ఆయన అస్త్ర సన్యాసం.. ఈయన శస్త్ర విన్యాసం

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు ఏర్పడ‌తాయో ఎవ‌రూ చెప్పలేరు. మాకు తిరుగులేదు.. అనుకున్న నాయ‌కులు కూడా మ‌ట్టిక‌రిచిన సంద‌ర్భాలు ఉన్నాయి. నాకు తిరుగేలేద‌ని మీసం తిప్పిన నాయ‌కులు [more]

Update: 2020-04-02 08:00 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు ఏర్పడ‌తాయో ఎవ‌రూ చెప్పలేరు. మాకు తిరుగులేదు.. అనుకున్న నాయ‌కులు కూడా మ‌ట్టిక‌రిచిన సంద‌ర్భాలు ఉన్నాయి. నాకు తిరుగేలేద‌ని మీసం తిప్పిన నాయ‌కులు కూడా తోక‌లు ముడిచిన ప‌రిస్థితులు కూడా క‌నిపించాయి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజ‌లే ప్రభువులు. ప్రభువుల‌ను ఆడించినా, ఓడించినా వారికే చెల్లింది. నాయ‌కులు ఎప్పుడూ సెకండ‌రీనే! ఇదే విష‌యం మ‌రోసారి గుంటూరు జిల్లా గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలోనూ రుజువు కావ‌డం గ‌మ‌నార్హం. ఇక్కడ వైసీపీ ఇప్పుడు పుంజుకుంది. తిరుగులేని ఆధిప‌త్యంతో దూసుకుపోతోంది.

తిరుగులేని యరపతినేనికి..?

గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గం పేరు చెపితే టీడీపీ అనే కంటే మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావుకు కంచుకోట‌. 1994, 2009, 2014 ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి గెలిచిన ఆయ‌న ఆధ్వర్యంలో ప‌ల్నాటి పోరు గ‌డ్డ‌పై టీడీపీ జెండా రెప‌రెప‌లాడింది. సైకిల్ జోరుగా తిరిగింది. పార్టీకి, త‌న‌కు కూడా తిరుగులేని విధంగా గుర‌జాల‌లో మూడు ద‌శాబ్దాలుగా ఆయ‌న హ‌వానే న‌డుస్తోంది. ఇక్కడ‌ అంతా ఆయ‌న మాటే.. ఆయ‌న బాటే. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఒక్కసారిగా ప్లేట్, ఫేట్ రెండూ తిర‌గ‌బడ్డాయి. వైసీపీ త‌ర‌ఫున ఇక్కడ నుంచి పోటీ చేసిన కాసు మ‌హేష్ రెడ్డి విజ‌యం సాధించారు. ఆ వెంట‌నే ఆయ‌న మండ‌లాలు, గ్రామాల వారీగా అభివృద్ధి బాట ప‌ట్టారు. ఇదే.. ఇప్పుడు టీడీపీని ప‌క్కన పెట్టి వైసీపీని ప్రజ‌లు భుజాల‌పైకి ఎక్కించుకునేందుకు దోహ‌ద‌ప‌డింది.

లోకల్ కాకపోయినా…?

కాసు మ‌హేష్‌రెడ్డి గుర‌జాల‌కు లోక‌ల్ కూడా కాదు. పైగా ఆయ‌న తాత‌.. తండ్రి గ‌తంలో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే త‌న కుటుంబానికి బ్యాడ్ సెంటిమెంట్‌గా ఉన్న గుర‌జాల‌లో కాసు సంచ‌ల‌న విజ‌యం సాధించారు. ఈ యేడాది కాలంలో ఆయ‌న ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేప‌ట్టారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పటికే ఉన్న పిడుగురాళ్ల మున్సిపాల్టీకి తోడుగా గుర‌జాల‌, దాచేప‌ల్లి న‌గ‌ర పంచాయ‌తీల ఏర్పాటు, గురాజ‌ల‌లో మెడిక‌ల్ హాస్పట‌ల్ ఏర్పాటు జ‌రిగింది. ఇక కీల‌క‌మైన ర‌హ‌దారులు.. వంతెన‌ల అభివృద్ధిలోనూ కాసు మ‌హేష్‌రెడ్డి క‌ష్టప‌డుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ….

ఇటీవ‌ల వాయిదా ప‌డిన స్థానిక ఎన్నిక‌ల‌కు సంబంధించి అస‌లు ఎన్నిక‌లే జ‌ర‌గ‌కుండానే గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వైసీపీకి ఏక‌గ్రీవం కావ‌డంతో య‌ర‌ప‌తినేని హ‌వా ఉందా? లేదా? ఆయ‌న రాజ‌కీయ ప‌రిస్థితి ఏంటి? అనే చ‌ర్చ మొద‌లైంది. నాలుగు మండ‌లాల్లోనూ అస‌లు య‌ర‌ప‌తినేని అభ్యర్థుల‌ను పోటీ కూడా పెట్టలేని ప‌రిస్థితి. ఒక్క పిడుగురాళ్ల మున్సిపాల్టీలో సైతం కొన్ని వార్డుల‌కే ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

కేసులు ఉండటంతోనే?

య‌ర‌ప‌తినేని ఇలాకా అంటే.. చంద్రబాబు, పార్టీ కీల‌క నాయ‌కుల‌కు కూడా చెక్కుచెద‌ర‌ని విశ్వాసం. అయితే, అనూహ్యంగా ఇక్కడ కాసు మ‌హేష్ హ‌వా చెల‌రేగ‌డం, ప్రజ‌లు వైసీపీకి మ‌ద్దతివ్వడం వంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన త‌ర్వాత య‌ర‌ప‌తినేని ఇక్కడ పూర్తిగా చేతులెత్తేశార‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కార‌ణం.. ఆయ‌న‌పై కేసులు ఉండ‌డం, టీడీపీ నుంచి కూడా మ‌ద్దతు లేక‌పోవ‌డం అనే అంశాలు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఎన్నిక‌ల్లో వైసీపీ అక్రమాల‌కు పాల్పడుతుండ‌డంతో ఎన్నిక‌ల‌ను బ‌హిష్కరిస్తున్నట్టు య‌ర‌ప‌తినేని చెప్పుకోవ‌డం ఆయ‌న అస్త్ర స‌న్యాసానికి నిద‌ర్శనం.

Tags:    

Similar News