కేబినెట్ విషయంలో కేసీఆర్ వ్యూహం ఇదేనా..?

తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు వారాలు గడిచినా మంత్రివర్గం ఏర్పాటుపై క్లారిటీ రావడం లేదు. దీంతో ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. తమకు అవకాశం దక్కుతుందా లేదా.. [more]

Update: 2019-01-02 03:30 GMT

తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు వారాలు గడిచినా మంత్రివర్గం ఏర్పాటుపై క్లారిటీ రావడం లేదు. దీంతో ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. తమకు అవకాశం దక్కుతుందా లేదా.. అసలు ముఖ్యమంత్రి మదిలో ఉన్నానా లేనా అని ఎమ్మెల్యేలు, మంత్రి పదవి ఆశిస్తున్న పలువురు ఎమ్మెల్సీలు కూడా ఉత్కంఠతో ఉన్నారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి, ఆయన మాటల తీరు చూస్తుంటే మంత్రవర్గం కొలువుదీరేందుకు ఇంకా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్… కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు. కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా ఉండవద్దని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవాలని అనుకుంటున్నారు. దీంతో ఇలా పార్టీలో చేరిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల ఆఫర్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నందున ఫిరాయింపుల ప్రక్రియ అయిపోయాకే పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ప్రస్థుతానికి సంక్రాంతి తర్వాత సగం క్యాబినెట్ ను భర్తీ చేసే అవకాశం ఉంది.

కాంగ్రెస్ ని దెబ్బతీసే లక్ష్యంతో..?

తెలంగాణలో ముఖ్యమంత్రి సహా 18 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. 2014 ఎన్నికల్లో విజయం తర్వాత కేసీఆర్ తనతో పాటు మరో 11 మందితో మంత్రివర్గాన్ని వెంటనే ఏర్పాటు చేశారు. తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చే వారు వచ్చాక ఆరు నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిపి మిగతా ఖాళీలను భర్తీ చేశారు. గత ఎన్నికల్లో తన పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ ఈసారి ప్రత్యర్థి కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండాలంటే 12 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఈసారి కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అంటే 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకుంటే కాంగ్రెస్ కి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదని టీఆర్ఎస్ భావిస్తుందని అంటున్నారు.

ఫిరాయింపుల తర్వాతే పూర్తిస్థాయి మంత్రివర్గం…

ఇప్పటికే శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ లో విలీనం చేసే కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దెబ్బకొట్టిన కేసీఆర్ మరోసారి ఇటువంటి షాక్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ వర్గాలు టచ్ లో ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా పలువురు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. దీంతో మొదటి విడతగా 8 మందిని మాత్రమే క్యాబినెట్ లోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. 10 ఉమ్మడి జిల్లాల నుంచి ప్రాతినిథ్యం ఉండేలా తనతో సహా 10 మంది మొదటి విడత క్యాబినెట్ లో తీసుకుంటారని అంటున్నారు. ఇక, కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలు వచ్చాక పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ జరిపి మరో 8 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అది కూడా సంక్రాంతి తర్వాత మంత్రివర్గం ఏర్పాటు జరగనుందని అంటున్నారు. మరి కేసీఆర్ ఫస్ట్ లిస్ట్ ఎవరికి చోటు దక్కుతుందో, వెయిటింగ్ లిస్ట్ లో ఎవరు ఉంటారో చూడాలి.

Tags:    

Similar News