వైసీపీలో ఆయన చేరికతో కెవ్వు కేక…!!

రాష్ట్రంలో అధికారం చేపట్టడంతో పాటు ఎక్కువ పార్లమెంటు కైవసం చేసుకోవాలని భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎంపీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర [more]

Update: 2019-02-20 01:30 GMT

రాష్ట్రంలో అధికారం చేపట్టడంతో పాటు ఎక్కువ పార్లమెంటు కైవసం చేసుకోవాలని భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎంపీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. బలమైన అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంపై దృష్టి పెడుతూ అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు. బలమైన అభ్యర్థులు లేని స్థానాల్లో కొత్త వారిని, ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుని వారికి టిక్కెట్లు ఖాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి సీనియర్ నాయకులు కావూరి సాంబశివరావును బరిలో దింపాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న కావూరి త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతారని, ఆయనే ఏలూరు నుంచి బరిలో ఉంటారని సమాచారం.

రాజకీయ భవిష్యత్ కోసం…

ఐదుసార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన కావూరి ఏలూరు నుంచి 2004, 2009లో ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు మూడుసార్లు మచిలీపట్నం నుంచి ఆయన ఎంపీగా పనిచేశారు. 2014కి ముందు ఆయన కేంద్రమంత్రిగా కూడా ఉన్నారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. బీజేపీలో కొంతకాలం క్రీయాశీలకంగా పనిచేసిన ఆయన తర్వాత సైలెంట్ అయ్యారు. ఇక, బీజేపీతో తెగదింపులు చేసుకున్న టీడీపీ తర్వాత ఏపీ పాలిట బీజేపీని పూర్తిగా విలన్ గా మార్చేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో ఇప్పుడు బీజేపీ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. దీంతో బీజేపీలో ఉన్న నేతలు రాజకీయ భవితవ్యం కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్వ వైభవం కోసం తహతహలాడుతున్న కావూరి సాంబశివరావు సైతం బీజేపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి ఏలూరు నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

కావూరి చేరిక ఖాయం…

గత ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన తోట చంద్రశేఖర్ భారీ తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో చేరారు. తర్వాత సీనియర్ నేత కోటగిరి విధ్యాదరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్ వైసీపీలో చేరారు. ఏలూరు పార్లమెంటు పార్టీ బాధ్యతలు చూస్తున్న ఆయననే రానున్న ఎన్నికల్లో పోటీ చేయించాలని మొదట వైసీపీ భావించింది. అయితే, సీనియర్ నేతగా, నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పరిచయాలు ఉన్న కావూరి బరిలో దిగితే గెలుపు సులువవుతుందని భావిస్తున్న వైసీపీ ఆయననే పోటీ చేయించాలనుకుంటోంది. కోటగిరి శ్రీధర్ కు ఇతర ఏదైనా అవకాశం ఇవ్వాలని చూస్తోందని సమాచారం. ఇప్పటికే కావూరితో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి చర్చలు జరిపారని సమాచారం. జగన్ లండన్ పర్యటన నుంచి రాగానే వైసీపీలో కావూరి చేరిక ఖాయమంటున్నారు. మరి, కావూరి చేరికతో ఏలూరు పార్లమెంటు పరిధిలో రాజకీయాలు ఎలా మారుతాయో చూడాలి.

Tags:    

Similar News