అంతా వారిదే భారం

ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ఏదో ఒక అలజడితోనే గడుపుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా కన్నా పార్టీనేతగానే ఎక్కువగా కన్పిస్తున్నారు. వరదలు, ఉప ఎన్నికలు వరసగా [more]

Update: 2019-12-24 18:29 GMT

ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ఏదో ఒక అలజడితోనే గడుపుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా కన్నా పార్టీనేతగానే ఎక్కువగా కన్పిస్తున్నారు. వరదలు, ఉప ఎన్నికలు వరసగా రావడంతో ఆయన ప్రజలకు హామీలు ఇవ్వడంతోనే ఎక్కువవ కాలం గడిపేశారు. తాజాగా కన్నడనాట పౌరసత్వ చట్ట సవరణ రగడతో శాంతిభద్రతలను అదుపులో పెట్టాల్సిన పరిస్థితి. ఇవన్నీ అటు పక్కన పెడితే యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడనేది ఇంకా క్లారిటీ రాలేదు.

విస్తరణ కోసం ఎదురు చూపులు…

మంత్రి వర్గ విస్తరణ కోసం ఇప్పటికే ఆశావహులు ఎదురు చూపులు చూస్తున్నారు. కానీ యడ్యూరప్ప మాత్రం ఢిల్లీ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. అధిష్టానం వద్ద యడ్యూరప్ప తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముందుగా అనర్హత వేటు పడి తిరిగి ఉప ఎన్నికల్లో గెలిచిన వారికి మంత్రి పదవులు ఇస్తానని యడ్యూరప్ప హామీ ఇచ్చారు. ముందుగా ఆ హామీని నిలబెట్టుకోవాల్సి ఉంది. లేకుంటే తనపై విశ్వాసం సన్నగిల్లుతుంది.

అందరికీ ఇస్తే…..

అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల్లో మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో 11 మంది విజయం సాధించారు. యడ్యూరప్ప అయితే వీరందరికీ మంత్రి పదవులు ఇస్తామని చెప్పారు. ఈ విషయంపై అధిష్టానం ఆమోద ముద్ర యడ్యూరప్ప వేయించుకోవాల్సి ఉంది. వీరందరికీ మంత్రి పదవులు ఇస్తే మరో ఐదు మంత్రి పదవులు మాత్రమే ఖాళీ ఉంటాయి. ఇందులో సీనియర్లు, పార్టీ కోసం తొలి నుంచి కష్టపడిన వారికి ఇవ్వాలన్నది యడ్యూరప్ప ఆలోచన. మరి సీనియర్లు చాలా మందే ఉన్నారు.

కేంద్ర నాయకత్వంతోనే…..

కేవలం ఐదుగురితో సరిపెడితే సీనియర్లు ఊరుకుంటారా? అన్నది కూడా సందేహమే. అందుకే పార్టీ కేంద్ర నాయకత్వం చేతనే యడ్యూరప్ప అన్నీ చెప్పించాల్సి ఉంది. తనంతట తాను నిర్ణయం తీసుకుంటే తిరిగి అసంతృప్తి చెలరేగే అవకాశముంది. దీనికి తోడు అనర్హత వేటు పడి ఓటమి పాలయిన హెచ్ విశ్వనాధ్, ఎంబీటీ నాగరాజులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్న యోచనలో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి అవి ఖాళీలేవు. వారిని ఎక్కడ సర్దుబాటు చేయాలన్నా సమస్యే. మొత్తం మీద యడ్యూరప్ప నిదానంగానైనా కేంద్ర నాయకత్వంపైనే భారం మోపి, విస్తరణ అనంతరం అసంతృప్తి లేకుండా చూసుకోవాలనుకుంటున్నారు.

Tags:    

Similar News