కేశినేనికి వాళ్లే చుక్కలు చూపిస్తున్నారుగా?
ఏపీలోనే అత్యంత కీలకమైన బెజవాడ నగరంలో టీడీపీ ఎప్పుడూ తన పట్టు నిలుపుకుంటూ వస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోర పరాజయం ఎదురైంది. [more]
ఏపీలోనే అత్యంత కీలకమైన బెజవాడ నగరంలో టీడీపీ ఎప్పుడూ తన పట్టు నిలుపుకుంటూ వస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోర పరాజయం ఎదురైంది. [more]
ఏపీలోనే అత్యంత కీలకమైన బెజవాడ నగరంలో టీడీపీ ఎప్పుడూ తన పట్టు నిలుపుకుంటూ వస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోర పరాజయం ఎదురైంది. అయినా నగరంలో ఓ ఎమ్మెల్యే సీటుతో పాటు ఎంపీ సీటు గెలుచుకుంది. బెజవాడ పార్టీ పెట్టినప్పటి నుంచే టీడీపీకి కంచుకోటగానే ఉంటోంది. ఇక రాజధాని వికేంద్రీకరణతో విజయవాడ, గుంటూరు ప్రజల్లో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న టాక్ ముందు నుంచే ఉంది. ఇలాంటి సమయంలో బెజవాడ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. పైన ఉన్న సానుకూలతలు చూస్తే టీడీపీ వన్ సైడ్‌గా గెలిచి చూపించాలి. కట్ చేస్తే పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలతో రాష్ట్రానికే గుండెకాయ లాంటి కార్పొరేషన్‌ను చేజేతులా పోగొట్టుకుంటోందా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మేయర్ పదవి కోసం….
మేయర్ పీఠం సాక్షిగా బెజవాడ టీడీపీ చీలికలు… పీలికలు అయిపోయింది. మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో ఎవరికి ఇవ్వాలా ? అన్నదానిపై పార్టీ నేతల మధ్య ఏ మాత్రం సఖ్యత లేదు. మేయర్ రేసులో ముందున్న ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేతను పార్టీలోనే చాలా మంది నేతలు అంగీకరించడం లేదు. పార్టీ గత ఎన్నికల్లో ఓడి… నాని ఎంపీగా రెండోసారి గెలిచినప్పటి నుంచి నాని తనకంటూ సొంత ఇమేజ్ కోసమే ప్రయత్నాలు చేశారు. స్థానికంగా ఉన్న పార్టీ నేతలతో పాటు పార్టీ అధిష్టానాన్ని సైతం ధిక్కరించేలా మాట్లాడారు. చంద్రబాబు తన కుమార్తెకు మేయర్ పీఠం ఖరారు చేశారని కేశినేని నాని వర్గం పైకి చెప్పుకుంటున్నా… పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు.
నానికి.. నేతలకు మధ్య….
ఇక గత యేడాదిగా చూస్తే ఎంపీ కేశినేని నానికి నగరంలో మిగిలిన పార్టీ నేతలకు మధ్య చాలా గ్యాప్ పెరిగింది. నానికి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. మేయర్ పదవి రేసులో ఉన్నప్పుడు నాని తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధా, బొండా ఉమాను కలుపుకుని వెళ్లాల్సి ఉన్నా… కేశినేని నాని ఒంటెద్దు పోకడలతో వాళ్లంతా ఆయనకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇక తాజాగా కార్పొరేషన్ ఎన్నికల ప్రకటన వచ్చిన వెంటనే నాని తన కుమార్తెను వెంట పెట్టుకుని డివిజన్లలో ప్రచారం చేస్తున్నారు. ఆయన వెంట నగరంలో ఉన్న కీలక నేతలు ఒక్కరు కూడా లేరు.
తలో దారిలో….?
ఇక పశ్చిమ నియోజకవర్గంలో బుద్ధాను పక్కన పెట్టేసి… తన వర్గానికి చెందిన నాగుల్ మీరాను కేశినేని నాని ఎంకరేజ్ చేస్తుండడంతో అక్కడ ఆ వర్గం నానికి దూరమైంది. సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమా, రాధా లాంటి వాళ్లు లేకపోతే టీడీపీకి రాజకీయమే లేదు. ఇక తూర్పులో గద్దె రామ్మోహన్, మాజీ మేయర్ కోనేరు శ్రీథర్ వర్గాలు లేకపోతే అక్కడ మాత్రం పార్టీకి ఎలా ? ఓట్లు పడతాయన్న డౌట్లు ఉండనే ఉన్నాయి. మరోవైపు బుద్ధా వర్గంతో పాటు బొండా వర్గం ఇంకా మేయర్ పదవిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెపుతున్నారు. దీనిని బట్టి కేశినేని నాని కుమార్తెకు మేయర్ పదవి ఇవ్వడం వీళ్లకు ఇష్టం లేదని తెలిసిపోతోంది. ఇక నగరంలో పట్టున్న మాజీ మంత్రి దేవినేని ఉమ సైతం కేశినేని నానికి సపోర్ట్ చేయడం లేదు. వీరిద్దరి మధ్య పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే విబేధాలు ఉన్నాయి. మరి కేశినేని నాని ఎన్నికల ప్రచారంలో ఇప్పటకీ అయినా ఈ అన్ని వర్గాలను కలుపుకుపోతారా ? ఫైనల్‌గా టీడీపీ గెలిస్తే మేయర్ పీఠం ఎవరికి దక్కుతుంది ? అన్నది అయితే సస్పెన్స్‌గానే ఉంది.