కాసు ఒంటరయ్యారా? గురజాలలో ఏం జరుగుతోంది?

గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు ప్రాంతంలో ఉన్న గుర‌జాల అసెంబ్లీ నియోక‌వ‌ర్గంలో టీడీపీ-వైసీపీల మ‌ధ్య రాజ‌కీయం ముదురుతోంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గుర‌జాల రాజ‌కీయం ఎప్పుడూ ప‌ల్నాటి యుద్ధం మాదిరిగా [more]

Update: 2020-10-22 05:00 GMT

గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు ప్రాంతంలో ఉన్న గుర‌జాల అసెంబ్లీ నియోక‌వ‌ర్గంలో టీడీపీ-వైసీపీల మ‌ధ్య రాజ‌కీయం ముదురుతోంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గుర‌జాల రాజ‌కీయం ఎప్పుడూ ప‌ల్నాటి యుద్ధం మాదిరిగా భ‌గ‌భ‌గ‌మండుతూనే ఉంటోంద‌న్న నానుడిని నిజం చేస్తూ ఇప్పుడు కూడా అక్కడ రాజ‌కీయం ప‌ల్నాడును హీటెక్కిస్తోంది. ముఖ్యంగా అక్కడ ప్రస్తుత రాజ‌కీయ ప‌రిణామాలు చూస్తుంటే వైసీపీపై టీడీపీ దూకుడు ప్రద‌ర్శిస్తోంది. ముఖ్యంగా నిన్న మొన్నటి వ‌ర‌కు మౌనంగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు.. ఇప్పుడు హాట్ హాట్ కామెంట్లతో నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తున్నారు. నిత్యం ఆయ‌న ప్రజ‌ల్లో ఉంటున్నారు. పార్టీ కార్యక‌ర్తల స‌మ‌స్యలు ప‌ట్టించుకుంటున్నారు.

క్యాడర్ లో ఆత్మస్థయిర్యాన్ని…..

ఇటీవ‌ల గుర‌జాల మండ‌లంలో ఓ కార్యక‌ర్తల‌పై వ‌రుస‌గా జ‌రుగుతోన్న దాడులు, టీడీపీ కేడ‌ర్‌ను వైసీపీ నాయ‌కులు వేధించ‌డం, పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నార‌ని టీడీపీ నేత‌ల ఆక్రంద‌న‌ల నేప‌థ్యంలో య‌ర‌ప‌తినేని వారికి అండ‌గా నిలుస్తున్నారు. కేడ‌ర్ ప‌డుతోన్న ఇబ్బందులు తెలుసుకునేందుకు ఆయ‌న క్షేత్రస్థాయిలో ప‌ర్యటించి నిజ‌నిర్ధార‌ణ చేసుకుంటున్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ త‌మ పార్టీ కేడ‌ర్‌ను ఇబ్బంది పెడుతోన్న వారిని వ‌దిలి పెట్టేది లేదంటూ.. టీడీపీ కేడ‌ర్‌లో ఆత్మస్థయిర్యం పెంచేందుకు ప్రయ‌త్నించారు.

సీటును త్యాగం చేసిన….

ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కాసు మ‌హేష్ రెడ్డిపైనా య‌ర‌ప‌తినేని దూకుడుగా వెళ్తున్నారు. ఆయ‌న అవినీతికి పాల్పడుతున్నార‌ని అంటున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు సేక‌రించే ప‌నిలో ఉన్నాన‌ని, నిజాలు నిగ్గు తేలాక న్యాయ పోరాటానికి సైతం దిగుతాన‌ని అంటున్నారు. దీంతో వైసీపీ నేత‌ల నుంచి కౌంట‌ర్లు వ‌స్తాయ‌ని అనుకున్నారు. కానీ, వైసీపీ నేత‌లు మౌనం పాటించారు. దీనికి కార‌ణం కాసు దూకుడేన‌ని , ఆయ‌న ఎమ్మెల్యేగా ఎదిగిన త‌ర్వాత త‌న కోసం సీటును త్యాగం చేసిన కీల‌క నేత‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

స్థానిక నేతలతో….

ఇక నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క నేత అయిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని ప‌క్కన పెట్టడాన్ని కేడ‌ర్ స‌హించ‌లేక‌పోతోంద‌ని, అదే స‌మ‌యంలో మ‌రో కీల‌క నేత‌, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డితోనూ వివాదాలు పెట్టుకోవ‌డం కూడా స్థానికంగా నేత‌లు స‌హించ‌డం లేదు. దీంతో కాసు ఒంట‌రి అయ్యార‌నే భావ‌న క‌లుగుతోంది. నిజానికి నియోజ‌క‌వ‌ర్గంలో అవినీతి ఆరోప‌ణ‌లు ఇప్పుడు కొత్తగా ఏమీ రావ‌డం లేదు. గ‌తంలో య‌ర‌ప‌తినేని ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలోనూ అవినీతి ఆరోప‌ణ‌లు పెల్లుబికాయి. అప్పట్లో వైసీపీ నేత‌లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు సంధించ‌గా.. ఇప్పుడు టీడీపీ నాయ‌కులు రెచ్చిపోతున్నారు. గుర‌జాల‌లో కాసు అవినీతి చిట్టా చాలానే ఉంద‌ని.. ఆయ‌న ఇక్కడ దోచుకున్నది న‌ర‌సారావుపేట‌లో దాచుకోవ‌డానికే ఎమ్మెల్యే అయ్యారంటూ విరుచుకు ప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసుల కాసు ఇక్కడ పోటీయే చేయ‌ర‌ని.. ఆయ‌న న‌రాసారావుపేట‌కు వెళ్లిపోతారంటూ టీడీపీ దూకుడుగా చేస్తోన్న ప్రచారానికి వైసీపీ నేత‌లు బేల‌గా ఉండ‌డం త‌ప్ప కౌంట‌ర్లు ఇవ్వలేక‌పోతున్నారు.

ఎవరి మద్దతు లేక?

అయితే.. అప్పటికి ఇప్పటికి భిన్నమైన ప‌రిస్థితి ఏంటంటే.. య‌ర‌ప‌తినేని ఎవ‌రిపైనా అన‌వ‌స‌రంగా నోరు పారేసుకోలేదు. వివాదాలు కోరి తెచ్చుకోలేదు. కానీ, కాసు మాత్రం పోలీసులు బూట్లు నాకేవారంటూ ఇటీవ‌ల తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త‌న కాళ్లు ప‌ట్టుకుని పోస్టింగులు తెచ్చుకున్నారంటూ.. కూడా ఆయ‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌ర్వత్రా విస్మయానికి గురి చేసింది. ఈ నేప‌థ్యంలో వైసీపీలో ఆయ‌న ఒంట‌రి కావ‌డం, ఎవ‌రూ ఆయ‌న‌కు మ‌ద్దతుగా ముందుకు రాక‌పోవ‌డం, య‌ర‌ప‌తినేని ఇదే అదునుగా దూకుడు పెంచ‌డంతో గుర‌జాల రాజ‌కీయ ఒక్కసారి వేడెక్కింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News