కదం.. కదం… రాజకీయ పథం
‘కదం ..కదం పర్ లడ్ నా’అంటూ పదమూడేళ్ల పాటు సాగిన టీఆర్ఎస్ ప్రస్థానం రాష్ట్ర సాధన తర్వాత మరో మలుపు తిరిగింది. గడచిన ఏడేళ్లలో అధికార పార్టీగా [more]
‘కదం ..కదం పర్ లడ్ నా’అంటూ పదమూడేళ్ల పాటు సాగిన టీఆర్ఎస్ ప్రస్థానం రాష్ట్ర సాధన తర్వాత మరో మలుపు తిరిగింది. గడచిన ఏడేళ్లలో అధికార పార్టీగా [more]
‘కదం ..కదం పర్ లడ్ నా’అంటూ పదమూడేళ్ల పాటు సాగిన టీఆర్ఎస్ ప్రస్థానం రాష్ట్ర సాధన తర్వాత మరో మలుపు తిరిగింది. గడచిన ఏడేళ్లలో అధికార పార్టీగా పూర్తి రాజకీయ అజెండానే అమలు చేస్తోంది. అత్యుత్సాహంతో ఇచ్చిన కొన్ని హామీలు అటకెక్కినా దేశానికే కొన్ని పథకాలను ఆదర్శంగా నిలిపారు కేసీఆర్. పార్టీ, ప్రభుత్వం దాదాపు ఒన్ మ్యాన్ షో అన్న ముద్ర అయితే చెరిగిపోలేదు. వారసుడు కేటీఆర్ ను ఇంకా ప్రజలు పూర్తి స్థాయిలో అధినేత గా గుర్తించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహ నైపుణ్యం, రాజకీయ చతురత ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఇప్పట్లో తిరుగులేదనే వాతావరణాన్ని నెలకొల్పడంలో దాదాపు సఫలీకృతమయ్యారు. ప్రతిపక్షాలు రెండు ముక్కలుగా కనిపిస్తున్నాయి. ఏ ఒక్క పార్టీ అధికార పక్షానికి రాష్ట్ర వ్యాప్తంగా దీటైన పోటీని ఇచ్చే పరిస్థితి దరిదాపుల్లో కనిపించడం లేదు. రాష్ట్ర ఆవిర్భావ సమయం కంటే టీఆర్ఎస్ బలపడటం, సొంత పార్టీలో అసమ్మతి, అసంతృప్తులను పూర్తిగా అణచివేయడం పరిపూర్తి అయిపోయింది. అభివృద్ధి , సంక్షేమాలను బ్యాలెన్స్ చేసుకోవడం కూడా కొత్త రాష్ట్రాన్ని ఒక రకంగా ఒడ్డున పడేస్తోంది. అయితే పక్కా రాజకీయాలనే కార్యాచరణ గా అమలు చేసే టీఆర్ఎస్ వ్యూహాల వల్ల రాష్ట్రానికి ఒకింత నష్టం వాటిల్లుతోందనే వాదన సైతం వినవస్తోంది. ప్రజలకే కాదు, ప్రజాప్రతినిధులకు సైతం కేసీఆర్ చిక్కడు- దొరకడు తరహాలోనే వ్యవహరిస్తారనే విమర్శ తీవ్రంగానే ఉంది. వారికి అందుబాటులో ఉండకుండా తన నిర్ణయాలను తాను అమలు చేసుకుంటూ పోవడమే కేసీఆర్ స్టైల్.
దేశానికే కొత్త పథకాలు..
ఎస్సీ, ఎస్టీ వర్గాల పేదలకు మూడెకరాల భూమి, పేదలందరికీ రెండు పడకల ఇళ్లు, ఇంటింటికీ తాగునీరు ఇలా.. టీఆర్ఎస్ పథకాల జాబితా చాలా కనిపిస్తుంది. కానీ ఆచరణసాధ్యం కాని ఈ పథకాలు ఎంతవరకూ వచ్చాయంటే సంతృప్తి కరమైన సమాధానం దొరకదు. కానీ రైతు బంధు పథకం ద్వారా వ్యవసాయ రంగానికి ఒక ప్రత్యేక తరహా రాయితీని కేసీఆర్ చూపించగలిగారు. దేశంలో ప్రదానమంత్రి కిసాన్ యోజన రావడానికి, అనేక రాస్ట్రాల్లో రైతులకు నగదు బదిలీ పథకాలు ప్రవేశ పెట్టడానికి రైతు బంధు మార్గం చూపిందనే చెప్పాలి. భూమి సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతులకు సాయం చేయడమనేది పథకంలోని ప్రత్యేకత. ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇటువంటి పథకం అమలు చేయడం లేదు. సాగు విస్తీర్ణంతో సంబంధం లేకుండా మొక్కుబడిగా పది వేల నుంచి పదిహేను వేల వరకూ చాలా రాష్ట్రాలు రైతులకు సాయం అందిస్తున్నాయి. అది ఎంతమాత్రం సాగు పెట్టుబడికి సరిపోయే నిధి కాదు. ఈ రకంగా చూస్తే కేసీఆర్ ముందు చూపు ప్రశంసార్హమైనదే.
