కాపులు చాయిస్ ఈసారి ఎటువైపు ?

విభజన ఏపీలో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపులు మరోమారు కీలకం కానున్నారా. మూడేళ్ళ తరువాత జరగనున్న ఎన్నికల్లో వారే చక్రం తిప్పనున్నారా అంటే సమాధానం [more]

Update: 2021-06-12 12:30 GMT

విభజన ఏపీలో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపులు మరోమారు కీలకం కానున్నారా. మూడేళ్ళ తరువాత జరగనున్న ఎన్నికల్లో వారే చక్రం తిప్పనున్నారా అంటే సమాధానం అవును అనే వస్తోంది. ఉమ్మడి ఏపీ రెండు అయ్యాక పదమూడు జిల్లాల రాష్ట్రంలో కాపులే పెద్ద జనాభాగా ఉన్నారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో మూడవ వంతు కాపులు ప్రభావం చేయగలరు అన్న చర్చ ఉంది. ఇక ఉభయగోదావరి జిల్లాలోనే ముప్పయి దాకా సీట్లు ఉన్నాయి. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో తెలుగుదేశానికి, 2019 ఎన్నికలలో వైసీపీని మద్దతు ఇచ్చిన కాపులు వచ్చే ఎన్నికల్లో ఏ రూట్ కు టర్న్ అవుతారు అన్నదే ప్రశ్నగా ఉంది.

ఇద్దరి మీద గుస్సా …?

చంద్రబాబు కాపులను బీసీలలో చేరుస్తామని చెప్పి వంచించారు. ఆయన చేతిలో లేని దాన్ని హామీగా ఇచ్చి అధికారం అందుకున్నారు. కానీ కాపులకు మాత్రం ఆయన అన్యాయం చేశాడు అన్న ఆక్రోశం ఉంది. అది చివరికి 2019 ఎన్నికల నాటికి వైసీపీకి వరంగా మారింది. అయితే వైసీపీ కాపులకు ఈ హామీ ఇవ్వలేదు, పైగా తమ వల్ల కాదు అంది. కానీ దానికి బదులుగా ఏటా రెండు వేల కోట్ల నిధులు కాపుల అభివృద్ధికి కేటాయిస్తామని భారీ హామీ జగన్ ఇచ్చారు. అలా అయిదేళ్ళలో పదివేల కోట్లు ఇస్తామని కూడా ఆయన చెప్పారు. ఇప్పటికి రెండేళ్ళ పాలన పూర్తి చేసుకుని మూడవ ఏట అడుగు పెట్టిన వైసీపీ కాపులకు నాలుగు వేల కోట్లు బాకీ పడిదని ఆ సామాజికవర్గం మండిపడుతోంది.

మొదలైన సెగ ..?

కాపుల సెగ ఏంటో చంద్రబాబు స్వయంగా చవిచూశారు. ఇపుదు రెండేళ్ల తరువాత మెల్లగా జగన్ కి ఆ సెగ తగులుతోంది అంటున్నారు. కాపు యువత సోషల్ మీడియాలో అయితే జగన్ సర్కార్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. కాపు కార్పోరేషన్ పెట్టారు కానీ లాభం ఏంటి. ఎవరికి రుణాలు ఇస్తున్నారు. ఎవరికి ఆర్ధిక ఆసరా లభిస్తోంది అంటూ వారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాపు కార్పోరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా మీద కూడా వారు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఏమీ చేయలేని వారికి పదవులు ఎందుకు అంటూ మండిపడుతున్నారు. కాపులకు తక్షణం నాలుగు వేల కోట్లు రిలీజ్ చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

పవన్ రూటేనా…?

అటు తెలుగుదేశాన్ని, ఇటు వైసీపీని చూసిన కాపులు ఈసారి జనసేన కొమ్ము కాస్తారా అన్న మాట కూడా ఉందిపుడు. పైగా కాపులు గత రెండు ఎన్నికల్లో పోలరైజ్ కాలేదు. ఈసారి మాత్రం సంఘటితం కావాలి అనుకుంటున్నారుట. రెండు పార్టీలనూ చూశాం, ఈసారి తమ కులం నాయకుడి పార్టీకి మద్దతు ఇస్తే తప్పేంటి అన్న చర్చ అయితే యువతలో మెల్లగా వస్తోందిట. అయితే మధ్య వయసు వారు, పెద్దలు మాత్రం ఇంకా డోలాయమానంలో ఉన్నారు. ఏది ఏమైనా జగన్ సంక్షేమ పధకాలను నేరుగా లబ్దిదారుల ఖాతాలో వేస్తూ కుల కార్పోరేషన్లను ఉత్సవ‌ విగ్రహాలుగా మార్చేశారు అన్న విమర్శ అయితే ఉంది. అది కేవలం కాపులకే కాదు బ్రాహ్మణ కార్పోరేషన్ తీరు కూడా అలాగే ఉంది. మొత్తం మీద చూసుకుంటే కాపులు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే గోదావరి జిల్లాల రాజకీయం మారిపోతుంది అంటున్నారు. అయితే జగన్ బీసీల జపం చేస్తున్నందువల్ల కాపులు సైడ్ అయినా వారు అండగా ఉంటారు కాబట్టి ఒడ్డున పడిపోవచ్చు అన్న పొలిటికల్ లెక్కలేవో వైసీపీ పెద్దలకు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి కాపులు జగన్ని నమ్మడం లేదని విపక్షం అంటూంటే జగన్ కూడా వారి మీదనే పూర్తిగా ఆధారపడకుండా కొత్త రాజకీయాలు చేస్తున్నారు అన్న మాట ఉంది.

Tags:    

Similar News