వివాదానికి ఆయనే కారణమా?

తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య మాటల యుద్ధానికి కారణం ఎవరు? విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య జరుగుతున్న వార్ కు [more]

Update: 2019-07-17 08:00 GMT

తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య మాటల యుద్ధానికి కారణం ఎవరు? విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య జరుగుతున్న వార్ కు కారణాలేంటి? ఇద్దరి మధ్య వివాదం ఇంత ఎందుకు ముదిరింది. విజయవాడ రాజకీయాలే కారణమా? మరేదైనా వ్యక్తిగత కారణాలున్నాయా? అన్నది తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బెజవాడ టీడీపీలో రేగిన చిచ్చు పార్టీ అధిష్టానాన్ని ఇబ్బందిలో పడేసేదిగా ఉంది.

వెంకన్న కన్నా పెద్ద స్థాయిలో….

నిజానికి కేశినేని నాని విజయవాడ పార్లమెంటు సభ్యుడు. బుద్దా వెంకన్న స్థాయికంటే పెద్దది. బుద్దా వెంకన్న విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ అధికారంలో ఉన్నప్పుడు బుద్దావెంకన్న, కేశినేని నానిలు సమన్వయంతోనే పనిచేశారు. గతంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కలసి పనిచేశారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయిన తర్వాత నుంచి వీరి మధ్య వివాదం చోటు చేసుకుంది.

తన సిఫార్సును కాదని….

ఇక కేశినేని నాని కోపమంతా గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ తాను చెప్పిన వారికి ఇవ్వలేదన్నదేనని చెబుతున్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు ప్రోత్సాహంతో బుద్దా వెంకన్న తాను సిఫార్సు చేసిన వారికి టిక్కెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారన్న ఆగ్రహంతో ఉన్నారు. అలాగే విజయవాడ నగర తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నీ తనకు తెలియకుండా ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల విజయవాడ కార్పొరేటర్ల సమావేశాన్ని కేశినేని నాని ఏర్పాటు చేస్తే నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బుద్దా వెంకన్న ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.

వెంకన్న వెనక….?

ఇది మాత్రమే కాకుండా బుద్దా వెంకన్నను ఎవరో వెనకుండి తనపై ఆరోపణలు చేయిస్తున్నారన్నది కేశినేని నాని అనుమానం. వెంకన్న వెనక నారా లోకేష్ ఉన్నట్లు కేశినేని భావిస్తున్నారు. లోకేష్ వర్గంగా ఉన్న బుద్దా వెంకన్న ఆయన అండదండలతోనే తనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారని తన సన్నిహితుల వద్ద కేశినేని నాని అన్నట్లు సమాచారం. అందుకే తాడోపేడో తేల్చుకునేందుకు తాను కూడా రెడీ ఉన్నానని ఆయన పార్టీకి సంకేతాలు పంపిించారట. మొత్తం మీద ఇద్దరి మధ్య వివాదం ముదరడానికి లోకేష్ కారణమని కేశినేని నాని చెప్పకనే చెబుతున్నారు.

Tags:    

Similar News