వైసీపీలో కాసుకు కాక మొద‌లైందా.. !

గుంటూరు జిల్లా గుర‌జాల ఎమ్మెల్యే, వైసీపీ యువ నేత కాసు మ‌హేష్ రెడ్డిపై ఫిర్యాదులు వెల్లువ‌లా వ‌స్తున్నాయి. సొంత పార్టీలోనే ఆయ‌న‌పై అస‌మ్మతి జ్వాల‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి. [more]

Update: 2020-12-14 02:00 GMT

గుంటూరు జిల్లా గుర‌జాల ఎమ్మెల్యే, వైసీపీ యువ నేత కాసు మ‌హేష్ రెడ్డిపై ఫిర్యాదులు వెల్లువ‌లా వ‌స్తున్నాయి. సొంత పార్టీలోనే ఆయ‌న‌పై అస‌మ్మతి జ్వాల‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి. అయితే ఇవి నేరుగా ఎంపీ లావు కృష్ణదేవ‌రాయ‌ల వ‌ద్దకు చేరుతుండ‌డంతో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే మ‌ధ్య రోజు రోజుకు గ్యాప్ పెరుగుతూ వ‌స్తోంది. న‌ర‌సారావుపేట పార్లమెంటు ప‌రిధిలో ఇప్పటికే వినుకొండ‌, చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యేల‌తో ఎంపీగా గ్యాప్ రాగా ఇప్పుడు కాసుతోనూ ఆయ‌న‌కు మాట ప‌ట్టింపు బేధాలు వ‌స్తున్నాయి. దీంతో లావు ఏం చేయాలో తెలియ‌క త‌ల ప‌ట్టు కుంటోన్న ప‌రిస్థితి ఉంద‌ని తెలుస్తోంది. స్థానికంగా కొన్నాళ్లుగా ఇసుక‌, మ‌ద్యం అక్రమాలు పెరిగిపోయాయ‌ని స్థానిక ‌మీడియా వివ‌రాల‌తో స‌హా వెల్లడిస్తోంది. దీనిలో వైసీపీ కార్యక‌ర్తలు కూడా ఉన్నార‌ని పేర్కొంటోంది.

అవినీతి ఆరోపణలపై….

గత టీడీపీ హ‌యాంలో మైనింగ్, అవినీతి జ‌రిగింద‌ని తీవ్రంగా ఆరోప‌ణ‌లు చేసిన కాసు మ‌హేష్ రెడ్డి చుట్టూ ఇప్పుడు అవే ఆరోప‌ణ‌లు ముసురుకున్నాయి. అయితే.. కొన్నాళ్ల కింద‌ట‌.. దీనిపై మీడియా మీటింగు పెట్టిన కాసు.. త‌న‌కు సంబంధం లేద‌ని.. సంబంధం ఉంద‌ని నిరూపిస్తే త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌న్నారు. అంతేకాదు నియోజ‌క‌వ‌ర్గంలో కొత్తగా వ‌చ్చిన నాయ‌కులు ఈ దందాను న‌డిపిస్తున్నార‌ని ఆయ‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప‌రోక్షంగా వైసీపీలోని కీల‌క నేత‌ల‌ను ఆయ‌న టార్గెట్ చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. కొన్నాళ్ల కింద‌ట తెలంగాణ నుంచి వ‌స్తున్న అక్రమ మ‌ద్యం లారీని పోలీసులు అడ్డుకోవ‌డం.. దీని వెనుక ఎమ్మెల్యే అనుచ‌రులు ఉన్నార‌ని తెలియ‌డంతో ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది.

ఉద్దేశ్యపూర్వకంగానే….

ఇక‌, ఇసుక కొర‌త‌, అక్రమ ర‌వాణాపైనా స్థానికంగా ఫిర్యాలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని సొంత పార్టీ నేత‌లే లీక్ చేస్తూ ఎంపీ లావుకు ఫిర్యాదులు చేస్తున్నారు. త‌న పార్లమెంటు ప‌రిధిలో జ‌రుగుతుండ‌డం, త‌న‌కు వ‌చ్చి బాధితులు ఫిర్యాదులు చేస్తుండ‌డంతో ఎంపీ ఏమీ చేయ‌లేక పోవ‌డం స‌ర్వత్రాచ‌ర్చ నీయాంశంగా మారింది. గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నులను త‌ర‌చుగా ఎంపీ స‌మీక్షిస్తున్నారు. రాను రాను.. ఎమ్మెల్యే కాసు మ‌హేష్ రెడ్డిపై ఫిర్యాదులు వ‌స్తుండ‌డంతో ఆయ‌న త‌ప్పుకొని.. త‌న అనుచ‌రుల ఆధ్వర్యంలోనే ఇక్కడ జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నులు స‌మీక్షిస్తోన్న ప‌రిస్థితి. దీనిని కాసు వ్యతిరేకిస్తున్నారు. త‌న‌పై ఉద్దేశ పూర్వంగా జ‌రుగుతున్న రాజ‌కీయ దాడిని.. ఎంపీ కూడా స‌మ‌ర్ధిస్తున్నారంటూ ఆయ‌న త‌న అనుచ‌రుల వ‌ద్ద పేర్కొంటున్నారు.

కీలక నేత వద్దకు పంచాయతీ…..

ఇక కాసు మ‌హేష్ రెడ్డిపై ఎంపీ లావు నేరుగా వైసీపీ కీల‌క నేత‌కు ఫిర్యాదు చేయ‌డంతో కాసు మ‌రింత‌గా ర‌గులుతున్నారు. అధిష్టానం కూడా ఈ పంచాయితీని ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టింది. ఇది..ఇప్పటి వ‌ర‌కుఉన్న ఎమ్మెల్యే-ఎంపీల స్నేహాన్ని కూడా దెబ్బతీసేలా ఉంది. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌లు ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల‌తో పాటు సామాజిక వ‌ర్గాల వారీగా విడిపోయారు. దీంతో ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోవ‌డం మానుకున్నారు. టీడీపీ నాయ‌కులు ఈ గ్యాప్‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయ‌త్నిస్తుండ‌గా ఈ ప‌రిణామం సొంత పార్టీలో కాసుకు సెగ రాజుకునేలా చేస్తోంది.

Tags:    

Similar News