కధ ముగిసిపోయినట్లేనా…?

తెలుగుదేశం పార్టీలో కాపులు రగిలిపోతున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. కాపులను దగ్గర చేర్చుకుని 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం వారి ప్రధాన డిమాండ్ బీసీల్లో [more]

Update: 2019-09-02 09:30 GMT

తెలుగుదేశం పార్టీలో కాపులు రగిలిపోతున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. కాపులను దగ్గర చేర్చుకుని 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం వారి ప్రధాన డిమాండ్ బీసీల్లో కలపడంలో విఫలమైంది. దాంతో తాజా ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక అధికారంలో ఉన్నపుడు కూడా తమకు విధేయులుగా ఉన్న కాపులనే చేరదీసి రాజకీయ పబ్బం తెలుగుదేశం పార్టీ గడుపుకుందన్న ఆవేదన ఆ వర్గంలో ఉంది. దాంతో మిగిలిన వారు సైతం అప్పట్లోనే అసంతృప్తిలో ఉండేవారు. తీరా అధికారం పోయాక ఇపుడు వారు పెద్ద నోర్లు చేస్తున్నారు. ఇప్పటికి మూడు విడతలుగా తెలుగుదేశం పార్టీలోని కాపులు సమావేశాలు నిర్వహించి అధినాయకత్వం మీద తమ ఆగ్రహాన్ని బాహాటంగానే వెళ్ళగక్కారు. తాజాగా విశాఖలో మరోమారు కాపు నేతలు రహస్యంగా సమావేశమైన వార్తతో తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోందన్న ప్రశ్న ముందుకువచ్చింది.

తేల్చుకోలేకనేనా….

తాజా సమావేశానికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల రాజా హాజరుకావడం విశేషం. ఆయనతో పాటు గోదావరి జిల్లాలకు చెందిన తోట త్రిమూర్తులు, ఇతర నాయకులు కూడా హాజరయ్యారు. ఇక బీజేపీలో చేరుతారని ప్రచారంలో ఉన్న విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు కూడా ఈ మీటింగులో పాల్గొన్నట్లుగా చెబుతున్నారు. ఈ మీటింగ్ సారాంశం ఇదమిద్దంగా తెలియకపోయినా కాపులు తమ ఉనికిని రాజకీయంగా చాటుకోవాలంటే ఏం చేయాలన్న దాని మీదనే చర్చ సాగినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఉంటే భవిష్యత్తు లేదని నిర్దారణకు వచ్చిన వారికి ఏ పార్టీలో చేరాలన్న దాని మీద మాత్రం ఇంకా ఏకాభిప్రాయం కుదరడంలేదని అంటున్నారు.

వైసీపీ మీదా లేదా…?

మరో వైపు వైసీపీ మీద కూడా తెలుగుదేశం పార్టీ కాపులకు అంత ఉత్సాహం కనిపించడంలేదు. ఆ పార్టీ విధానాలు కూడా చూశామని, కాపుల విషయంలో జగన్ చెప్పాల్సింది చెప్పేశారని, ఇక ఆయన్నించి పెద్దగా ఆశించేది ఏదీ లేదని కూడా అంటున్నారు. మరో వైపు బీజేపీలో చేరేందుకు కూడా సంశయిస్తున్న వారు కూడా ఉన్నారు. ఆ పార్టీకి ఏపీలో పునాది లేదు, ఇపుడు కేంద్రంలో అధికారంలో ఉన్నా స్థానికంగా బలం లేని పార్టీలో ఉన్నా లేకున్నా ఒకటేనన్న భావన కూడా కాపులలో ఉందంటున్నారు. ఇపుడే ఎన్నికలు ముగిసిన వేళ పొలిటికల్ పోలరైజేషన్ కి కూడా చాలా సమయం పడుతుందని తలపండిన నేతలు అంటున్నారు. రానున్న రోజులను బట్టి వాటి పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకోవాల్సిందేనని మెజారిటీ కాపు నాయకుల అభిప్రాయంగా ఉంది. కాగా ఈ సమావేశం మామూలుగా పెట్టుకున్నదేనని విశేషాలు ఏవీ లేవని తోట త్రిమూర్తులు మీడియా ముందు తేల్చేశారు. కానీ రాజకీయ సమాలోచనలకే తెలుగుదేశం పార్టీ కాపులంతా ఒక్క చోట చేరారని అంటున్నారు.

Tags:    

Similar News