ఇద్దరూ ఒకటైతే సులువే… కానీ జరుగుతుందా?

చీరాల రాజకీయం మరోసారి వేడెక్కింది. అధికార వైసీపీలో వర్గ విభేదాలు పార్టీ కొంపముంచేట్లున్నాయి. చీరాల వైసీపీలో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. [more]

Update: 2021-03-08 12:30 GMT

చీరాల రాజకీయం మరోసారి వేడెక్కింది. అధికార వైసీపీలో వర్గ విభేదాలు పార్టీ కొంపముంచేట్లున్నాయి. చీరాల వైసీపీలో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే చీరాల మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరూ సమన్వయంతో ముందుకెళితే అక్కడ టీడీపీకి చోటు లేనట్లే. ఈ దిశగా అధిష్టానం ప్రయత్నాలను ప్రారంభించింది. రెండువర్గాలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది.

ఏడాది క్రితం నామినేషన్లు…

చీరాల మున్సిపాలిటీ ప్రతిష్టాత్మకం. అసెంబ్లీ ఎన్నికలలోనూ ఇక్కడ పట్టు ఉంటే తప్ప ఎవరూ గెలవలేరు. అందుకే చీరాల మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఏడాది క్రితం చీరాల మున్సిపాలిటీకి నామినేషన్లు దాఖలు చేశారు. ఏడాది ముందు కావడంతో అప్పడు ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీలోనే ఉన్నారు. దీంతో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అనంతరం కరణం బలరాం వైసీపీకి మద్దతుదారుగా మారారు.

బలరాం వర్గీయులు….

కరణం బలరాం వెంట నామినేషన్లు వేసిన వారు కూడా వైసీపీలో చేరిపోయారు. మరోవైపు అప్పట్లో ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరుల చేత నామినేషన్లు వేశారు. ఆమంచి, కరణం బలరాం ఒక అవగాహనకు వస్తే సులువుగా చీరాల మున్సిపాలిటీని కైవసం చేసుకునే వీలుంది. ఇక్కడ టీడీపీకి అభ్యర్థులు కూడా ఉండని పరిస్థితి. దీంతో వైసీపీ అధిష్టానం చీరాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. చెరి సంగం సీట్లను పంచేలా ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరేలా ప్రయత్నాలు ప్రారంభించింది.

టీడీపీ చేతులెత్తేసినట్లే…..

కానీ ఆమంచి కృష్ణమోహన్ పట్టుదలగా ఉన్నారు. చీరాలపై తన పట్టు కోల్పోవడం ఇష్టం లేని ఆయన అధిష్టానం ప్రతిపాదనకు ససేమిరా అంటున్నారు. కరణం బలరాం వర్గీయులు కేవలం పదహారు వార్డుల్లోనే పోటీలో ఉన్నారు. వారి చేత నామినేషన్లు ఉపసంహరించాలని ఆమంచి వత్తిడి తెస్తున్నారు. మొత్తం 35 వార్డుల్లోనూ ఆమంచి వర్గీయులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఇక్కడ దాదాపుగా చేతులెత్తేసినట్లే. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Tags:    

Similar News