రం ఎక్కిన ప‌య్యావుల కేశ‌వ్ మౌనం వ‌హించారు. ఇక‌, మాజీ మంత్రి ప‌రిటాల సునీత ఓ ప‌దినిముషాలు వ‌చ్చి మ‌మ అనిపించారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఆమె కుమారుడు శ్రీరాం మాత్రం సైలెంట్ అయ్యారు.

అసహనంతోనేనా?

దీంతో అస‌లు ఏంజ‌రుగుతోంది? క‌మ్మ వ‌ర్గం కోట‌రీలో చీలిక‌లు వ‌స్తున్నాయా? అస‌హ‌నం పెల్లుబుకుతోందా? అనేది ప్రశ్న. ఇక‌, చంద్రబాబుపై ఎవ‌రు ఏమ‌న్నా కస్సున లేచే నాయ‌కులు కూడా కొన్నాళ్లుగా బాబుకు ఏమైనా ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రి కొంద‌రు క‌మ్మ నేత‌లు పార్టీనా, చంద్రబాబునా ఇవ‌న్నీ మ‌న‌కు ఇప్పుడు ఎందుకు ? మ‌న వ్యాపారాలు, మ‌న జీవితం మ‌న‌ది అన్నట్టుగా ఆఫ్ ద రికార్డుగా చ‌ర్చించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు కీల‌క‌మైన క‌మ్మ వ‌ర్గం దారి ఎటు? అనే సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఇప్పుడు కాక‌పోతే.. రేపైనా.. వారు వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రిస్తే.. బాబుకు పార్టీకి ఇబ్బందులేన‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News