కాంచన 3 మూవీ రివ్యూ

బ్యానర్: సన్‌ పిక్చర్స్‌, రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌ నటీనటులు: రాఘవ లారెన్స్‌, ఓవియా, వేదిక, నిక్కీ తంబోలి, కబీర్‌ దుహన్‌ సింగ్‌, కోవై సరళ, సూరి, అనుపమ్‌ ఖేర్‌, [more]

Update: 2019-04-19 12:50 GMT

బ్యానర్: సన్‌ పిక్చర్స్‌, రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌
నటీనటులు: రాఘవ లారెన్స్‌, ఓవియా, వేదిక, నిక్కీ తంబోలి, కబీర్‌ దుహన్‌ సింగ్‌, కోవై సరళ, సూరి, అనుపమ్‌ ఖేర్‌, తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్స్: రాజ్‌, కపిల్‌, జెస్సీ
బ్యాగ్రౌండ్ స్కోర్: ఎస్‌.ఎస్‌ తమన్‌
సినిమాటోగ్రఫీ: వెట్రి, సుశీల్‌ చౌదరి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్‌

మాములు కమర్షియల్ సినిమాలు కలిసి రావడం లేదని.. దెయ్యలతో భయపెడితే.. ప్రేక్షకులు మెచ్చుకుంటారని.. కొరియోగ్రాఫర్ కం హీరో కం డైరెక్టర్ రాఘవ లారెన్స్ నిర్ణ‌యించుకున్నాడు. ముని అంటూ సినిమా చేసి హిట్ కొట్టి.. దానికి సీక్వెల్ గా కాంచన, గంగ, శివ లింగా అంటూ హర్రర్ మూవీస్ తో భయపెట్టడం మొదలెట్టాడు. ఈ కాంచన సీక్వెల్స్ మొత్తంలో రాఘవ లారెన్స్ డైరెక్టర్ మాత్రమే కాదు.. హీరో కూడా. ఇక హీరోగా రాఘవకి దెయ్యాలంటే భయం. దెయ్యం మాట వింటేనే వణికిపోతూ తల్లి చంకలోకి ఎక్కే కుర్రాడిగా.. తర్వాత ఆ ఆత్మలనే తన మీదకి తెచ్చుకుని విలన్స్ భరతం పట్టేస్తుంటాడు. కాంచన, గంగ సినిమాల‌తో సూపర్ హిట్ కొట్టిన రాఘవ ఈసారి కాంచన 3తో కూడా ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అయ్యాడు.ఇక ఈ హర్రర్ ఫిలిమ్స్ నే మాస్ ప్రేక్షకులు నచ్చేలా తెరకెక్కించడంలో రాఘవ సిద్ధహస్తుడు. తన చిత్రాల్లో తమిళ ప్రేక్షకులనే కాదు.. తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించ గల సత్తా ఉన్న హీరో, దర్శకుడు. మరి కాంచన సీక్వెల్స్ తో భయపెడుతున్న రాఘవ లారెన్స్ ఈ కాంచన 3 తో ఏ రేంజ్ లో ప్రేక్షకులను భయపెట్టాడో సమీక్షలో చూసేద్దాం.

కథ
ముని, కాంచన, గంగ సినిమాల్లో ఎలా అయితే రాఘవ దెయ్యాలకు భయపడేవాడో…కాంచన 3లోనూ అదే విధంగా దెయ్యాలంటే చచ్చేంత భయం రాఘవకి. రాఘ‌వ ప‌డుకునేట‌ప్పుడు కూడా మంచం చుట్టూ చెప్పులు, నిమ్మకాయ‌లు పెట్టుకుంటాడు. అయితే ఒకసారి రాఘ‌వ త‌న కుటుంబంతో క‌లిసి తాత‌య్య ఊరికి వెళ‌తాడు. రాఘవ తన కుటుంబంతో తాతగారి ఇంట్లో అడుగుపెట్టిన‌ప్పటి నుంచీ చిత్ర విచిత్రాలు జ‌రుగుతుంటాయి. అర్ధరాత్రి అరుపులు, కేక‌లు వినిపిస్తుంటాయి. ఎవ‌రో అటూ, ఇటూ ప‌రుగులు పెడుతున్నట్లు క‌నిపిస్తుంటుంది. ఇక ఆ ఇంట్లో దెయ్యాలున్నాయ‌ని రాఘవ కుటుంబానికి అఘోరాలు కూడా చెప్తారు. చివరికి ఆ దెయ్యం రాఘ‌వ‌ని కూడా ఆవ‌హిస్తుంది. ఆ దెయ్యం పేరే… కాళి. అసలు రాఘవను కాళి అనే దెయ్యం ఎందుకు ఆవహిస్తుంది? అసలు కాళి ఎవ‌రు? రాఘవ మీదకొచ్చిన కాళి దెయ్యం ఏమిచేస్తుంది? కాళి దెయ్యం రాఘవతో ఎలాంటి పనులు చేయిస్తుంది? అనేది కాంచన 3 మిగతా కథ.

