ఈయనకు మైనస్ అదేనట

జగన్ తన రెండో విడత మంత్రి వర్గంలో ఎవరికి చోటు కల్పిస్తారు? ఈసారి అవకాశం ఎవరికి ఉంటుంది? అన్న చర్చ ఇప్పటి నుంచే అన్ని జిల్లాల్లోనూ జరుగుతోంది. [more]

Update: 2020-02-23 14:30 GMT

జగన్ తన రెండో విడత మంత్రి వర్గంలో ఎవరికి చోటు కల్పిస్తారు? ఈసారి అవకాశం ఎవరికి ఉంటుంది? అన్న చర్చ ఇప్పటి నుంచే అన్ని జిల్లాల్లోనూ జరుగుతోంది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో 95 శాతం మార్చి మిగిలిన వారికి అవకాశం కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లాల్లో సీనియర్ నేతలు రెండో విడతలో మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. ఇందులో కాటాసాని రాంభూపాల్ రెడ్డి ఒకరుగా చెప్పాలి.

సీనియర్ నేతగా…..

కాటసాని రాంభూపాల్ రెడ్డి సీనియర్ నేత. కర్నూలు జిల్లాలో ఆరు సార్లు గెలిచిన కాటసాని రాంభూపాల్ రెడ్డి జిల్లాలోని వైసీపీలో ఎమ్మెల్యేలందరికంటే అనుభవం ఉన్న నేత. రాజకీయాల్లో సీనియర్ నేత అనే చెప్పాలి. అయితే కాటసాని రాంభూపాల్ రెడ్డి చివరి నిమిషంలో పార్టీలో చేరడం ఆయనకు మైనస్ పాయింట్ గా చెప్పాలి. కాటసాని రాంభూపాల్ రెడ్డి జగన్ కృష్ణా జిల్లా పాదయాత్రలో ఉన్న సందర్భంగా పార్టీ కండువా కప్పుకున్నారు.

ఆరుసార్లు గెలిచి…..

కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం నియోజకవర్గం నుంచి అప్పటికే ఐదుసార్లు గెలిచారు. కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ప్రస్థానం కొనసాగింది. తర్వాత బీజేపీలో చేరినా బయటకు వచ్చారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి చేరికతో పాణ్యంలో అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గౌరు చరిత కుటుంబాన్ని జగన్ దూరం పెట్టారు. కాటసానికే టిక్కెట్ ఖరారు చేశారు. దీంతో గౌరు కుటుంబం టీడీపీలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాను ఆరుసార్లు గెలిచి సీనియర్ మంత్రినని, తనకు మంత్రి పదవి గ్యారంటీ అని కాటసాని రాంభూపాల్ రెడ్డి నమ్ముతున్నారు.

ఎన్నికలకు ముందు చేరడమే…..?

కానీ కర్నూలు జిల్లాలో ప్రస్తుతమున్న మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు మాత్రం లేవు. దీంతో మరొకరికి రెడ్డి సామాజికవర్గానికి అవకాశం కల్పించాలన్నా శిల్పా చక్రపాణిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి వంటి నేతలు కూడా రేసులోనే ఉన్నారు. పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల కాలంలో వైసీపీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఎన్నికలకు ముందు పార్టీలో చేరడం మంత్రి పదవి ఇచ్చేందుకు మైనస్ అవుతుందంటున్నారు. మరి జగన్ ను కాటసాని ఎలా మెప్పించగలుగుతారో చూడాలి.

Tags:    

Similar News