కాపులు ఎవ‌రి ప‌క్షం..ఈ పోరులో వీరే కీల‌కం..!

తూర్పు గోదావ‌రి జిల్లాలో కాపు సామాజిక‌వ‌ర్గం ఇప్పుడు ఎవ‌రి ప‌క్షాన ఉంది ? ఎవ‌రికి మొగ్గు చూపుతోంది ? గ‌్రామీణ ప్రాంతాల్లో ఎన్నిక‌ల‌కు న‌గారా మోగిన నేప‌థ్యంలో [more]

Update: 2021-02-03 13:30 GMT

తూర్పు గోదావ‌రి జిల్లాలో కాపు సామాజిక‌వ‌ర్గం ఇప్పుడు ఎవ‌రి ప‌క్షాన ఉంది ? ఎవ‌రికి మొగ్గు చూపుతోంది ? గ‌్రామీణ ప్రాంతాల్లో ఎన్నిక‌ల‌కు న‌గారా మోగిన నేప‌థ్యంలో తూర్పులో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంగా ఉన్న కాపులు ఏ పార్టీకి ప్రాధాన్యం ఇవ్వనున్నారు? అనే అంశాలు ప్రధానంగా చ‌ర్చకు వ‌స్తున్నాయి. వాస్తవానికి పంచాయ‌తీ ఎన్నిక‌లు పార్టీ గుర్తుల‌పై జ‌ర‌గ‌క‌పోయినా.. నేరుగా పార్టీ ప్రభావం మాత్రం ఎక్కువ‌గా ఉంటుంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ సానుకూల అభ్యర్థులు గ్రామ పంచాయ‌తీల్లో క్లీన్ స్వీప్ చేశారు. ఇది త‌ర్వాత జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్రబావం చూపించింది. 2014 ఎన్నిక‌ల‌కు ముందు ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జ‌రిగిన పంచాయతీ ఎన్నిక‌లు, జ‌డ్పీటీసీలు, మండ‌ల ఎన్నిక‌లు టీడీపీ స్వీప్ చేసేసింది.

అప్పుడు ఆ హామీతో…

అప్పట్లో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు ముందు చంద్రబాబు చేసిన వ‌స్తున్నా మీకోసం క‌లిసి వ‌చ్చింద‌ని అంటారు. ఈ క్రమంలో కాపుల రిజ‌ర్వేష‌న్‌కు కట్టుబ‌డి ఉన్నామన్న చంద్రబాబు పిలుపు కూడా అప్పట్లో వర్క‌వుట్ అయింది. అయితే త‌ర్వాత ప‌రిణామాలు మారాయి. మొత్తం 62 మండ‌లాలు ఉన్న తూర్పు గోదావ‌రిలో 1069 గ్రామ పంచాయ‌తీలు ఉన్నాయి. 2013 ఎన్నిక‌ల్లో టీడీపీ బ‌ల‌ప‌రిచిన‌ అభ్యర్థులు గుండుగుత్తుగా గెలుపు గుర్రం ఎక్కారు. ఇటు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో 48 మండ‌లాల‌కు మూడు జ‌డ్పీటీసీలు మిన‌హా అన్ని చోట్లా టీడీపీ విజ‌యం సాధించింది అంటే ఆ పార్టీ ప్రభంజ‌నం ఇక్కడ ఏ రేంజ్‌లో కొన‌సాగిందో అర్థ‌మ‌వుతోంది.

టీడీపీని నమ్మరా?

ఇక అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండు జిల్లాల్లో ఉన్న ఐదు ఎంపీ సీట్లతో పాటు ప‌శ్చిమ‌లో 15కు 15 సీట్లు ( ఒక‌టి బీజేపీతో) స్వీప్ చేసేసింది. అటు తూర్పులో ఐదు సీట్లు మిన‌హా అన్ని చోట్లా సైకిల్ దూసుకుపోయింది. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అప్పట్లో కాపుల్లో సానుభూతి ఉంది. టీడీపీ త‌మ‌కు న్యాయం చేస్తుంద‌ని కాపులు భావించారు. అయితే పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని కాపులు నిర్ణయానికి వ‌చ్చారు. చంద్రబాబు కాపు కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి ఎంతో మంది కాపుల‌కు ల‌బ్ధి క‌లిగేలా చేశారు. అయినా కాపులు టీడీపీని ఏ మాత్రం న‌మ్మలేదు.

వ్యూహాల అమలులో…?

ఈ క్రమంలోనే గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతినింది. మ‌రీ ఘోరం ఏంటంటే గోదావ‌రి జిల్లాల్లో కాపుల ఓట్లు కొల్లగొట్టడంలో ట్రయాంగిల్ ఫైట్‌లో టీడీపీ మూడో స్థానానికి ప‌డిపోయింది. జ‌న‌సేన దెబ్బతో టీడీపీ చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో మూడో స్థానంతో స‌రిపెట్టుకుంది కూడా. ఇక‌, అప్పటి నుంచి కూడా పార్టీ పుంజుకునేందుకు అవ‌స‌ర‌మైన వ్యూహాలు వేయ‌డంలో ఈ రెండు జిల్లాల‌ నాయ‌కులు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. కీల‌క‌మైన నాయ‌కుల‌పై వ్యతిరేక‌త ఉన్నప్పటికీ వారినే చంద్రబాబు కొన‌సాగిస్తుండ‌డం.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వారు పార్టీకి దూరంగా ఉండ‌డం, కాపుల‌కు ప్రాతినిధ్యం వ‌హించే టీడీపీ నాయ‌కుడు ఎవ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డం వంటి ప్రధాన కార‌ణ‌లు ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను ప్రభావితం చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News