నటీనటుల నటన
ముని, కాంచన, గంగ సినిమాల మాదిరిగానే రాఘవ పాత్రలో ఈ సినిమాలోనూ మూడు షేడ్స్ ఉంటాయి. పిరికివాడిగా, కాళిగా, కాళి ఆవ‌హించిన రాఘ‌వ‌లా.. మూడు ర‌కాలుగా న‌టించారు. కాకపోతే కాళి పాత్ర‌, ఆ గెట‌ప్ కాస్త కొత్తగా ఉంటాయి. కొరియోగ్రాఫర్ అయిన లారెన్స్ కి డాన్స్ ల విషయంలో వంక పెట్టలేం. ఈ సినిమాలోనూ డాన్సులు ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమాల్లో హీరోయిన్స్. ముగ్గురు ఉన్నారన్న మాటేకానీ… ఏ పాత్రకీ ప్రాధాన్యం ఇవ్వ లేదు. అసలే నటనకు ప్రాధాన్యం లేని పత్రాలు దొరికితే.. వారేమో ఓవ‌ర్ మేక‌ప్ తో మ‌రింత ఇబ్బంది పెట్టారు. వేదిక, ఓవియా, నిక్కీ తంబోలి మూగ్గురు ఉన్నా వేస్ట్ అనిపిస్తుంది. కేవలం హీరోయిన్స్ ముగ్గురిని గ్లామర్ కోసమే వాడుకున్నట్లుగా ఉంది. ఇక లారెన్స్ తల్లి పాత్రలో ఎప్పటిలాగే కోవై స‌ర‌ళ అర‌చి గోల పెట్టింది. శ్రీ‌మాన్ ఓకే అనిపిస్తాడు. మిగతా పాత్రలకు అంతగా ప్రాధాన్యత లేదు.

విశ్లేషణ
రాఘవ దెయ్యం సీక్వెన్స్ అన్ని ఒకేలా ఉన్నప్పటికీ.. ఫ్లాష్ బ్యాక్ లో మాత్రం వైవిధ్యమున్న కథాలను తీసుకుని ప్రేక్షకులను భయపెట్టి మరీ మెప్పించేస్తున్నాడు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యిందనే చెప్పాలి. కాంచన 3లో యాజిటీజ్ గా కాంచన, గంగ సినిమాలలోని చాలా సీన్స్ కనిపిస్తాయి. కాంచన, గంగలలో ఒక దెయ్యం రాఘవని ఆవహిస్తే.. కాంచన 3లో రాఘవను ఆవ‌హించిన దెయ్యం ఒక‌టి కాదు. రెండు. ఆ రెండు దెయ్యాల‌కూ ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కాళి జీవితాన్ని స‌ర్వనాశ‌నం చేసిన‌ వాళ్లని దెయ్యం రూపంలో రాఘవను అడ్డుపెట్టుకుని ఎలా ప‌గ తీర్చుకున్నాడో చూపించి క‌థ‌ని ముగించారు. ఫస్ట్ హాఫ్ లో బంగ్లాలోకి దెయ్యం రావ‌డం, ఆ దెయ్యాన్ని చూసి అంతా భ‌య‌ప‌డ‌డం, ఆ దెయ్యం.. బంగ్లాలో ఉన్నవాళ్లంద‌రితోనూ ఆడుకోవ‌డం… ఇదంతా అక్కడక్కడా న‌వ్విస్తుంది. రాఘవ తాతగారి ఊరు వెళ్లే క్రమంలోనే వీరికి తెలియకుండా కాళీ, రోజీ ఆత్మలు వీరితో చేరతాయి. అమ్మమ్మ వాళ్లింటికి చేరాక హీరోయిన్ల క్యారెక్టర్లు పరిచయం అవుతాయి. రాత్రిళ్లు వింత ఆకారం ఇంట్లోవాళ్లను భయపెట్టే సీన్లలో ప్రేక్షకులు ఓవైపు భయపడుతూనే, మరోవైపు నవ్వుకుంటారు. అఘోరా సలహాపై పూజలతో ఇంట్లో దెయ్యం ఉందనే ట్విస్టుతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఫస్టాప్‌లో కామెడీ, హారర్ పండినప్పటికీ.. కాంచన సిరీస్ సినిమాలతో పోలిస్తే పెద్ద వైవిధ్యం లేదు. పాట‌ల్లో రాఘవ డాన్స్ మూమెంట్స్ ఆక‌ట్టుకుంటాయి. అతడి దర్శకత్వం కూడా బాగుంది కానీ యాక్షన్ సీన్లపై పెట్టిన శ్రద్ధ.. హారర్ సీన్లపై పెట్టలేకపోయాడు అనిపిస్తుంది. మిగతా సిరీస్‌ల మాదిరిగానే కాంచన 3 కూడా ఉండటం కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది. టెక్నీకల్ గా కాంచన 3 మ్యూజిక్ కానీ, పాటలు కానీ ఆకట్టుకోవు. కానీ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది.

ప్లస్ పాయింట్స్: క‌మ‌ర్షియ‌ల్ అంశాలు, లారెన్స్ నటన, కొన్ని కామెడీ సీన్స్, లారెన్స్ డాన్సులు, కాళి ఎపిసోడ్‌, నేపథ్య‌ సంగీతం

మైనస్ పాయింట్స్: కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, రొటీన్ నెరేషన్

రేటింగ్: 2.25/5

Tags:    

Similar News