కాంగ్రెసు కంచికి…
కలహాలు, ముఠా కుమ్ములాటలతో సతమతమయ్యే కాంగ్రెసు పార్టీ 2014 నాటికంటే 2021కి బాగా బలహీన పడింది. అనేక రకాల ప్రయోజనాలను ఎర వేసి ఎమ్మెల్యేలు సహా నాయకులను చాలా మందిని టీఆర్ఎస్ ఆకర్షించగలిగింది. హస్తం పార్టీలో పోరాట పటిమ దాదాపు సన్నగిల్లిపోయింది. కేసీఆర్ అమలు చేసిన ఎత్తుగడలు ప్రధాన ప్రతిపక్సాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అన్ని రకాలుగా అధికారంలోకి రావడానికి తగిన సాధన సంపత్తి ఉన్నప్పటికీ హస్తం పార్టీ డీలా పడటానికి కేసీఆర్ ప్రత్యక్ష కారణంగా చెప్పాలి. ఆ పార్టీలోని నాయకుల్లో ఉండే అధికార లాలసతను ఆసరాగా చేసుకుని చాలా వరకూ పార్టీని కేసీఆర్ దెబ్బతీయగలిగారు. అసెంబ్లీలో నామమాత్రపు పార్టీగా మారింది. ప్రతి ఎన్నికలోనూ తన ఓట్ షేర్ ను క్రమేపీ కోల్పోతూ వస్తోంది. తాజాగా జరిగిన నాగార్జునసాగర్ ఎన్నిక పతనానికి పరాకాష్ఠగా చెప్పుకోవాలి. భవిష్యత్తులో కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఉత్సాహంగా పోటీ పడే వాతావరణం లోపించింది. ఆ రకంగా ప్రతిపక్షాన్ని మానసికంగా, నైతికంగా కేసీఆర్ దెబ్బతీయగలిగారు.
బీజేపీతో దోబూచులు…
భారతీయ జనతా పార్టీకి కూడా కేసీఆర్ సవాల్ విసురుతున్నారు. సందర్బానుసారం తన పోరాట పంథాను మార్చుకుంటూ కమలం పార్టీని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయోమయానికి గురి చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలు ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను తొలుత విమర్శించి తర్వాత వాటికి మద్దతుగా నిలిచి బీజేపీ అధినాయకత్వానికే ప్రశ్నలు మిగిల్చారు. అదే విధంగా ప్రతిపక్ష స్థానం కోసం కాంగ్రెసు, బీజేపీలు కొట్టాడుకునే వాతావరణం కల్పించారు. దీనివల్ల ఆ రెండు పార్టీలకు అందనంత ఎత్తులో టీఆర్ఎస్ ఉంటుందనేది కేసీఆర్ అంచనా. అంతంతమాత్రం బలమున్న బీజేపీ కొద్దిగా బలపడినా ఫర్వాలేదు. కాంగ్రెసు ఆమేరకు దెబ్బతింటుంది. మొత్తమ్మీద త్రిముఖ పోరులో తన పార్టీ ఆధిక్యానికి ఢోకా ఉండదనేది కేసీఆర్ ఎత్తుగడ. రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ పరిణామాలు దీనిని నిరూపిస్తున్నాయి. కాంగ్రెసు పార్టీ పూర్తిగా నిర్వీర్యం కాలేదు. కానీ కొంతమేరకు బలహీనపడింది. అదే సమయంలో బీజేపీ కొంతమేరకు బలపడింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే ప్రబల శక్తిగా రూపుదాల్చలేదు. ఇందువల్లనే టీఆర్ఎస్ చాలా జాగ్రత్తగా పొలిటికల్ గేమ్ ఆడగలుగుతోంది.
అజెండా మారితే అద్భుతం…
రాష్ట్ర ఆవిర్బావ సమయానికి టీఆర్ఎస్ బలం అంతంతమాత్రమే. ఒక్కో బలహీనతను అధిగమిస్తూ పార్టీకి తిరుగులేని ఆధిక్యాన్ని కేసీఆర్ సాధించగలిగారు. ఇక ప్రతిపక్షాల ను బలహీనపరిచే అజెండాను పక్కనపెట్టి తన శక్తియుక్తులను రాష్ట్ర అభివృద్ధి అజెండాపై కేంద్రీకరిస్తే ప్రయోజనదాయకంగా ఉంటుందనేది పరిశీలకుల విశ్లేషణ. టీఆర్ఎస్ పార్టీకి బలమైన ప్రజామద్దతు లభిస్తోంది. ప్రజాబలాన్ని తోడుగా చేసుకుంటూ శాశ్వతమైన ప్రగతికి బాటలు పరవాల్సిన సమయం ఆసన్నమైంది.
-ఎడిటోరియల్ డెస్క్