కొత్త గుప్పిట్లోకి కాశ్మీర్
జమ్మూ కాశ్మీర్… ఈ కీలక సరిహద్దు ప్రాంతంలో ఇప్పటి వరకూ జరిగింది లేదు. ఇక నుంచి జరగబోతోంది లేదు. రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా నెలకొన్న పరిస్థితులు వేరు. [more]
జమ్మూ కాశ్మీర్… ఈ కీలక సరిహద్దు ప్రాంతంలో ఇప్పటి వరకూ జరిగింది లేదు. ఇక నుంచి జరగబోతోంది లేదు. రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా నెలకొన్న పరిస్థితులు వేరు. [more]
జమ్మూ కాశ్మీర్… ఈ కీలక సరిహద్దు ప్రాంతంలో ఇప్పటి వరకూ జరిగింది లేదు. ఇక నుంచి జరగబోతోంది లేదు. రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా నెలకొన్న పరిస్థితులు వేరు. ఇప్పుడు వేరు. కాశ్మీర్ గురించి రెండు తరాలకు తెలిసింది ఒక కోణం మాత్రమే. కొత్త తరం తెలుసుకోబోతోంది కొత్త కోణం. స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ, 35 ఎ అధికరణ రద్దు రెండూ కేంద్ర పాలిత ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించడంతో కాశ్మీర్ లో కొత్త చరిత్ర ప్రారంభం కాబోతోంది. కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ కాశ్మీర్, జమ్మూ, లడఖ్ ముఖ చిత్రమే మారనుంది. అధికరణల రద్దుతో ఇప్పటి వరకూ ఉన్న స్వయం ప్రతిపత్తి రద్దవుతుంది. సాధారణ రాష్ట్రంగా మిగిలిపోతుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలు ఎలా ఉంటాయో కాశ్మీర్ కూడా అలాగే ఉంటుంది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ పేరుతో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి. అంటే ఇక్కడ వ్యవహారాలు పూర్తిగా కేంద్రం చేతిలో ఉంటాయి. లడఖ్ పూర్తి కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతుంది. జమ్మూకాశ్మీర్ కు శాసనసభ ఉంటుంది. ముఖ్యమంత్రి ఉంటారు. కానీ పరిమిత అధికారాలే ఉంటాయి. అపరమిత అధికారాలు కేంద్రానికే దఖలు పడతాయి. దేశరాజధాని ఢిల్లీ నగరం, దక్షిణాదిన గల పుదుచ్చేరి రాష్ట్రాల మాదిరిగానే జమ్మూ కాశ్మీర్ ఉండబోతోంది. ఈ రాష్ట్రాలే అయినప్పటికీ పరిమిత అధికారాలుంటాయి. ఎన్నికైన ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యవహారాలను పెద్దగా ప్రభావితం చేయలేరు. కేంద్రం కనుసన్నల్లోనే మెలగాల్సి ఉంటుంది.
కేంద్రం చేతిలోనే….
ఇక నుంచి జమ్మూ కాశ్మీర్ కు ఎలాంటి ప్రత్యేక అధికారాలుండవు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో ఇక్కడ కూడా అవే నిబంధనలు అమలవుతాయి. రాష‌్ట్ర ప్రజలకు ద్వంద పౌరసత్వం ఉండదు. ఏక పౌరసత్వమే ఉంటుంది. కాశ్మీరీ యువత ఇతర రాష్ట్రం, దేశం అబ్బాయిని వివాహం చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ ఆస్తులు, భూములు కొనుగోలు చేయవచ్చు. స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. విద్యా హక్కు చట్ట ప్రకారవం ఉచిత నిర్బంధ విద్య అమలవుతుంది. మైనారిటీలకు 16 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. రాష్ట్ర అసెంబ్లీ గతంలో మాదిరిగా ఆరేళ్లు ఉండదు. అన్ని రాష్ట్రాల మాదిరిగా ఐదేళ్లే. రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఉండదు. భారత జాతీయ పతాకం ఉంటుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే 360 అధికరణ, కీలకమైన సమాచార హక్కు చట్టం వర్తిస్తాయి. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వంలో జరిగే అవినీతి అక్రమాలను వెలికితీయవచ్చు. పంచాయతీలకు అన్ని హక్కలూ ఉంటాయి. తద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ బలపడి పంచాయతీలు, బ్లాక్ లు, జిల్లాల్లో ప్రజలకు మెరుగైన సేవలందుతాయి. అభివృద్ధి చెందుతాయి.
నియోజకవర్గాలు తగ్గినా….
జమ్మూ,కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు కలసి ఇప్పటి వరకూ రాష్ట్ర అసెంబ్లీ లో 87 స్థానాలున్నాయి. లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంతో ఆ ప్రాంతంలో ఉన్న నాలుగు స్థానాలు తగ్గుతాయి. 83 స్థానాలే మిగులుతాయి. ఇప్పటి వరకూ ఆరు లోక్ సభ స్థానాలు (శ్రీనగర్, అనంత్ నాగ్, బారాముల్లా, జమ్మూ, ఉత్తమ్ పూర్, లడఖ్ ) ఐదుకు తగ్గుతాయి. లడఖ‌్ విడిపోతుంది. కాశ్మీర్ లోయలో మూడు, జమ్మూలో రెండు లోక్ సభ స్థానాలుంటాయి. ఒకచోట ముస్లింలు, మరొకచోట హిందువులది పైచేయి.
రిజర్వేషన్లు కల్పిస్తూ…..
ఇక రాజకీయ ముఖచిత్రం కూడా మారనుంది. రాష్ట్ర అసెంబ్లీలో పరిస్థితి మారుతుంది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 111. (పీవోకే సహా) పీఓకే కోసం ప్రత్యేకంగా 24 స్థానాలు ఖాళీగా ఉంచారు. మిగిలిన 87లో లడఖ్ కు సంబంధించిన నాలుగు పోగా 83 ఉంటాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి త్వరలో కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈకమిటీ నివేదిక ఆధారంగా కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. నియోజకవర్గాల సరిహద్దులు మారతాయి. రిజర్వేషన్లను అమలు చేస్తారు. రాష్ట్రంలో మైనారిటీలయిన గుజ్జర్లు, వాల్మీకి సామాజికవర్గాలకు ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాలను కేటాయిస్తారు. 90వ దశకంలో ఘర్షణలతో కాశ్మీర్ లోయ నుంచి వెళ్లిపోయిన కాశ్మీరీ పండిట్లు తిరిగి వస్తే వారికి కూడా కొన్ని స్థానాలను కేటాయిస్తారు. ఎస్సీలకు కూడా కొన్ని స్థానాలను రిజర్వ్ చేసే అవకాశముంది. ఈ మార్పులు, చేర్పుల వల్ల రాష‌్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారుతుంది. దీనిప్రభావం అధికారులపైన ఉంటుంది. మొత్తానికి జమ్మూకాశ్మీర్ యువత కొత్త విషయాలను తెలుసుకుంటుంది. గతంలో మాదిరిగా సంక్షోభిత రాష్ట్రంగా కాకుండా శాంతి భద్రతల పరంగా మెరుగైన రాష్ట్రంగా మారే అవకాశాలున్నాయి. తద్వారా రాష్ట్రంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది.
-ఎడిటోరియల్ డెస్క్