తెరమీదకు మళ్లీ తెస్తున్నారే….!!
రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి అందరికీ పదవుల పందేరం చేయనున్నారు. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో అధికారంలోకి వచ్చినా ఉద్యమంలో తన వెంట [more]
రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి అందరికీ పదవుల పందేరం చేయనున్నారు. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో అధికారంలోకి వచ్చినా ఉద్యమంలో తన వెంట [more]
రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి అందరికీ పదవుల పందేరం చేయనున్నారు. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో అధికారంలోకి వచ్చినా ఉద్యమంలో తన వెంట నడిచిన వారికి, ఉద్యమకారులకు పెద్దగా పదవులను కేటాయించలేకపోయారు. ఈ అసంతృప్తి వారిలో లోలోపలే ఉన్నప్పటికీ కేసీఆర్, పార్టీపైన ఉన్న అభిమానంతో వారు గత పాలనలో మౌనంగానే ఉన్నారు. అయితే ఈసారి వారిని నిరాశపర్చకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవుల విషయంలోనూ ఒక డెసిషన్ కు వస్తారని చెబుతున్నారు.
మంత్రివర్గ కూర్పు తర్వాత…..
ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి కేసీఆర్ సమాచారం తెప్పించుకున్నారు. పూర్తి స్థాయి జాబితాను రూపొందించే పనిలో గులాబీ బాస్ కు దగ్గరగా ఉన్న ఇద్దరు నేతలు కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు తిరిగి పార్లమెంటరీ కార్యదర్శులను నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు. వారికి కేబినెట్ హోదా ఇవ్వకుండా పార్లమెంటరీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేస్తారని అంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు అభ్యర్థులతో పాటు, గెలిచిన ఎమ్మెల్యేలలో కొందరికి పార్లమెంటరీ కార్యదర్శుల పదవి ఇవ్వనున్నారని సమాచారం.
గతంలో నిర్లక్ష్యం…..
గతంలో చేసిన నిర్లక్ష్యాన్ని ఈ సారి ప్రదర్శించకూడదని కేసీఆర్ అనుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో పార్టీ విజయానికి క్యాడర్, నేతలు చేసిన కృషిని ఆయన దృష్టిలో ఉంచుకుని, ఈసారి నాన్చకూడదన్న అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నారు. తొలుత మంత్రివర్గ కూర్పు ఒక కొలిక్కి వస్తే అందులో చోటు లభించని వారిలో సీనియర్ నేతలకు పార్లమెంటరీ కార్యదర్శుల పదవి ఇస్తారంటున్నారు. కేబినెట్ కేసీఆర్ తో సహా పద్ధెనిదిమందికే అవకాశం ఉంటుంది. అందరినీ మంత్రిపదవులతో సంతృప్తి పర్చలేమని భావిస్తున్న కేసీఆర్ పార్లమెంటరీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నడుంబిగించారు.
వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాత….
గతంలో కేసీఆర్ కొందరిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ విపక్ష నేతలు కోర్టుకు వెళ్లడంతో ఆ పోస్టులను న్యాయస్థానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈసారి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో మిగిలిన రాష్ట్రాల్లో పార్లమెంటరీ కార్యదర్శుల పోస్టుల నియామకం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఒక టీం ఇప్పటికే కొన్ని రాష్ట్రాలను చుట్టి అధ్యయనం చేసి వచ్చింది. కేబినెట్ విస్తరణ అనంతరం పార్లమెంటరీ కార్యదర్శుల పదవులను భర్తీ చేస్తారన్న సమాచారంతో గులాబీ నేతలు పండగ చేసుకుంటున్నారు.