ఇక కన్నబాబుకు తిరుగులేనట్లేనా..?

జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రుల్లో కన్నబాబు కూడా ఒకరు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కన్నబాబు, తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళుతూ అందరినీ మెప్పిస్తున్నారు. ఇలా [more]

Update: 2021-06-11 15:30 GMT

జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రుల్లో కన్నబాబు కూడా ఒకరు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కన్నబాబు, తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళుతూ అందరినీ మెప్పిస్తున్నారు. ఇలా కేబినెట్‌లో సత్తా చాటుతున్న కన్నబాబుకు సొంత నియోజకవర్గంలో కూడా తిరుగులేదు. కాకినాడ రూరల్‌లో కన్నబాబు బాగా స్ట్రాంగ్‌గా అయిపోయారు. కాకినాడ రూర‌ల్లో క‌న్నబాబుకు పార్టీల‌తో సంబంధం లేకుండా 40 వేల సొంత ఓటు బ్యాంక్ ఉంది. క‌న్నబాబు ఏ పార్టీలో ఉన్నా.. ఏ పార్టీలో లేక‌పోయినా ఈ ఓటు బ్యాంకు క‌న్నబాబు సొంతం. పైగా సొంత సామాజిక వ‌ర్గంలో క‌న్నబాబు ఓ ఐకాన్ గా మారిపోయాడు. జ‌ర్నలిస్టుగా ఉన్న క‌న్నబాబు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.

వ్యవసాయ శాఖ మంత్రిగా..?

తర్వాత ప్రజారాజ్యం, కాంగ్రెస్‌లో మెర్జ్ అవ్వడంతో, కొన్నిరోజులు కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పని క్లోజ్ అవ్వడంతో 2014 ఎన్నికల్లో కన్నబాబు కాకినాడ రూరల్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి బాగానే ఓట్లు తెచ్చుకున్నారు. ఆ ఎన్నిక‌ల్లో క‌న్నబాబుకు ఇండిపెండెంట్‌గానే 44 వేల ఓట్లు వ‌చ్చాయి. అది క‌న్నబాబు స్టామినా. ఇక 2016లో వైసీపీలోకి వచ్చేసి, 2019 ఎన్నికల్లో రూరల్ బరిలో మరోసారి నిలిచి విజయం సాధించారు. క‌న్నబాబు పార్టీలోకి వ‌చ్చీ రావ‌డంతోనే జ‌గ‌న్ ఆయ‌న‌కు జిల్లా పార్టీ ప‌గ్గాలు ఇచ్చారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన వెంట‌నే జగన్ కేబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు.

మంచి పనితీరును…..

ఓ వైపు మంత్రిగా మంచి పనితీరు కనబరుస్తున్న కన్నబాబు, ఎమ్మెల్యేగా కూడా మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. అటు ప్రభుత్వ పథకాలు బాగా ప్లస్ అవుతున్నాయి. అయితే కన్నబాబుకు నియోజకవర్గంలో పెద్ద పోటీ లేదు. ప్రస్తుతం నియోజకవర్గంలో టీడీపీ బాగా వీక్‌గా ఉంది. ఇక్కడ పిల్లి ఫ్యామిలీ పార్టీలో పెద్దగా పనిచేయడం లేదు. 2014లో టీడీపీ తరుపున గెలిచిన పిల్లి అనంత లక్ష్మీ, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పార్టీలో ప్రాధాన్యత లేద‌న్న ఆవేద‌న‌తో ఇటీవల పదవులకు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి.. ఆమె భర్త సత్యనారాయణ మూర్తి (సత్తిబాబు)లు రాజీనామా చేశారు. అనంత లక్ష్మి కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పదవికి గుడ్ బై చెప్పారు.

ఎన్నారైని బరిలోకి దించేందుకు…?

పదవులకు రాజీనామా చేసినా.. పార్టీలో కొనసాగుతామని చెప్పారు. ఇలా పిల్లి ఫ్యామిలీ సైడ్ అవ్వడంతో నియోజకవర్గంలో టీడీపీ మరింత వీక్ అయింది. పిల్లి దంప‌తుల‌కు ముగ్గురు వార‌సులు ఉన్నా రాజ‌కీయంగా వార స‌మ‌ర్థులు కాదు.. అస‌లు క‌న్నబాబుకు ఎంత మాత్రం పోటీయే కాదు. దీంతో చంద్రబాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి ఎన్నారైల‌ను బ‌రిలోకి దించేందుకు రెడీ అవుతున్నారు. అటు జనసేన తరుపున పంతం నానాజీ ఉన్నారు. కానీ ఇక్కడ జనసేనకు పూర్తి స్థాయిలో బలం లేదు. మొత్తానికి చూసుకుంటే కాకినాడలో కన్నబాబుకు తిరుగులేని పరిస్థితి ప్రస్తుతానికి ఉంది.

Tags:    

Similar News