ప‌త్తికొండ ఎమ్మెల్యే కుటుంబ రాజ‌కీయం.. ఫుల్ నెగిటివ్ ఇంపాక్ట్‌

క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 1994 నుంచి 2014 వ‌ర‌కు కూడా టీడీపీ ఓట‌మి ఎరుగ‌ని పార్టీగా దూసుకుపోయింది. ముఖ్యంగా ఇక్కడ ఎస్‌వి. [more]

Update: 2020-09-07 13:30 GMT

క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 1994 నుంచి 2014 వ‌ర‌కు కూడా టీడీపీ ఓట‌మి ఎరుగ‌ని పార్టీగా దూసుకుపోయింది. ముఖ్యంగా ఇక్కడ ఎస్‌వి. సుబ్బారెడ్డి హ్యాట్రిక్ కొట్టగా ఆ త‌ర్వాత ఇక్కడ కేఈ. ప్ర‌భాక‌ర్‌, కేఈ కృష్ణమూర్తి పార్టీ త‌ర‌ఫున ఇక్కడ నుంచి ప్రాతినిథ్యం వ‌హించారు. 1994 నుంచి గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు ఇక్కడ టీడీపీకి ఓట‌మి అనేదే లేదు. కేఈ సోద‌రులు బీసీల‌ను ఇక్కడ పార్టీకి చేరువ చేశారు. అయితే, ఇప్పుడు అదే బీసీల‌కు వ్యతిరేకంగా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా కంగాటి (చెరుకుల‌పాడు) శ్రీదేవి విజ‌యం సాధించారు. అయితే, దీనికి ముందు 2014లో చెరుకుల‌పాడు నారాయ‌ణ‌రెడ్డి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి కేఈ చేతిలో ఓడిపోయారు.

నారాయణరెడ్డి హత్యకు గురి కావడంతో…

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న జ‌గ‌న్ గూటికి చేరిపోయారు. వైసీపీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించారు. జగ‌న్ ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గ బాధ్యత‌లు కూడా క‌ట్ట‌బెట్టారు. నారాయ‌ణ‌రెడ్డి దూకుడుగా ముందుకు వెళుతూ కేఈకి చెక్ పెట్టేందుకు ప్రయ‌త్నించారు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా కూడా ఆయ‌న‌కు 31 వేల ఓట్లు వ‌చ్చాయంటే ఆయ‌న‌కు ఇక్కడ ఉన్న వ్యక్తిగ‌త ఇమేజ్ ఉందో అర్థమ‌వుతోంది. అయితే, ఏమైందో ఏమో నారాయ‌ణ రెడ్డి హ‌త్యకు గుర‌య్యారు.ఈ విష‌యంలో కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబుపైనా కేసు న‌మోదైంది.

గెలిచిన తర్వాత….

నారాయ‌ణ‌రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత ఈ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన వైసీపీఅధినేత జ‌గ‌న్‌.. 2019 ఎన్నిక‌ల్లో నారాయ‌ణ‌రెడ్డి స‌తీమ‌ణి శ్రీదేవికి టికెట్ ఇస్తాన‌ని చెప్పారు. చెప్పిన‌ట్టే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆమెకు టికెట్ ఇచ్చారు. టీడీపీ త‌ర‌ఫున కేఈ శ్యాంబాబు గ‌ట్టిపోటీ ఇచ్చారు. అయిన‌ప్పటికీ.. దాదాపు 42 వేల ఓట్ల మెజారిటీతో శ్రీదేవిని ఇక్కడి ప్ర‌జ‌లు విజ‌యం సాధించేలా చేశారు. రెడ్డిసామాజిక వ‌ర్గానికి చెందిన శ్రీదేవి.. ఎన్నిక‌లకు ముందు అన్ని సామాజిక వ‌ర్గాల‌నుక‌లుపుకుని పోతాన‌ని హామీ ఇచ్చారు. కానీ, గెలిచిన త‌ర్వాత సీన్ మారిపోయింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తం బంధువుల‌కే పెత్తనం అప్పగించారన్న విమ‌ర్శలు తీవ్రంగా వ‌చ్చేశాయి.

బంధువులదే పెత్తనం….

శ్రీదేవి అలా గెలిచారో లేదో వెంట‌నే అల్లుళ్ల‌తో పాటు బంధుగ‌ణం ఆమె చుట్టూ చేరిపోయి పెత్తనం చేస్తున్నార‌న్న టాక్ ప‌త్తికొండ‌లో వినిపిస్తోంది. ఆమె అల్లుళ్లు, బావ‌, బావ కొడుకు, ఈమె కుమారుడు వీరిదే పెత్తనం అనేలా ఉంద‌ని ఇక్కడి ప్రజ‌లే చెప్పుకొంటున్నారు. కేఈ హ‌యాంలో ఇక్కడి రెడ్లతో పాటు బీసీల‌కు ప్రాధాన్యం ఉండేది.ఇప్పుడు రెడ్లకే పెత్త‌నం ఇచ్చార‌నే భావ‌న ఎక్కువ‌గా వినిపిస్తోంది. పైగా శ్రీదేవిపై సొంత పార్టీలోనే నేత‌లు అస‌హ‌నం వ్యక్తం చేస్తున్నారు.

గెలుపు కోసం పనిచేసిన వారు….

పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు ప‌నిచేసిన నాయ‌కులు అంద‌రూ ఇప్పుడు శ్రీదేవి ద‌గ్గర లేర‌ని.. ఆమె బంధువులు, సొంత సామాజిక వ‌ర్గ నేత‌ల హ‌వానే న‌డుస్తోంద‌ని పార్టీ నేత‌లే చెవులు కొరుక్కుంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో బీసీలు, ఎస్సీల‌కు ప్రయార్టీ లేకుండా పోతోంద‌న్న ఆవేద‌న పార్టీ నేత‌ల్లో వ‌చ్చేసింది. ఇక శ్రీదేవి సైలెంట్‌గానే ఉంటున్నా ఆమె చుట్టూ ఉన్న కోట‌రీతో ఆమెపై వ్యతిరేక‌త పెరిగిపోతోంది. ఇదే ప‌రిస్థితి మ‌రో రెండేళ్లు కొన‌సాగితే.. కేఈ శ్యాంబాబు పుంజుకునేందుకు ప‌రోక్షంగా శ్రీదేవి స‌హ‌క‌రించిన‌ట్టే అవుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఆమె మార‌తారో లేదో చూడాలి.

Tags:    

Similar News