బీజేపీ కన్నా ఆ పార్టీనే నయమా కన్నా…?

కన్నా లక్ష్మీ నారాయణ. రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి ఆయన గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలుమార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన [more]

Update: 2021-04-17 15:30 GMT

కన్నా లక్ష్మీ నారాయణ. రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి ఆయన గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలుమార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీ నారయణ పేరు ఒక దశలో ముఖ్యమంత్రి పదవికి కూడా వినిపించింది. అలాగే పీసీసీ చీఫ్ రేసులో కూడా ఆయన ఉన్నారని అప్పట్లో టాక్ వచ్చింది. మొత్తానికి ఏపీలో కాంగ్రెస్ తాను పూర్తిగా చెడి కన్నా లక్ష్మీ నారాయణ లాంటి సీనియర్ నాయకులను ఎటూ కాకుండా చేసిపారేసింది.

అక్కడ జస్ట్ మిస్…..

ఇక కన్నా లక్ష్మీ నారాయణ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినపుడు మొదట కాలు పెట్టాల్సింది తెలుగుదేశం పార్టీలోకే. కానీ అక్కడ తన కంటే ముందు తన జిల్లాకు చెందిన ప్రత్యర్ధి రాయపాటి సాంబశివరావు చేరిపోవడంతో కన్నా లక్ష్మీ నారాయణ మరో మాట లేకుండా బీజేపీ బాట పట్టారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే వైసీపీ నుంచి ఇన్విటేషన్ ఉన్నా ఎందుకో కన్నా లక్ష్మీ నారాయణ ఆ దారి పట్టలేదు. అయితే 2019 ఎన్నికల ముందు మాత్రం వైసీపీలోకే చేరిపోదామని అనుకున్నారు. కానీ బీజేపీ వేసిన బిగ్ బిస్కెట్ తో ఆయన కాషాయ బుట్టలో పడ్డారు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పదవి అంటే చాలా పెద్దది అని భావించారు. కేంద్రంలో మోడీ సర్కార్ ఉంటుంది కాబట్టి వేరే ఏదైనా అధికారిక పదవులు దక్కుతాయని కూడా అంచనా వేసుకున్నారు. కానీ చివరికి మిగిలిందేంటి అంటే మాజీ ప్రెసిడెంట్ అన్న ట్యాగ్ మాత్రమే.

ఆశలు లేవు …..

తనను పార్టీ పదవి నుంచి తప్పించేశాక కన్నా లక్ష్మీ నారాయణ కమలం పార్టీతో అంతలా రాసుకుపూసుకుని తిరగడంలేదు. ఏదో మొక్కుబడి సమావేశాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇక తాజాగా సోము వీర్రాజు చేసిన ఒక ప్రకటనతో కన్నాకు బీజేపీ మీద మోజు పూర్తిగా తీరిపోయింది అంటున్నారు. తాను సీనియర్ మోస్ట్ నేతగా బీజేపీలో ఉంటే తమ పార్టీలో ఎవరూ సీఎం అభ్యర్ధులు లేనట్లుగా జనసేన అధినేత పవన్ని సీఎం గా ప్రకటించడం తో కన్నా లక్ష్మీ నారాయణ ఇక బీజేపీలో ఉండి లాభమేంటని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అటు బీజేపీ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా రాజ్యసభ సభ్యత్వం లేదు. ఏపీ వరకూ చూస్తే ఎక్కడా గెలిచే సీన్ కూడా లేదు. దాంతో పార్టీ మారాలని కన్నా గట్టిగానే డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

పవన్ పక్కనేనా …?

కన్నా లక్ష్మీ నారాయణకు పవన్ కళ్యాణ్ తో మంచి రిలేషన్ ఉంది. ఆయన బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నపుడే జనసేనతో పొత్తు కుదిరింది. దాంతో కన్నా తన తదుపరి రాజకీయాన్ని జనసేన ద్వారా కొనసాగించాలనుకుంటున్నట్లుగా ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. ఏపీలో టీడీపీ పరిస్థితి ఏమీ బాగులేదు, వైసీపీలోకి వెళ్తానని చెప్పి వారికి హ్యాండ్ ఇచ్చేశారు. ఇక మిగిలింది చూస్తే జనసేన మాత్రమేనని కన్నా లక్ష్మీ నారాయణ నమ్ముతున్నారుట. దాంతో కన్నా సాధ్యమైనంత తొందరలోనే బీజేపీకి గుడ్ బై చెబుతారు అన్న టాక్ అయితే బాగానే సౌండ్ చేస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News