లైట్ గా తీసుకున్నారా? కావాలనేనా?

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. సంకీర్ణ సర్కార్ లోని కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలకు పూనుకోవడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమయింది. పన్నెండు మంది ఎమ్మెల్యేలు [more]

Update: 2019-07-06 17:30 GMT

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. సంకీర్ణ సర్కార్ లోని కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలకు పూనుకోవడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమయింది. పన్నెండు మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి వెళ్లి రాజీనామాలు సమర్పించారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో నేరుగా గవర్నర్ వాజుభాయ్ ను కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. స్పీకర్ రాజీనామాలను ఆమోదించకపోయినా గవర్నర్ నిర్ణయం తమకు అనుకూలంగా ఉంటుందని రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.

రెండు రోజుల క్రితమే…..

కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ శాసనసభ్యులు ఆనంద్ సింగ్, రమేష్ జార్ఖిహోళి లు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ లైట్ గా తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. తొలి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యవహారశైలిపై గుర్రుగానే ఉన్నారు. కాంగ్రెస్ కు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చినా తమ అభిప్రాయం తీసుకోకుండా కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి అప్పగించడంపై వారు తొలి నుంచి అసంతృప్తిగా ఉన్నారు.

బలమున్న నేతలను….

కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీలో సీనియర్ నేతలను, బలం, బలగమున్న నేతలను పక్కనపెట్టి మంత్రి వర్గంలో చోటు కల్పించింది. అందుకే సంకీర్ణ సర్కార్ ఏర్పడిన నాటి నుంచే అసమ్మతి సెగలు బయలుదేరాయి. అయితే వీటిని చల్లార్చేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు ఎఫ్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కన్పించలేదు. దీనికి తోడు లోక్ సభ ఎన్నికల్లోనూ జేడీఎస్, కాంగ్రెస్ లు కలసి పోటీ చేయడం, దారుణ ఓటమిని చవిచూడటంతో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు సొంత పార్టీపైనే అసమ్మతి వెళ్లగక్కుతున్నారు.

వాజూభాయ్ నిర్ణయంపైనే…..

దాని ఫలితమే శనివారం చోటు చేసుకున్న పరిణామాలు. ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపులు ప్రారంభించినా వారి డిమాండ్లకు తలొగ్గే పరిస్థితి లేదు. ఫలితంగా కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సర్కార్ కుప్పకూలిపోయే ప్రమాదం ఏర్పడింది. సిద్ధరామయ్య లైట్ గా తీసుకున్నందునే ఈ పరిణామాలు జరిగాయన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి. గవర్నర్ వాజూభాయ్ పటేల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.

Tags:    

Similar News