కేసీఆర్ మేకోవర్…విపక్షాలకు ఫీవర్…

కేసీఆర్ కేరాఫ్ ఫామ్ హౌస్. ఇదే ఏడేళ్ళుగా ఆయన మీద అంతా చేస్తున్న విమర్శలు. కేసీఆర్ బయటకు రారు. ఆయన అసలు ఎవరికీ కనిపించరు. అపాయింట్ మెంట్ [more]

Update: 2021-07-08 00:30 GMT

కేసీఆర్ కేరాఫ్ ఫామ్ హౌస్. ఇదే ఏడేళ్ళుగా ఆయన మీద అంతా చేస్తున్న విమర్శలు. కేసీఆర్ బయటకు రారు. ఆయన అసలు ఎవరికీ కనిపించరు. అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరు. ఆయన దొర. అందుకే అలా అంటూ ఎన్ని మాటలు అనాలో అన్నీ అన్నారు. కేసీఆర్ కూడా భరించారు. కానీ ఇపుడు ఒక్కసారిగా జూలు విదిల్చారు. మరి ఈటల రాజేందర్ ప్రభావమో లేక విపక్షాలు బస్తీ మే సవాల్ అంటున్నాయని సై అంటున్నారో తెలియదు కానీ మొత్తానికి కేసీఆర్ టాప్ టూ బాటం స్టైల్ చేంజ్ చేసేశారు.

మంత్ర దండమే…?

కేసీఆర్ ని తక్కువ అంచనా వేస్తే ఎంత దేంజరో 2014, 2018 ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ప్రత్యర్ధిలో ఒక్క శాతం మైనస్ పాయింట్ కనిపించినా దాన్ని నూరు శాతం చేసి వాడేసుకోవడం ఆయన నైపుణ్యం. అలాంటి కేసీఆర్ ఎపుడూ పవర్ ఫుల్ లీడరే. ఆయన మంత్రదండం ఎపుడూ మాయచేసేదే. ఏమరుపాటుగా ఉంటే విపక్షం మరో మారు గల్లంతు కావడమూ తధ్యమే. కేసీఆర్ ఇపుడు విగరస్ గా తిరిగేస్తున్నారు. ఈ జోరు బహుశా 2023 చివరలో జరిగే శాసనసభ‌ ఎన్నికల దాకా ఆగేలా లేదు. అంటే విపక్షాలకు కొత్త టెన్షన్ మొదలైనట్లే.

అటూ…ఇటూ …..

కేసీఆర్ జిల్లాల టూర్లు వేస్తున్నారు. ఒక వైపు శిలాఫలకాలను ఆవిష్కరిస్తూ మరో వైపు సామాన్య జనంలో సహపక్తి భోజనాలు చేస్తున్నారు. అదే టైంలో విపక్షాలకు అపాయింట్మెంట్ ఇస్తూ సరికొత్తగా కనిపిస్తున్నారు. మరో వైపు అఖిల పక్షం అంటూ హడావుడి చేస్తున్నారు. నిజంగా కేసీయారేనా అన్న అనుమానం అయితే విపక్షంలో కలుగుతోంది. అదే టైంలో ఆయన్ని అనవసరంగా కెలికామా అన్న ఆలోచనలో కూడా పడుతున్నారు అంతా.

వ్యూహాల పుట్ట ….

కేసీఆర్ బుర్ర నిండా వ్యూహాలే ఉంటాయి. ఈ రోజుకు కూడా తెలంగాణా రాజకీయ మైదానంలో రెండు వైపులా తానే నిలిచి ఆడే బహు మొనగాడు కేసీఆర్ అనే చెప్పాలి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కవ్వించినా సరే కేసీఆర్ వ్యూహాల ముందు నిలవగలరా అన్న డౌట్లు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ముందు పెట్టి కొత్త కధను చెప్పబోతోంది. బీజేపీ కి ఈటెల తురుపు ముక్కలా కనిపిస్తున్నాడు. కానీ అన్ని పార్టీల పట్లూ లోగుట్టు బాగా ఎరిగిన కేసీఆర్ ముందు ఈ కుప్పిగెంతులు ఎంతవరకూ పనిచేస్తాయి అంటే చెప్పడం కష్టమే. మొత్తానికి కారూ సారూ బాగానే బేజారెత్తిస్తున్నారు.

Tags:    

Similar News