నాడు క‌మ్మలు… నేడు రెడ్లు… అక్కడ సేమ్ టు సేమ్‌.

రాజ‌కీయాల్లో కులాల ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పార్టీ అధికారంలో ఉందో..ఆ పార్టీ అధినేత సామాజిక వ‌ర్గానికి చెందిన వాళ్లు రాష్ట్రంలో ఎక్కడున్నా రాష్ట్రం అంత‌టా [more]

Update: 2020-11-22 13:30 GMT

రాజ‌కీయాల్లో కులాల ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పార్టీ అధికారంలో ఉందో..ఆ పార్టీ అధినేత సామాజిక వ‌ర్గానికి చెందిన వాళ్లు రాష్ట్రంలో ఎక్కడున్నా రాష్ట్రం అంత‌టా పాకేస్తుండ‌డంతో పాటు పెత్తనం వెల‌గ పెట్టేస్తుంటారు. ఏపీ రాజ‌కీయాల్లో కులాల గోల ఎలా ఉంటుందో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేత‌లు ఎక్కడ ఉన్నా వాళ్ల పెత్తన‌మే ఎక్కువుగా ఉండేది. కాంగ్రెస్ అధికారంలో ఉండే రెడ్లు ఎక్కువుగా లేని నియోజ‌క‌వ‌ర్గాల్లో వారి హ‌వానే న‌డిచేది. ఇక రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగాక టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంట‌నే ఐదేళ్ల పాటు ఎక్కడ చూసినా క‌మ్మ నేత‌లు, ఎమ్మెల్యేల పెత్తనాలే న‌డిచాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రెడ్ల హ‌వా మామూలుగా లేదు.

టీడీపీ హయాంలో…..

టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో క‌మ్మ నేత‌ల పెత్తనం ఎక్కువైంద‌ని టీడీపీలోనే మిగిలిన సామాజిక వ‌ర్గాల నేత‌లు గ‌గ్గోలు పెట్టేశారు. ఇప్పుడు రెడ్డి వ‌ర్గం నేత‌ల దూకుడుతో వైసీపీలో మిగిలిన వ‌ర్గాల మంత్రులు సైతం ఆగ్రహాలు, అస‌హ‌నాలు వ్యక్తం చేస్తోన్న ప‌రిస్థితి. ఏపీలో పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావ‌రి జిల్లాలో కాపులు, శెట్టిబ‌లిజ‌లు ఎక్కువ‌. టీడీపీ ప్రభుత్వంలో శెట్టిబ‌లిజ‌ల నుంచి స‌రైన ప్రాతినిధ్యమే లేదు. కాపుల్లో కూడా పేరుకు మాత్రమే చిన‌రాజ‌ప్ప మంత్రిగా ఉన్నా ఆయ‌నకు కూడా అంతంత మాత్రపు ప్రాధాన్యతే ఉండేది. ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో బ‌ల‌మైన మంత్రిగా ఉన్న క‌న్నబాబు సైతం రాష్ట్ర స్థాయిలో పార్టీకి, ప్రభుత్వానికి కీల‌క నేత‌గా ఉన్నా స్థానికంగా మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాకినాడ సిటీలో…..

కాపు సామాజిక వ‌ర్గంలో జ‌గ‌న్‌కు న‌మ్మక‌స్తుడిగా ఉన్న క‌న్నబాబు త‌న బ‌ల‌మైన వాయిస్‌తో జ‌గ‌న్‌కు న‌మ్మకాన్ని చూర‌గొన్నారు. ఏ మంత్రికి అయినా జిల్లా కేంద్రంలో ఓ అనుచ‌ర‌గ‌ణం ఉంటుంది. క‌న్నబాబుకు జిల్లాలో నియోజ‌క‌వ‌ర్గాలు, పార్టీల‌తో సంబంధం లేకుండా క్రేజ్ ఉంది. క‌న్నబాబుకు కాపు వ‌ర్గంలో మంచి ప‌ట్టుంది. ఇక జిల్లా కేంద్రంలోనూ భారీగా అనుచ‌రులు ఉన్నారు. క‌న్నబాబు జిల్లా కేంద్రమైన కాకినాడ సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో కాస్త యాక్టివ్‌గా ఉంటే సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖ‌ర్ రెడ్డికి న‌చ్చడం లేద‌ట‌. వాస్తవంగా తూర్పుగోదావ‌రి జిల్లాలో రెడ్లు నామ‌మాత్రం. అయితే వైసీపీ నుంచి కాకినాడ సిటీతో పాటు అన‌ప‌ర్తి, కొత్తపేటలో కూడా రెడ్డి వ‌ర్గం ఎమ్మెల్యేలే ఉన్నారు.

సంఖ్య స్వల్పమే అయినా….

కాకినాడ సిటీలో రెడ్లు సంఖ్యాప‌రంగా చాలా స్వల్పం. కాపుల్లో క‌న్నబాబుకు ఉన్న క్రేజ్‌తో వారంత‌ట వారే క‌న్నబాబు ద‌గ్గర‌కు వ‌స్తున్నా ద్వారంపూడి స‌హించ‌లేక‌పోతున్నార‌ట‌. త‌న ద‌గ్గర‌కు వ‌చ్చేవారికి క‌న్నబాబు సాయం చేస్తున్నా కూడా ద్వారంపూడి ఇబ్బందిగానే ఫీల‌వుతున్నారంటున్నారు. రేప‌టి వేళ కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగితే క‌న్నబాబు వ‌ర్గం ఎక్కడ దూకుడు చూపిస్తుందో ? అని.. ఈ వ‌ర్గానికి ఎక్కడ కార్పొరేట‌ర్ సీట్లు ఇస్తే పాత‌కుపోతారో ? అన్న టెన్షన్ అయితే ద్వారంపూడికి ఉంద‌న్న చ‌ర్చలు స్థానికంగా న‌డుస్తున్నాయి.

కులకోటరీలో…..

క‌న్నబాబు మంత్రిగా ఉండ‌డంతో త‌న‌ను ఎక్కడ డామినేట్ చేస్తారో ? అన్న ఆలోచ‌న‌తో ఉన్న ద్వారంపూడి సిటీ నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా జిల్లాలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా వేలు పెడుతోన్న ప‌రిస్థితి ఉందంటున్నారు. అధిష్టానం సైతం ఈ విష‌యంలో చూసి చూడ‌న‌ట్టు ఉండ‌డంతోనే ఇటీవ‌ల క‌న్నబాబు సైతం కాస్త అస‌హ‌నంతో ఉన్నట్టు తెలుస్తోంది. అధికారుల విష‌యంలోనూ క‌న్నబాబు ఇటీవ‌ల గుస్సాతో ఉన్నట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా పైన సీఎం మావాడు అని ఫీల‌వుతోన్న చాలా మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఇలా పెత్తనం చెలాయిస్తుండ‌డంతో పాటు తాము మైనార్టీగా ఉన్న చోట కూడా తాము చెప్పిందే వేదం అన్న ధోర‌ణితో ఉండ‌డంతో మిగిలిన వ‌ర్గ ఎమ్మెల్యేల్లో అస‌హ‌నం పెరుగుతోంది. వైసీపీలో ఈ ప‌రిస్థితి మార‌క‌పోతే జ‌గ‌న్ కూడా బాబులాగా కుల కోట‌రీ విమ‌ర్శలు ఎదుర్కోక త‌ప్పదు.

Tags:    

Similar News